లోపం ఎక్కడుంది?
అన్ని వసతులు ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది
టీచర్లను నిలదీసిన పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు
హైదరాబాద్: ‘‘నేను మూడు రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కొత్తపల్లిలోని శివారెడ్డి గూడెంకు వెళ్లి అక్కడి పాఠశాలలో మీటింగ్ పెట్టాను. అక్కడ అంతా బాగానే ఉంది. ఆరు గదులతో పాఠశాల, కాంపౌండ్ వాల్, తాగునీరు, మూత్రశాలలు ఉన్నాయి. అయితే పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీస్తే 13 మంది అని తేలింది. సరే అక్కడే ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు అని తెలుసుకుంటే 410 మంది ఉన్నారని తెలిసింది. మరి లోపం ఎక్కడుంది’’ అని రాష్ట్ర పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఉపాధ్యాయులను నిలదీశారు. శనివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణోత్సవానికి వచ్చిన చిరంజీవులు మాట్లాడుతూ ‘మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఉచిత పాఠపుస్తకాలు, దుస్తులు, అన్ని సదుపాయాలతో విద్యను అందిస్తున్నాం, అయినా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఏటా లక్ష నుంచి 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు మారాలని, పాఠశాలకు సమయానికి రావడంతో పాటు బోధన పద్ధతిలో కూడా కొంత మార్పు తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఐదు వేల పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని మూలన పెట్టకుండా విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు చెప్పాలని సూచించారు.