తెలుగు ఓటర్ల ప్రభావమెంత?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నాలుగో విడత, ఆఖరి దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ముంబైలోని ఆరు స్థానాలతోపాటు 17 స్థానాలకు సోమవారం ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముంబై, థాణేతోపాటు భివండీలో నివసించే తెలుగు ప్రజలు అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాయి. బీజేపీ తరఫున రాపోలు ఆనంద్ భాస్కర్, బాబూ మోహన్, కాంగ్రెస్ తరఫున విజయ శాంతి, నేరెళ్ల శారద తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
మహానగరి ముంబైలో..
దక్షిణ ముంబై ఎంపీ స్థానంలోని వర్లీ, కమాటిపురా, కొలాబా, సాత్‌రాస్తా తదితర ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది తెలుగు ఓటర్లున్నారు. దక్షిణమధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని ధారావి, వాడాలా, చెంబూర్, సైన్ కొలివాడా తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు సుమారు 45 వేల మంది ఉంటారు. మరోవైపు ఉత్తర ముంబైలోని బోరివలి, దహిసర్, కాందివలి తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఓటర్లుండగా ఉత్తర పశ్చిమ ముంబైలో సుమారు 30 వేల వరకు ఓటర్లుంటారని అంచనా. అదేవిధంగా ఉత్తర తూర్పు ముంబై, ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ములూండ్, విక్రోలి, ఘాట్కోపర్, విలేపార్ల, కుర్లా, బాంద్రా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు.
భివండీలో మనవాళ్లే కీలకం.!
భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. భివండీ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన తూర్పు భివండీ, పశ్చిమ భివండీ, పశ్చిమ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో తెలుగు వారున్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1.50 లక్షల మంది తెలుగు ఓటర్లుంటారు. వీరిలో తెలంగాణ వాసులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. దీంతో భివండీ లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ధాణేలో కొంతమేర..
థాణే లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. థాణేలోని కిసన్‌నగర్, సిపి తలావ్, హజూరి, కల్వా, లోకమాన్యనగర్, బాల్కుమ్, గాంధీనగర్, సుభాష్‌నగర్, మీరా–భయిందర్, ఐరోలి, బేలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలున్నారు.
భివండీలో బాబూమోహన్ ప్రచారం
భివండీలోని తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పేర్కొన్నారు. ముంబైతోపాటు భివండీలో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఇక్కడికి చేరుకున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు భవన్, ముంౖ»ñ వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటుతో పాటు తెలుగు ప్రజల ఇతర సమస్యలపై స్థానిక నేతలతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.