నటి రోజా ఇంటర్వ్యూ
ఫ్రమ్ డే వన్...
ఎవరో ఒకరు రోజా వెంట పడుతూనే ఉన్నారు.
‘చెయ్యను మొర్రో’ అంటే... సినిమావాళ్లు
రాజకీయాల్లోకి రమ్మంటూ పార్టీలవాళ్లు
వెళితే బాగుంటుంది కదా అని ఇంట్లోవాళ్లు
‘ఐరన్ లెగ్’ అని అవతలిపార్టీ ఆడవాళ్లు
‘మా హీరోనే అంటావా’ అని ఎగిరినవాళ్లు!
ఇక ఇప్పుడైతే...
‘ఒక్క ఎపిసోడ్ అయినా చెయ్యమని’ టీవీవాళ్లు
‘చిన్నప్పట్నుంచీ మీ ఫాన్స్ మేడమ్’ అనేవాళ్లు
ముక్కులు బద్దలు కొట్టొద్దని చెప్పొచ్చేవాళ్లు!
టిల్ డేట్...
రోజాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫాలోయింగ్.
పూలిచ్చినవాళ్లెందరో... రాళ్లేసినవాళ్లందరు!
ఇందులో ఆశ్చర్యం లేదు.
ఫైరు, స్మైలు కలిస్తే... రోజా.
ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
ఆ... ఫైర్ మీలో కొత్త ఉత్తేజాన్ని రేపుతుంది.
ఆ... స్మైల్ మిమ్మల్ని హాయిగా కమ్మేస్తుంది.
ఓవైపు ఇల్లాలిగా, మరో వైపు పొలిటికల్ లీడర్‌గా, ఇంకోవైపు నటిగా, మరోవైపు వ్యాఖ్యాతగా... ఇన్ని బరువుల్ని ఒకేసారి ఎలా మోయగలుగుతున్నారు?
రోజా: అర్థం చేసుకునే భర్త ఉంటే... ఇన్ని బాధ్యతలు ఏ ఇల్లాలైనా మోయగలదు. నా బలం, నా బలహీనత రెండూ మా ఆయనే. నటిగా బిజీగా ఉన్న రోజుల్లోనే ‘తెలుగుదేశం’ నుంచి పిలుపు వచ్చింది. ‘నువ్వు రాజకీయాల్లో కరెక్ట్’ అని నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారాయన.
రాజకీయాలంటే ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో చెప్పలేం. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కానీ మీరు నింపాదిగా టీవీషోలు, సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
రోజా: టీవీషోలది పెద్ద సమస్య కాదండీ. ఎందుకంటే... బ్యాంకింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక సినిమాలంటారా? విరగబడి సినిమాలు చేయాలని నాకైతే లేదు. ‘నేను చేయను మొర్రో..’ అంటున్నా.. నా వెంట పడుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాలన్నీ దాదాపు అలాంటివే. తెలిసిన వాళ్లతో రికమండ్ చేయించుకొని మరీ నాతో నటింపజేస్తున్నారు. నా దృష్టిలో అవి కూడా పెద్ద సమస్య కాదు. ‘చేయకూడదు’ అనుకుంటే చేయను. ఇక సమస్యల్లా ఒక్కటే... ఇల్లు. ఇల్లాలిగా మాత్రం నా ఇంటికి తప్పకుండా టైమ్ కేటాయించాలి. ఆ విషయంలోనే కాస్త ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు పిల్లల్ని మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే... ఇలాంటి బాధనే చిన్నప్పుడు నేను అనుభవించాను.
అవునా..?
రోజా: మాది అప్పర్ మిడిల్‌క్లాస్. మా అమ్మ తిరుపతిలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్స్‌పాల్. నాన్నేమో హైదరాబాద్ సారథి స్టూడియోలో సౌండ్ ఇంజినీర్. దాంతో నాన్నను మిస్ అవ్వాల్సి వచ్చేది. ఎప్పుడో లీవ్ దొరికినప్పుడు వచ్చేవారాయన. నేను టెన్త్‌లో ఉన్నప్పుడనుకుంటా... అమ్మకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడైతే.. అమ్మను కూడా మిస్ అయ్యాను. తాతయ్య దగ్గరుండి నేనూ, అన్నయ్యలు చదువుకున్నాం. నా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదనే నా బాధ.
మీ నాన్న ‘సారథీ’లో సౌండ్ ఇంజినీర్ అంటే... మీకు సినీ నేపథ్యం ఉందన్నమాట?
రోజా: ఉంది. కానీ నన్ను హీరోయిన్ని చేయాలని మాత్రం నాన్న అనుకోలేదు. నాన్నకు మొదట్నుంచీ దర్శకుడవ్వాలని ఉండేది. గురజాడవారి ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ కథతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. అందులో పూర్ణమ్మగా కోడిరామకృష్ణగారి భార్య పద్మ చేశారు. బుల్లి పూర్ణమ్మగా నేను చేశాను. నటిగా నా తొలి బీజం అప్పుడు పడింది. అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను.
అసలు మీరేం చదివారు?
రోజా: బీయస్సీ హోమ్‌సైన్స్. అది కూడా పూర్తి చేయలేదు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ టైమ్‌లో ‘ప్రేమతపస్సు’ ఆఫర్ వచ్చింది. సెకండియర్‌లో అడుగుపెట్టే సరికే నటిగా బిజీ అయిపోయా!
అసలు మీ దృష్టి సినిమాలవైపు ఎలా మళ్లింది?
రోజా: సినిమా హీరోయిన్ అవుతానని నేను కలలో కూడా అనుకోలేదు. అవాలని కూడా ఉండేది కాదు. హాయిగా.. ఆనందంగా, జాలీగా జీవితాన్ని గడిపేస్తే చాలు అనుకునేదాన్ని. మా ఫ్రెండ్ రాధ వాళ్ల అమ్మ అంటూ ఉండేవారు. ‘చక్కగా ఉంటావు... మీ నాన్న కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు... హీరోయిన్గా ఎందుకు ట్రై చేయవు’ అని! నేను ఆ మాటలు అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. ఓ రోజు ‘ప్రేమతపస్సు’ హీరోయిన్ సెలక్షన్స్ కోసం మా కాలేజ్‌కి వచ్చారు డెరైక్టర్ శివప్రసాద్. కాలేజి ఆల్బమ్‌లో నా ఫొటో చూసి... నా గురించి వాకబు చేశారు. నేను నాగరాజారెడ్డిగారి కూతుర్నని తెలిసి వెంటనే నాన్నను కలిశారు. నాన్న, ఆయన అంతకు ముందే మంచి ఫ్రెండ్సట! అడగ్గానే నాన్న కాదనలేకపోయారు. ‘ఒక సినిమానే కదమ్మా... ట్రై చేయ్’ అన్నారు. నాన్న మాట కాదనలేక చేశాను.
కాదనలేక చేశానంటున్నారు, కంటిన్యూ అయిపోయారే?
రోజా: తొలిసినిమా అప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి నాలో కసిని పెంచాయి. అందుకే ఆర్టిస్ట్‌గా నన్ను నేను నిరూపించుకోవాలనే.. నటిగా కొనసాగాను. ఆ అనుభవాల గురించి ఇప్పుడు మాత్రం చెప్పలేను. సారీ.
ఎప్పుడో పాతికేళ్ల నాటి కథ కదా... చెబితే ఏం పోతుంది?
రోజా: వద్దులేండి. దాని వల్ల కొందరి మనసులు బాధ పడతాయి. అలా ఒకర్ని బాధ పెట్టడం నా పద్ధతి కాదు. అందుకే చెప్పను. అసలు ఆ సినిమా చేయడమే ఇష్టం లేకుండా చేశాను. ఎందుకంటే... అందులో నాది ఓ పేదింటి పిల్ల పాత్ర. పొట్టి లంగా, చింపిరి జుట్టు, చాలా డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్. నేనేమో అప్పట్లో బాగా ట్రెండీగా ఉండేదాన్ని. సో, ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. చెప్పకుండా పారిపోదాం అని కూడా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చెబుతుంటే గుర్తొస్తుంది... ‘బిగ్‌బాస్’ టైమ్‌లో చిరంజీవిగారు కూడా అన్నారు - ‘నువ్వు ఇష్టం లేకుండా ఈ రంగంలోకొచ్చావ్. కానీ ఇన్ని సినిమాలు చేశావ్. నువ్వు ఏమవ్వాలో దేవుడు ముందే రాసేస్తాడు’ అని. ఏది ఏమైనా తొలి సినిమా నాకు మంచి పేరునే తెచ్చిపెట్టింది.
నటిగా ఉన్నప్పుడు చిరంజీవి మీతో ఎలా ఉండేవారు?
రోజా: చాలా బావుండేవారు. ఆయన ఫ్యామిలీలో నేనూ ఓ మెంబర్లా మసిలేదాన్ని. చిరంజీవిగారితో నేను చేసిన తొలి సినిమా ‘ముఠామేస్త్రి’. ఆ సినిమాలో ‘ఎంతఘాటు ప్రేమయో పారిజాతమా..’ మా ఇద్దరిపై తీసిన తొలిపాట. ఆ పాటలో మా మూమెంట్స్ చూసి... చిరంజీవిగారితో ఆయన భార్య సురేఖ ఒకేమాటన్నారు. ‘మీ పక్కన దీటుగా డాన్స్ చేయాలంటే... శ్రీదేవి, రాధ, తర్వాత రోజానే’ అని. ఆ టైమ్‌లో నాకది పెద్ద కాంప్లిమెంట్!
అలాంటి చిరంజీవిపైనే ఫైట్‌కి దిగుతానని అప్పుడు ఊహించి ఉండరు...
రోజా: పాలిటిక్స్ అంటే అంతే. ఓ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేస్తాం. దాని కోసం ఎంతదూరమైనా వెళతాం. పాపం.. ఆ విషయంలో ఆయన షాక్ అయ్యి ఉంటారు. చాలా అభిమానంగా ఉండేవాళ్లం కదా. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఎదురవుతుంటాం. నన్ను చూడగానే... మొహం అదోలా పెట్టుకుంటారు. మాట్లాడకుండా సీరియస్‌గా కూర్చుంటారు. నేనూ మాట్లాడను. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటేనే రాజకీయాల్లో ఇమడగలం. ‘చిరంజీవిలాంటి సున్నితమనస్కుడు రాజకీయాల్లో పనికిరాడు’ అని నేను చాలా చోట్ల చెప్పాను కూడా.
అసలు రాజకీయాల్లో మీకున్న ఆవేశం పనికిరాదేమో!
రోజా: చూడండీ... నేను స్త్రీని. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేను. ‘ఆడది’ అంటే చాలు... తేలిగ్గా బురదజల్లేయడం ప్రస్తుతం చాలామందికి పరిపాటి అయింది. ఏ రంగంలోనైనా.. ఓ స్త్రీ డామినేటింగ్‌గా పైకొస్తుందంటే చాలు... ఆమెను ఎదుర్కోలేనివాళ్లు చేసే పని ఒక్కటే. ‘క్యారెక్టర్‌పై దెబ్బ కొట్టడం’!
అభిమానింపబడటం తప్ప.. ద్వేషించబడటం తెలీని మీపై... శోభారాణి, గంగాభవాని లాంటివాళ్లు తీవ్ర పదజాలాలతో దాడిచేసినపుడు అంతర్మథనం చెందలేదా..?
రోజా: నేను స్త్రీ పక్షపాతిని. సదరు స్త్రీ మంచిదవ్వనీ చెడ్డదవ్వనీ.. నేను మాత్రం వాళ్లను ద్వేషించను. చుట్టూ ఉన్న వాతావరణం, ప్రభావితం చేసే మనుషుల వల్ల వాళ్లలా ప్రవర్తించి ఉంటారని వదిలేస్తాను. నన్నెంతమంది పర్సనల్‌గా నిందించినా... నేను మాత్రం ఎవర్నీ పర్సనల్‌గా మాట్లాడలేదు. మాట్లాడను కూడా. నా ఎదురుగా నిలబడి మాట్లాడలేని సదరు పార్టీ నాయకులు... ఆ పార్టీ ఆడవాళ్లను పురిగొల్పి అలా మాట్లాడిస్తున్నారు.. అంతే. అది చేతగాని వాళ్లు చేసేపని. దాని గురించి నాకసలు బాధ లేదు.
మీరు చిన్నప్పట్నుంచీ ఫైర్బ్రాండేనా?
రోజా: రాజకీయాల్లోకొచ్చాకే నా సెకండ్ఫేస్ బయటకొచ్చింది కానీ... అంతకుముందు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదాన్ని. ‘రోజా అంటే నవ్వుకు కేరాఫ్ అడ్రస్’ అనే పేరు కూడా ఉంది కదా (నవ్వుతూ). కానీ రాజకీయాలు నా లైఫ్‌స్టైల్‌నే మార్చేశాయి. టీవీల్లో నా పొలిటికల్ స్పీచ్‌లు విన్నవాళ్లూ, చెమట్లు కారిపోతున్నా కేర్ చేయకుండా... మైక్ పట్టుకొని నేను మాట్లాడుతుంటే చూస్తున్నవాళ్లు.. ‘ఇన్నాళ్లూ మనం తెరపై చూసిన రోజానేనా?’ అని విస్తుపోతుంటారు. ‘మీ నవ్వుని మిస్ అవుతున్నాం మేడమ్’ అని కూడా చాలామంది అంటుంటారు.
అందుకేనా టీవీషోల్లో నవ్వుతూనే కనిపిస్తున్నారు?
రోజా: కరెక్ట్‌గా చెప్పారు. నిజంగా అందుకే. నా ‘మోడ్రన్ మహాలక్ష్మి’ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేది మిడిల్క్లాస్వాళ్లే. వాళ్లందరూ నా పొలిటికల్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని భయపడుతూ నా దగ్గరకొస్తారు. వచ్చిన గంటకే నాతో కలిసిపోతారు. ‘టీవీల్లో మిమ్మల్ని చూసి ఫెరోషియస్‌గా ఉంటారనుకున్నాం. ఇంత సాఫ్టా?’ అంటుంటారు. వ్యాఖ్యాతగా మారడం ఆ రకంగా నాకు కలిసొచ్చిందనే చెప్పాలి. (నవ్వుతూ) నేనేంటో కొందరికైనా తెలుస్తోంది.
ఎన్టీఆర్ లాంటి వారికి కూడా రాజకీయాల్లోకొచ్చాక విమర్శలు తప్పలేదు. మరి మీరెందుకు వచ్చినట్టు?
రోజా: మీరన్నది పచ్చినిజం. ఆర్టిస్టుగా ఉన్నప్పుడు మేం జనాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టం. డబ్బులు తీసుకొని నటిస్తాం. కానీ మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాల్లోకొచ్చాక.. మా డబ్బుని, టైమ్‌నీ జనాలకోసం వెచ్చిస్తూ వారికోసం ఏదో చేయాలని తపిస్తాం. అయినా మమ్మల్ని చులకనగా మాట్లాడేస్తారు. ఈ విషయంపై నేను ఒకరిద్దరితో ఆర్గ్యూ చేశా కూడా!
ఇంత తెలిసి పాలిటిక్స్‌లోకి ఎందుకొచ్చినట్టు?
రోజా: తెలియకుండానే వచ్చా. నా లైఫ్‌లో అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. అన్నీ అనుకోకుండా జరిగినవే. మరి దేవుడు నన్నెందుకు ఇలా నడిపిస్తున్నాడో, నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో!
జగన్‌గారితో మీ అసోసియేషన్...
రోజా: జగనన్న గురించి చెప్పేముందు, రాజశేఖరరెడ్డి గారి గురించి చెప్పాలి... ఆయన చనిపోయే అయిదు రోజుల ముందు ఆయన్ను కలిశాన్నేను. బొకే తీసుకొని ఆయన చాంబర్లోకి అడుగుపెట్టగానే... నన్ను చూసి ఆప్యాయంగా నవ్వారాయన. ఆ నవ్వు ఇప్పటికీ నా హృదయంలో నిలిచిపోయింది. ఒక్కసారి చూస్తే కళ్లలో నిలిచిపోయే రూపం ఆయనది. తొలిసారి దగ్గరగా ఆయన్ను చూడగానే... తెలీని ఉద్వేగానికి లోనయ్యాను. కన్నతండ్రినో, లేక పెదనాన్ననో చూసిన ఫీలింగ్. ‘భలే మాట్లాడతావమ్మా నువ్వు. చాలామంది మహిళా లీడర్లు ఉన్నారు, కానీ నీలాగా మాట్లాడే అమ్మాయిని మాత్రం నేను చూడలేదు. సున్నితమైన అంశాలను సైతం నువ్వు ఫేస్చేసే విధానం నాకు నచ్చింది. గుడ్.. కీపిటప్’ అన్నారు. నేను తెలుగుదేశం మనిషిని అని తెలిసి కూడా ఆయన నన్ను అలా అభినందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయనతో మాట్లాడిన ఆ 20 నిమిషాలు నా జీవితానికి చాలా విలువైనవి. తర్వాత జగనన్నని చూశాక కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. తండ్రిలోని రాజసం, ఓర్పు, మడమ తిప్పని గుణం, మాట తప్పని నైజం అన్నీ జగనన్నలో కనిపించాయి. పుట్టడమే గోల్డెన్‌స్పూన్‌తో పుట్టారాయన. అసలాయనకు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. ఆయన పార్టీలోకి ఎంతమంది వలస వస్తున్నా... ఆయన పొంగిపోలేదు. ఎవరయినా పార్టీని వీడిపోతున్నా కృంగిపోలేదు. ఒక కమిట్మెంట్తో ముందుకెళుతున్నారాయన. ఇంత చిన్నవయసులో అంత మెచ్యూరిటీ ఉండడం సాధారణమైన విషయం కాదు. అందుకే ఆయన కోసం ఎన్ని కష్టాలు పడ్డా తప్పులేదు అనిపిస్తుంది!
టీడీపీని వదలడానికి కారణం?
రోజా: టీడీపీ నుంచి బయటకు వస్తానని కలలో కూడా అనుకోలేదు. టీడీపీ అన్న మూడక్షరాలను పచ్చ పొడిపించుకుందాం అనుకున్నాను... అంత ప్రేమించాను ఆ పార్టీని! అలాంటి నాకు తీవ్రమైన అన్యాయం చేశారు ఆ పార్టీ అధినేత. ఆయన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన వారికి టికెట్ ఇచ్చి.. నన్ను తీవ్ర నిరాశకు లోను చేశారు. మనస్తాపానికి లోనైన నేను మహానాడుకు కూడా వెళ్లలేదు. మా వారిని బతిమాలితే... తప్పక వెళ్లాను. మీడియా వారు అడిగినప్పుడు కూడా నేను టీడీపీలోనే ఉంటానని చెప్పాను. కానీ మనసు చంపుకొని ఉండలేకపోయాను. చంద్రబాబుని నేను సక్సెస్‌లో ఉన్నప్పుడూ చూశాను. లేనప్పుడూ చూశాను. ఎన్టీఆర్‌లా ఆయన కూడా జనహృదయాల్లో నిలిచిపోయే నేత అవుతారనుకున్నా. కానీ... 2004 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన నిర్ణయాల్లో, ప్రవర్తనలో మార్పు గమనించా. చివరకు విలేకరుల ముందు ఆయన మాట్లాడిన తీరు కూడా దిగజారుడుగా అనిపించింది. ఆయన ప్రవర్తన రుచించలేదు. అందుకే.. గుడ్‌బై చెప్పేశా.
సరే... కాసేపు సినిమాల విషయానికొచ్దేద్దాం... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... నలుగురితోనూ సినిమాలు చేశారు కదా. వారి ఆధిపత్యమెలా ఉండేది?
రోజా: లేదండీ... చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వెంకటేష్‌గారితో మాత్రం ఓసారి విబేధాలు తలెత్తాయి. అందుకే ఆయన సినిమా అంటే నేను ఉండేదాన్ని కాదు. ‘పోకిరిరాజా’ ఒక్కటి చేశా... అంతే!
ఎందుకలా? ఏంటి గొడవ?
రోజా: మా వారికి... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అందరూ ఫ్రెండ్సే. కానీ వెంకటేష్‌గారితో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ‘చినరాయుడు’ ముందు మాట ఇది. వెంకటేష్, విజయశాంతి జంటగా సెల్వమణి దర్శకత్వంలో సినిమా ఓపెనింగ్ కూడా భారీగా జరిగింది. సీఎల్ నరసారెడ్డిగారు నిర్మాత అనుకుంటా.. గుర్తులేదు. సెల్వ లొకేషన్లు చూసే పనిలో ఉన్నాడు. ఇంతలో తమిళంలో ‘చినగౌండర్’ విడుదలవ్వడం, దాని హక్కులు కొనేసి వాళ్లు బి.గోపాల్‌గారితో వెళ్లిపోవడం జరిగింది. సెల్వ చాలా బాధపడ్డాడు. అవమానంగా ఫీలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వెంకటేష్‌గారి ‘పోకిరిరాజా’ సినిమా ఒప్పుకున్నా. నా క్యారెక్టర్ని కూడా షూట్ చేసేశారు. అయితే... మళ్లీ ఓ చిన్న సాంగ్ బిట్ రీషూట్ చేయాలి బెంగళూర్ రమ్మంటే వెళ్లాను. మూడు రోజులు అక్కడే కూర్చోబెట్టారు. ఆ రోజు అక్టోబర్ 22. సెల్వ పుట్టినరోజు. సో... నేను ఎట్టి పరిస్థితుల్లో చెన్నయ్‌లో ఉంటాలి. అప్పటికింకా మేం పెళ్లి చేసుకోలేదు. ప్రేమలో ఉన్నాం. అందుకే ఆలోచించకుండా వెళ్లిపోయాను. వెంకటేష్‌గారు రమ్మంటున్నారని ఫోన్ చేశారు. నాకు సెల్వ కంటే... సినిమాలు ఎక్కువ కాదని చెప్పేశాను. అప్పట్నుంచీ కొంత గ్యాప్. ఆయన సినిమాల్లో నేను ఉండేదాన్ని కాదు. నేను తమిళంలో కథానాయికగా నటించిన పలుచిత్రాల తెలుగు రీమేక్స్‌లో వెంకటేష్‌గారే హీరో. కానీ హీరోయిన్గా మాత్రం నా ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉండేవారు. నేను మామూలుగానే చాలా స్ట్రైట్ ఫార్వార్డ్. అందుకే ఏ సినిమా చేసినా ఎక్కడో ఒకచోట మాట పట్టింపులొచ్చేవి. కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకునేదాన్ని కాదు. అందుకే కె.రాఘవేంద్రరావుగారు కూడా నన్ను హీరోయిన్గా పెట్టుకునేవారు కాదు. ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాకి తీసుకున్నారంటే.. అది చిరంజీవిగారి వత్తిడి మీద జరిగింది. ‘అన్నమయ్య’లో కూడా మోహన్‌బాబుగారి పక్కన ఫస్ట్ అనుకుంది నన్ను కాదు. వేరే హీరోయిన్ను! ‘ఏం.. ఎవరిని పడితే వాళ్లను మా పక్కన పెడతారా? రోజాను పిలవండి’ అని మోహన్‌బాబు అంటే... తప్పనిసరై నన్ను పిలిపించారు.
అంటే... ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మీరు ఫైర్ బ్రాండే అన్నమాట?
రోజా: కమల్‌హాసన్ పక్కన నేను చేయలేకపోవడానికి కారణం కూడా అదే. ఓ ఇంటర్వ్యూలో డెరైక్ట్‌గా అనేశా - ‘అతని సినిమాల్లో ఏముంటుంది? హీరోయిన్లను ముద్దులు పెట్టుకోవడం తప్ప’ అని! అంతే... తమిళనాడు మొత్తం ఆ స్టేట్మెంట్ పెద్ద దుమారమే లేపింది. ఇక మీడియాలో అయితే... సీరియల్స్‌గా కథనాలు వెలువడ్డాయి. అలాగే ‘ఉళైపాళీ’ టైమ్‌లో ఓ విలేకరి అడిగారు. ‘రజనీకాంత్‌తో తొలిసారి చేస్తున్నారు కదా. మీ ఫీలింగ్?’ అని? ‘నాకు కథ ముఖ్యం. దర్శకుడు ముఖ్యం. హీరోల గురించి ఆలోచించను’ అని చెప్పేశా. ఇక అక్కడ గొడవలు లేచాయి. ‘రోజాని సినిమా నుంచి తప్పించాల్సిందే...’ అని రజనీకాంత్ అభిమానులు గొడవ గొడవ చేశారు. (నవ్వుతూ) అయినా నేనే హీరోయిన్గా కంటిన్యూ అయ్యాను, అది వేరే సంగతి!
హీరోయిన్గా ఉన్నప్పుడు స్ట్రగుల్సేమైనా ఫేస్ చేశారా?
రోజా: కథానాయికగా స్ట్రగుల్స్ అనేవి నాకెప్పుడూ ఎదురు కాలేదు కానీ, నిర్మాతగా మారాకే ఇబ్బందులు తలెత్తాయి.
‘సమరం’ గురించేగా మీరు చెప్పేది?
రోజా: అవును. 1995లో నేను, సెల్వ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ సినిమా పుణ్యమా అని 2002లో చేసుకోవాల్సి వచ్చింది. నన్నే నమ్ముకున్న మా అన్నయ్యల్ని సెటిల్ చేయాలని వాళ్ల కోసమే ‘సమరం’ సినిమా తీశా. నా భర్తే దర్శకుడు. ఆయన అప్పుడు మంచి పీక్‌లో ఉన్నారు. రిలీజ్‌కు ముందు ఆ సినిమాపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. చిరంజీవిగారి ‘ముగ్గురు మొనగాళ్లు’, నాగార్జునగారి ‘గోవిందా గోవిందా’ సినిమాలు కూడా అదే టైమ్‌లో విడుదల అవుతున్నాయి. అందుకే శ్రీదేవి స్వయంగా నాకు ఫోన్ చేసి, ‘రోజా.. ఎందుకు మన సినిమాలపైనే వేయడం, పోస్ట్‌పోన్ చేసుకోవచ్చుగా’ అని అడిగారు కూడా. అన్ని అంచనాలతో విడుదలైన ఆ సినిమా... ఊహించని పరాభవాన్ని చవిచూసింది. ఆర్థికంగా ఆ సినిమా వల్ల కలిగిన గాయం మానడానికి ఏడేళ్లు పట్టింది.
మీ కెరీర్‌ని గమనిస్తే... విజయశాంతిని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. చివరకు ఆమెలాగే మీరూ పొలిటిక్స్‌లోకి వచ్చేశారు.
రోజా: ఆమె తేలిగ్గా ఎంపీ అవగలిగారు. నేను అలా కాలేకపోయానుగా. జయసుధగారు కూడా అంతే. పెద్ద రాజకీయ పరిజ్ఞానం లేకుండా కూడా తేలిగ్గా ఎమ్మెల్యే అయిపోయారు. కానీ వారి పార్టీల అధినేతలైన వైఎస్ఆర్, కేసీఆర్‌లు అండగా నిలబడి వారిని గెలిపించుకున్నారు.
ఒకప్పుడు దక్షిణాదిన మేటి దర్శకునిగా చెలామణీ అయ్యారు సెల్వమణి. అలాంటి ఆయన... ఉన్నట్టుండి ఎందుకలా సెలైంట్ అయ్యారు?
రోజా: ఆ బాధ నాకూ ఉంది. నేనూ చెబుతూనే ఉంటాను. ఆయన మాత్రం వినరు. రాజీవ్‌గాంధీ హత్యోదంతంపై అప్పట్లో ఆయన ఓ సినిమా చేశారు. ఆ సినిమా రిలీజ్ కాకుండా రాజకీయంగా చాలా అడ్డంకుల్ని సృష్టించారు. ఆ సినిమాలో రాజీవ్‌గాంధీ హంతకులు ఏవిధంగా ఎస్కేప్ అయ్యారని ఆయన చూపించారో, ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది. అప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయాలని పొలిటికల్‌గా చాలా ప్రెజర్ కూడా తెచ్చారు. మంచివారు కాబట్టి బయట పడగలిగారు. నిజానికి ఆ సినిమా అప్పుడు రిలీజై ఉంటే.. ఆయన కెరీర్ వేరేలా ఉండేది. ఆ తర్వాత చానల్ పెట్టారు. దాన్ని దయానిధి మారన్ వాళ్లు సాగనీయకుండా అడ్డుపడ్డారు. దాంతో ఒక్కసారిగా సెలైంట్ అయిపోయారు. ప్రస్తుతం చెన్నయ్‌లో ఫిలిం చాంబర్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా తప్ప మరో లోకం తెలీని దర్శకుడు సెల్వ. ఆ బుద్ధి నా కొడుక్కీ వచ్చింది. వాడూ అంతే... క్రమం తప్పకుండా ఏదో ఒక సినిమా చూడాల్సిందే. ఇంతకీ మా పిల్లల గురించి చెప్పలేదు కదూ. నా కూతురు పేరు అంజుమాలిక, అబ్బాయి పేరు కౌశిక్. ఇద్దరూ బాగా చదువుతారు. మా భార్యాభర్తలం ఎంత బిజీగా ఉన్నా.. ఒక్కరైనా సరే... వీరి కోసం ఇంట్లో ఉండాల్సిందే. అదే మా కండీషన్. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా, పిల్లల కోసమేగా!
- బుర్రా నరసింహ
చిన్నప్పట్నుంచీ కృష్ణగారి అభిమానిని. ఆయన సినిమా వస్తే... తొలి రోజు తొలి ఆట చూడాల్సిందే! అలాంటి నేను... కృష్ణగారితో నటించే అవకాశం రెండుమూడు సార్లు వచ్చినా... డేట్స్ ఎడ్జస్ట్ చేసుకోలేకపోయాను. చివరికి కృష్ణగారి 300వ సినిమా ‘తెలుగువీర లేవరా’లో హీరోయిన్గా చేయగలిగాను. ఆ క్షణాలు నా జీవితంలో మరచిపోలేను. నా అభిమాన హీరో పక్కన స్టెప్పులేసే అవకాశం ఆ సినిమా ద్వారా నాకు లభించింది. కృష్ణగారు డాన్స్ చేస్తుంటే చాలా ముచ్చటగా ఉండేది. తర్వాత ‘సంభవం’, ‘వైభవం’... ఇలా చాలా సినిమాల్లో ఆయనకు జోడీగా చేశా. ఆయన తర్వాత చిరంజీవి, నాగార్జున అంటే ఇష్టం.
‘ఐరన్‌లెగ్’ అన్నవాళ్ల నోళ్లు మూయించడానికే జగనన్న ఆ పనిచేశారు!
మిమ్మల్ని విమర్శించాలంటే... ఎవరైనా ముందు వాడే పదం ‘రోజా ఐరన్‌లెగ్’ అని! వాళ్లందరికీ మీరు చెప్పే సమాధానం?
రోజా: తిరుపతి ఉపఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికొచ్చిన తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి... ‘రోజా ఐరన్‌లెగ్. ఆమె ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఆ పార్టీ గెలవదు’ అనేసి పోయింది. తర్వాత కాంగ్రెస్ తరఫున గంగాభవాని వచ్చి ‘ఐరన్‌లెగ్’ అని వెళ్లింది. కౌంటింగ్ మొదలైనప్పుడు మొదటి రౌండ్ కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. అంతే... ఇక టీవీ ఛానల్స్ ముందు రెచ్చిపోయింది గంగాభవాని. ‘రోజా ఐరన్‌లెగ్’ అంటూ కెమెరాల ముందు ఏకరువు పెట్టింది. కానీ చివరకు మేం గెలిచాం. మా కరుణాకరరెడ్డి అన్న గెలిచాడు. ఇప్పుడు ఎవరు ఐరన్‌లెగ్. చిరంజీవి ఐరన్లెగ్గా? లేక గంగాభవాని ఐరన్లెగ్గా? కిరణ్‌కుమార్‌రెడ్డి ఐరన్లెగ్గా? లేక ప్రతిపక్షనేత చంద్రబాబు ఐరన్లెగ్గా? చెప్పండి?. అసలు నా విషయంలో ‘ఐరన్‌లెగ్’ అనే పదాన్ని పాస్ చేసిందే టీడీపీ వాళ్లు. నేను ఆ పార్టీ నుంచి జగనన్న పార్టీలోకొచ్చానన్న అక్కసుతో... నాకీ టైటిల్ తగిలించారు. ‘రోజా మా పార్టీలోకొచ్చింది. మా నాయకుడికి యాక్సిడెంట్ అయ్యింది. రాజశేఖరరెడ్డి దగ్గరెళ్లింది ఆయన చనిపోయారు’ అని ప్రాపగాండ లేపారట. నేను రావడం వల్లే రాజశేఖరరెడ్డిగారు చనిపోతే... 1999లో నేను తెలుగుదేశం పార్టీలోకొచ్చాను. అప్పుడు చంద్రబాబుకు ఏం కాలేదుగా! పైగా ఆ ఏడాదే ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఎలక్షన్స్‌ని ఫేస్ చేసి గెలిచాడు. నిజంగా నాది ఐరన్‌లెగ్ అయితే... చంద్రబాబు ఓడిపోవాలి కదా! మూఢనమ్మకాలను ప్లే చేసి నన్ను తొక్కేయాలని చూడటం ఎంత దారుణం చెప్పండి. 1999లో శివప్రసాద్‌గారి తరుఫున సత్యవేడు నియోజక వర్గానికి నేను ప్రచారం చేశాను. ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అదేమంటే... నేను పార్టీలో చేరింది 2002లో అంటారు. మొన్న జరిగిన కడప ఎన్నికల్లో నన్ను గడప గడప తిరిగి ప్రచారం చేయించారు జగనన్న. ‘ఐరన్‌లెగ్’ అన్నవాళ్ల నోళ్లు మూయించడానికే ఆయన ఆ పనిచేశారు.