Tele Caller
-
గుర్తుపెట్టుకోండి.. అలాంటి కాల్స్ చేసిన కటకటాలే!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టెలీకాలర్లపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇప్పటి వరకు వీటి నిర్వాకులను మాత్రమే అరెస్టు చేస్తూ... ఉద్యోగులైన కాలర్లను వదిలేసేవారు. అయితే నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సూత్రధారులతో పాటు పాత్రధారులనూ అరెస్టు చేయడం తప్పనిసరని భావించిన అధికారులు టెలీ కాలర్లపైనా చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో జాబ్ ఫ్రాడ్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు టెలీ కాలర్లను అరెస్టు చేయగా... బుధవారం నాటి లోన్ యాప్స్ కేసులో 60 మందికి నోటీసులు జారీ చేశారు. ఇకపై ఈ విధానం కొనసాగనుంది. ►లోన్ యాప్స్, జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్, కేవైసీ అప్డేట్.. ఇలా వ్యవస్థీకృతంగా జరిగే సైబర్ నేరాలకు ఉత్తరాదితో పాటు బెంగళూరులో ఉన్న కాల్ సెంటర్లే అడ్డాలుగా ఉంటున్నాయి. ►ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాలను అద్దెకు తీసుకుంటున్న సూత్రధారులు ఆన్లైన్లో లక్షల సంఖ్యలో మొబైల్ నెంబర్లు ఖరీదు చేస్తున్నారు. టెలీ కాలర్లను ఏర్పాటు చేసుకుని ఆయా నంబర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. ►ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడి వలవేయటానికి టెలీ కాలర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి వారిలో అత్యధికులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన యువతులే ఎక్కువగా ఉంటున్నారు. ►వీరిని పర్యవేక్షించే సూపర్వైజర్లు, మేనేజర్లు మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సైబర్ నేరం దర్యాప్తులో కాల్ సెంటర్ గుట్టు బయటపడితే సైబర్ క్రైమ్ పోలీసులు వాటిపై దాడులు చేస్తున్నారు. ►కొన్ని రోజుల ముందు వరకు సూత్రధారులతో పాటు సూపర్వైజర్లు, మేనేజర్లను మాత్రమే అరెస్టు చేసేవారు. టెలీకాలర్లకు కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టేవాళ్లు. ►అయితే ఇలా ఓ కాల్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన టెలీకాలర్లు మరో దాంట్లో చేరుతున్నారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని సూత్రధారులు వీరికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వీరు మరికొందరిని బాధితులుగా మారుస్తున్నారు. ►దీనిని గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు టెలీకాలర్ల పైనా చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కాల్ సెంటర్‌పై దాడి చేశారు. ►ఈ కేసులో సూత్రధారులతో సహా ఐదుగురు టెలీ కాలర్లను అరెస్టు చేశారు. వీరందరినీ సిటీకి తరలించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ►బెంగళూరులోని లోన్ యాప్స్ కాల్ సెంటర్లో మాత్రం 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి సిటీకి తీసుకురావడంలో అనేక ఇబ్బందులు ఉంటాయని అధికారులు గుర్తించి, ఇద్దరు సూత్రధారుల్ని తరలించారు. ►దీంతో వారందరినీ నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం వీరు నడుచుకోవాలని వివరించారు. -
‘రైలు కొనాలి.. రూ.3000 కోట్లు ఇస్తారా?’
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయిన జనాలకు సోషల్ మీడియా మంచి కాలక్షేపంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని పాత జోక్‌లు మరోసారి సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాంటి ఓ పాత ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. బ్యాంకులో పని చేసే ఓ టెలికాలర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగే సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఇది. దీనిలో టెలీకాలర్, ఓ వ్యక్తికి ఫోన్ చేసి లోన్ కావాలా అని అడుగుతుంది. తమ బ్యాంక్ కార్ లోన్, ఇంటి రుణం వంటి వాటి వేర్వేరు సేవలు అందిస్తుందని చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి ‘నాకు లోన్ కావలి.. రైలు కొనాలనుకుంటున్నాను. నేను సమోసా, చిప్స్ చేస్తూ రోజుకు 1500 వందల రూపాయలు సంపాదిస్తున్నాను. నాకు బ్యాంక్ ఖాతా లేదు. కానీ రైలు కొనడానికి నాకు రూ.3000 కోట్లు లోన్ కావాలి. ఇస్తారా’ అని అడుగుతాడు. దాంతో కాల్ కట్ అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ జోక్ ప్రస్తుతం మరోసారి వైరల్‌గా మారింది. This is hilarious.https://t.co/0FgHoHyka0 — governorswaraj (@governorswaraj) May 28, 2020 -
టెలీకాలర్లే పెళ్లి కూతుళ్లు
బోగస్ మ్యారేజ్ బ్యూరో దందా ఇరువురిని అరెస్టు చేసిన సీసీఎస్ సిటీబ్యూరో: ప్రత్యేకంగా టెలికాలర్లను ఏర్పాటు చేసుకుని, వారినే పెళ్లికూతుళ్లుగా ‘మార్చి’ అవివాహితుల్ని మోసం చేస్తున్న బోగస్ మ్యారేజ్ బ్యూరో గుట్టును సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ అధికారులు రట్టు చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నగరానికి చెందిన ఎస్.వాసవి, వి.లక్ష్మీదేవి చిక్కడపల్లి ప్రాంతంలో ‘న్యూ లైఫ్’ మ్యారేజ్‌బ్యూరో పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. వీరు గత ఏడాది నవంబర్‌లో ఓ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ‘30 ఏళ్ల మహిళకు వరుడు కావాలని, ఆమెకు ఏడాది రూ.14 లక్షల జీతం వస్తుందని, సొంత అపార్ట్‌మెంట్‌తో పాటు 10 ఎకరాల పొలం, 10 ఎకరాల కొబ్బరితోట, రూ.ఆరు కోట్ల ఆస్తి’ ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరుడు కావాలని ఆ ప్రకటనలో సూచించారు. దీని పట్ల ఆకర్షితుడైన వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఎం.సునీల్ సదరు ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేయగా, నిర్వాహకులు చిక్కడపల్లిలోని తమ కార్యాలయానికి రమ్మని చెప్పి ఆ ప్రకటనకు సంబంధించి బోగస్ ప్రొఫైల్స్ చూపించారు. రిజిస్ట్రేషన్ పేరుతో రూ.3 వేలు కట్టించుకుని, ఆపై తమ వద్ద టెలీకాలర్‌గా పని చేస్తున్న ఉద్యోగినినే పెళ్ళికూతురంటూ సునీల్‌కు ఫోన్ చేయించారు. అతడితో పెళ్ళికూతురు మాదిరిగా మాట్లాడిన టెలీకాలర్ వచ్చే వారం కలుద్దామంటూ చెప్పింది. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తిచిన సునీల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.శంకర్రావు మంగళవారం వాసవి, లక్ష్మీదేవిలను అరెస్టు చేశారు. వీరు ఇదే తరహాలో పత్రికల్లో ప్రకటలు ఇస్తూ పలువురిని మోసం చేశారన్నారు.