14 నుంచి జయప్రకాష్ నారాయణ ‘తెలుగుతేజం’ యాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ ఇష్టమొచ్చినట్టు విభజిస్తామన్న ఢిల్లీ నిర్ణయం నేపథ్యంలో తెలుగు ప్రజల ప్రతిష్టను, వైభవాన్ని పరిరక్షించి పెంపొందించేందుకు లోక్‌సత్తా ‘తెలుగు తేజం’ పేరుతో విస్తృతస్థాయి కార్యాచరణ చేపడుతోందని ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ.. విభజన ప్రకటన నేపథ్యంలో తలెత్తిన సమస్యలకు సామరస్య పరిష్కారం దిశగా ప్రజల్ని సమీకరించనున్నారని పేర్కొంది.
తొలిదశలో ఈ నెల 14 నుంచి 27 వరకు ఆయన రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోని పర్యటించి పలు ప్రధాన పట్టణాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు, బహిరంగసభలు నిర్వహిస్తారు. కాగా రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా లేదా విభజన జరిగినా తెలుగు ప్రజలు ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ తమ వైభవాన్ని, భాషను దెబ్బతీసుకోరాదని జేపీ సూచించారు. సంయమనం పాటిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అన్ని ప్రాంతాలవారు అలవర్చుకోవాలని కోరారు.