‘ఎస్సీ వర్గీకరణపై బాబు స్పందించాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేలు డిమాండ్ చేశారు. మాదిగల జనాభా ప్రకారం వర్గీకరణ జరగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారని, ఈ నేపథ్యంలో అఖిల పక్షాన్ని ఈ నెల 6న ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని బాబుకు హితవు పలికారు. వర్గీకరణ ఒక ప్పుడు జరిగినట్లే జరిగి కొన్ని కారణాలతో వెనక్కుపోయిందని, అయినా మాదిగలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు కేసీఆర్ను కలసి ఎస్సీ వర్గీ కరణ కోరగా.. ఆయన తన మద్దతు తెలిపా రని గుర్తు చేశారు. వర్గీకరణకు మద్దతుగా కేసీఆర్ రెండుసార్లు లేఖలు ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళుతున్నారని తెలిపారు. కేంద్రం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు.