టీఆర్ఎస్ పార్టీ తల్లి.. కాంగ్రెస్ నర్సు
డిచ్పల్లి/బాల్కొండ/కామారెడ్డి: తెలంగాణ రాష్ర్ట సమితి తల్లిలా ప్రయోజనం ఆశించకుండా సేవ చేస్తే.. కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సేవ చేసే నర్సులాంటిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని... కాంగ్రెస్‌లో ముగ్గురు మొనగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పరోక్షంగా పొన్నాల, డీఎస్, షబ్బీర్‌లను ఉద్దేశించి అన్నారు.
మాటిమాటికి కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, అరెస్టు చేయాలని అంటున్నారని, వృద్ధులు.. వితంతువుల పింఛన్ రూ. వెయ్యి, వికలాంగుల పింఛన్ రూ.1,500లకు పెంచినందుకు కేసీఆర్‌ను అరెస్టు చేయాలా? పురుగుల అన్నానికి బదులు హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టినందుకు అరెస్టు చేయాలా అని ప్రశ్నించారు. 60 ఏళ్ల దరిద్రం ఆరునెలల్లో పోదని, సీఎం కేసీఆర్ రాత్రిబవళ్లు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జోడు గుర్రాల్లా అభివృద్ధి, సంక్షేమ పనులతో బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తోందన్నారు. కార్యకమాల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు పాల్గొన్నారు.