రూ.5 వేల కోట్లు!
► జీఎస్టీతో తెలంగాణకు ఏటా వాటిల్లే నష్టం ఇది
► ఐదేళ్లపాటు తామే భరిస్తామంటున్న కేంద్రం
► ఆ తర్వాత అయినా నష్టం తప్పదంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది. అయితే అంతమేర నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయిదేళ్ల పాటు ఈ నష్ట పరిహారాన్ని చెల్లించనుంది. అయితే అయిదేళ్ల తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం అంత మేరకు నష్టపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. తాజాగా జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించటంతో వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి వ్యాట్‌కు బదులు రాష్ట్రంలో స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్టపోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై పన్నుల వసూలు నిలిచిపోతుంది. దీంతోపాటు అంతర్రాష్ట్ర సీఎస్టీ వసూలు ఒక శాతానికి తగ్గిపోతుంది. అలాగే కేంద్ర పన్నుల వాటాలో 12.5 శాతం పన్నులున్న కొన్ని ఉత్పత్తులకు కేవలం 5 శాతం పన్ను విధిస్తారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.5,000 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అంతమేరకు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పినా.. నిధుల కోసం రాష్ట్రం ఎదురుచూడక తప్పదు. కానీ జీఎస్టీతో రాష్ట్రాలు నష్టపోయే మొత్తం సామాన్యులకు లాభంగా మారుతుందనే విశ్లేషణలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను మినహాయించటంతో అంతమేరకు వినియోగదారులకు లాభం చేకూరాలి. ఇతర పన్నుల ద్వారా నష్టపోతున్న మొత్తం కూడా నేరుగా వినియోగదారులకు లాభంగా మారాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.