Telangana History Team
-
9 అడుగుల ద్వారపాలకుడి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామ శివారు పొలాల్లో తాజాగా పరిశోధకులు తెలంగాణలోనే అతిపెద్దదైన, దాదాపు 9 అడుగుల ఎత్తున్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహాన్ని గుర్తించారు. విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కరుణాకర్, మహ్మద్ నసీరుద్దీన్లు ఈ విగ్రహాన్ని ఆదివారం పరిశీలించారు. దాదాపు వెయ్యేళ్ల క్రితం చెక్కిన ఈ గ్రానైట్ శిల్పం కుడి చేతిలో గద, ఎడమ చేయిన సూచీ ముద్రగానూ, పైరెండు చేతుల్లో శంఖుచక్రాలను, తలపై కిరీటం, ఆభరణాలు, నడుము దిగువన వస్త్రాన్ని చెక్కి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిమ లక్షణాల ఆధారంగా ఈ శిల్పాన్ని రాష్ట్ర కూటుల అనంతరం కల్యాణ చాళుక్య కాలానికి అంటే 10వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. దీన్ని సంరక్షించి భావి తరానికి అందించాల్సిన అవసరం ఉందని, ఈ విగ్రహ నేపథ్యాన్ని గుర్తించేందుకు పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి
సాక్షి, హైదరాబాద్: అరుదుగా ఉండే పెట్రోగ్లిఫ్స్‌తో కూడిన మెన్హిర్ ఒకటి సూర్యాపేట–కోదాడ దారిలో కనిపించింది. మునగాల మండలంలోని మాదాల గ్రామ శివారులో పొలాల్లో ఉన్న ఈ 15 అడుగుల ఎత్తైన నిలువు రాయిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, వేముగంటి మురళి, సామ లేటి మహేశ్ గుర్తించారు. అది ఒకటి నుం చి మూడు శతాబ్దాల మధ్య కాలంనాటిది కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ గతంలో ఆదిమానవుల సమాధులు ఎన్నో ఉం డేవి. కానీ కాలక్రమంలో వ్యవసాయ పొలాలు విస్తరించి ధ్వంసమయ్యాయి. మెన్హిర్ మాత్రం చెదరకుండా నిలిచి ఉంది. దీనిపై ఓవైపు చతురస్రం, అలల లాంటి ఆకా రా లు చెక్కి ఉన్నాయి. ఇవి లిపి గుర్తులా, వేరే బొమ్మలా అనేది గుర్తిం చాల్సి ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల, సిద్దిపేట సమీపంలోని పుల్లూరులలో లభించిన మెన్హిర్‌లపై ఇలాంటి పెట్రో గ్లిఫ్స్ కనిపించాయని చెప్పారు. గతంలో ఇక్కడ రాతియుగం ఆయుధాలు, పరుపు బండపై ఆయుధాలు నూరడంతో ఏర్ప డిన గంతలను గుర్తించారు. అరుదైన ఈ భారీ మెన్హిర్ను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు పరిశోధకులు సూచించారు. ఏంటీ ఈ మెన్హిర్లు? ప్రాచీనకాలంలో ప్రముఖులు, ఏదై నా సమూహం, పెద్ద వ్యక్తి సమాధి ముందు నిలువురాళ్లను పాతేవారు. మెన్హిర్‌గా పేర్కొనే ఇలాంటివి అక్కడ క్కడా దర్శనమిస్తున్నాయి. ఆరాళ్లపై గుర్తులు చెక్కడం (పెట్రో గ్లిఫ్స్) కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలా కొన్ని చిహ్నాలు చెక్కిన అరుదైన నిలువు రాయి తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటి రాళ్లపై అవగాహన లేని స్థానికులు వీటిని కూల్చి ఇతర అవసరాలకు వాడేసుకుంటున్నారు. -
Basar: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కోటలోకి అడుగుపెడితే.. కళ్లు చెదిరే శిల్పకళ మన కళ్లముందు కదలాడుతుంది. అలాంటి శిల్పాలెన్నో ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. తెలంగాణ నలుమూలలా నాటి విధ్వంసాలకు మూగ సాక్ష్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. దాడుల నుంచి ప్రజలు తప్పించుకుని పొలాల్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేవారు. కొంతమంది అపురూప శిల్ప సంపదనూ మట్టిదిబ్బల కింద దాచి కాపాడుకున్నారు. అలా దాచినట్టుగా భావిస్తున్న కొన్ని శిల్పా లు తాజాగా వెలుగు చూశాయి. అప్పుడు శివలింగం.. ఇప్పుడు అరుదైన విగ్రహాలు నిర్మల్ జిల్లా బాసరకు అతి చేరువలో ఉన్న మైలా పూర్లో తాజాగా కొన్ని విగ్రహాలు వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌కు చెందిన పొలం లోని బావి పక్కన ముళ్ల పొదలను తొలగిస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గతంలో ఇక్కడ ఓ శివలింగం వెలుగుచూడగా స్థానికులు దానికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అరుదైన భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహం, రెండు అమ్మదేవతల విగ్రహాలు, ఓ అయ్యదేవర శిల్పం బయటపడ్డాయి. ఇవి 11వ శతాబ్దం మొదలు 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. అప్పట్లో ముస్లిం పాలకుల సైన్యంతోపాటు రోహిల్లా తెగకు చెందినవారు కూడా ఈ ప్రాంతాలపై దాడులు చేసేవారు. స్థానికుడైన మక్కాజీ పటేల్ ప్రజలతోపాటు శిల్ప సంపదను కూడా దాచి కాపాడాడని స్థానికుల కథనం. ఈ విగ్రహాలు కూడా ఆయన దాచినవే అయి ఉంటాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి కొంత దూరంలో కొన్ని శిథిల దేవాలయాలున్నాయని, దేవాలయ స్తంభాలతో నిర్మించిన ఓ అషూర్ఖానా కూడా అక్కడ ఉందన్నారు. బుద్ధుడి భంగిమే ప్రత్యేకం.. బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయమైందన్న మాటలను అనుమానిస్తూ అందుకు సాక్ష్యమేంటని కొందరు ప్రశ్నించిన సమయంలో ‘భూమే’సాక్ష్యం అని బుద్ధుడు చూపాడని చెబుతారు. అలా భూమిని చూపే ముద్రలో ఉన్న బుద్ధుడి శిల్పం ఇక్కడ వెలుగుచూసిందని హరగోపాల్ పేర్కొన్నారు. చదువుల తల్లి సరస్వతి క్షేత్రమే బాసర అయినందున ‘విద్యాశరణ సంపన్నుడై’న బుద్ధుడి విగ్రహాన్ని అప్పట్లో స్థానికంగా ఏర్పాటు చేసుకుని ఆరాధించి ఉంటారని చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారని చెప్పారు. అయ్యదేవర విగ్రహం మైలారదేవుడిదని, విశ్వకర్మ వర్గానికి చెందినవారు కొలిచే మమ్మాయి దేవత ప్రతిరూపాలు కూడా రెండున్నాయన్నారు. ఇనుముకు ప్రతిరూపంగా ఈ దేవతను కొలుస్తారని, పక్కనే సూదులమ్మ గుడి ఉన్నందున.. సూదులంటే ఇనుముకు గుర్తే అయినందున ఇవి మమ్మాయి దేవతలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఖండేరాయుని జాగ అని పిలుస్తారని, మైలారదేవుడిని తెలంగాణ ప్రాంతంలో మల్లన్న అని, కొన్ని ఇతర ప్రాంతాల్లో ఖండోబా అని పిలుస్తారని, ఆ ఖండోబా పేరుతోనే ఈ ప్రాంతానికి ఖండేరాయుని జాగా అని పేరు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విగ్రహాలకు వేదిక నిర్మించనున్నట్టు తెలిపారు. చదవండి: హ్యాట్సాఫ్ ఎస్ఐ: గోడెక్కిన చదువు -
ఆదిమానవుల పే..ద్ద సమాధి!
నల్లగొండ జిల్లా ఎర్రగడ్డగూడెం శివారులో వెలుగులోకి.. దేశంలోనే అతి పెద్దదంటున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం 72 మీటర్ల చుట్టుకొలతతో సమాధి.. దానిపై వృత్తాకారంలో 50 గండ శిలలు ఇది ఆదిమానవుల తెగ నేతదని చరిత్రకారుల వెల్లడి హైదరాబాద్: దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న బృహత్ శిలాయుగపు మానవ సమాధి వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం శివారు చెలకల్లో ఈ సమాధి బయటపడింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం మూడు రోజుల క్రితం దీన్ని పరిశీలించి ఆదిమానవులకు సంబంధించి ఇంతటి విశాలమైన సమాధి జాడలు ఇప్పటివరకు దేశంలో రికార్డు అయిన దాఖలాలు లేవని తేల్చింది. 72 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న ఈ సమాధిపై ఏకంగా 50 గండ శిలలు వరుసగా పేర్చి ఉన్నాయి. సమాధికి గుర్తుగా పెద్దపెద్ద రాళ్లను వృత్తాకారంలో ఏర్పాటు చేయటం ఆదిమానవుల కాలం నాటి ఆనవాయితీ. అలా వరసగా పేర్చిన రాళ్లు కనిపిస్తే అది ఆదిమానవుల సమాధి అని సులభంగా గుర్తించొచ్చు. ఇలాంటి ఆకృతులు తెలంగాణలో విరివిగా కనిపిస్తాయి. కానీ వాటిల్లో 12, 14, 18, 24.. సంఖ్యలో వృత్తాకారంలో రాళ్ల వరస కనిపిస్తుంది. కానీ తాజాగా వెలుగుచూసిన సమాధిలో 50 రాళ్లను వాడటం విశేషం. గతంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామ శివారులో 50 మీటర్ల చుట్టుకొలతతో కూడిన ఓ సమాధి వెలుగుచూసింది. అలాగే పురావస్తు విభాగం సర్వేలో కరీంనగర్ జిల్లా నర్మెటలో 20 మీటర్ల వ్యాసంతో ఉన్న సమాధి బయటపడింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వెలుగుచూసిన అతిపెద్ద సమాధులివే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40-50 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న సమాధుల జాడలు కనిపించినా 70 మీటర్ల కన్నా ఎక్కువ వ్యాసంతో ఉన్న సమాధి వెలుగుచూడలేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, పజ్జూరు గ్రామ ఔత్సాహికుడు మురళి సాయంతో ఈ భారీ సమాధిని పరిశీలించినట్టు వారు వెల్లడించారు. ఆ సమాధి తెగ నాయకుడిదా? ఆదిమానవులకు సంబంధించిన అంశాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వారి సమాధులను తవ్వినప్పుడు అస్థిపంజరాలే కాకుండా వాటి చుట్టూ అలంకరణ వస్తువులు, తినుబండారాలను ఉంచిన మట్టి పాత్రలు, ఆయుధాలు, పనిముట్లు వెలుగుచూస్తుంటాయి. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వాటిని అతనితోపాటు సమాధి చేయటం అప్పట్లో ఆనవాయితీ. వారి సమాధుల తవ్వకాల్లో ఇలాంటివి బయటపడేవి. ప్రస్తుతం వెలుగుచూసిన సమాధి ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోని పజ్జూరు శివారులో కొంతకాలం క్రితం పురావస్తుశాఖ తవ్వకాలు జరిపింది. అక్కడ కూడా పదుల సంఖ్యలో బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. కానీ అవన్నీ చిన్నవి. ఈ అతి భారీ సమాధి నాడు ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన ఆదిమానవుల తెగ నాయకుడిదై ఉంటుందని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు పేర్కొంటున్నారు. ఆంగ్లేయుల కాలంలో 1924లో హైదరాబాద్ ఆర్కియాలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా రాయగిరిలో తవ్వకాలు జరిపి విశాలమైన సమాధులను గుర్తించారు. ఆ విషయాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ప్రతినిధి ఈహెచ్ హన్స్ తాను రాసిన ఓ వ్యాసంలో వివరించారు. ఎర్రగడ్డగూడెం-పజ్జూరు మధ్య ఉన్న గార్లచెరువుకు వేల సంవత్సరాల నుంచి నీటి వనరుగా ఖ్యాతి ఉంది. నీటి వనరులున్న చోట ఆదిమానవుల ఆవాసాలుండేవి. అందుకే ఈ ప్రాంతంలో చాలా చోట్ల వారి సమాధులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బయటపడిన అతిపెద్ద సమాధి ప్రాంతాన్ని కూడా పురావస్తు శాఖ శోధించి అందులో ప్రత్యేకతలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.