బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' తాజాగా విడుదలైంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బండ్ల గణేష్‌తో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవిల గొడవను తెరపైకి తెచ్చాడు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2015లో 'టెంపర్' చిత్రం విడుదలైంది. జూ ఎన్టీఆర్, కాజల్ జోడీగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి కథను డైరెక్టర్ వక్కంతం వంశీ అందిస్తే.. బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వక్కంతం వంశీ అప్పట్లో కోర్టుకెక్కాడు. ఆ సమయంలో ఇదొక సెన్సేషన్ వార్తగా నిలిచింది.
తాజాగా ఇదే విషయంపై వంశీ ఇలా మాట్లాడాడు. 'టెంపర్ సినిమా విడుదల సమయంలో ఒక తేది వేసి చెక్కు ఇచ్చాడు. తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది కాస్త బౌన్స్ అయింది. అప్పటికే సినిమా కూడా విడుదల కావడంతో నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నేను ఎవర్ని కలవాలి..? ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నాకు డబ్బు ఇవ్వకూడదనే అతనలా చేశాడని మాత్రం అర్థం అయింది. ఆ సమయంలో వాడికి (బండ్ల గణేష్) ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు... వాడిని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు.
ఆ సమయంలో నేను కోర్టుక వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో పలుమార్లు కోర్టు చుట్టూ బాగా తిరిగాను. కొన్ని రోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దమనిషి వద్దకు నేను వెళ్లాను. ఆయన చెప్పడం వల్లనే వాడు డబ్బులు సెటిల్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాతో వాడు బాగానే ఉన్నాడు. వాడిపై నాకు కోపం ఏం లేదు. మోసం చేశాడనే బాధ ఉంది. కొన్ని రోజుల తర్వాత టెంపర్ హిందీ రైట్స్ అమ్మేందుకు వాడు,నేను ఇద్దరం ఒకే ఫైట్‌లో వెళ్లాం. ఇలా బండ్ల గణేష్ మాదిరి డబ్బు విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. కొందరు ఇప్పటికి కూడా ఇవ్వలేదు.' అని అన్నాడు.
గతంలో కోర్టు ఏం చెప్పింది
బండ్ల గణేష్‌పై వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా బండ్ల గణేష్‌కు విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను అప్పట్లో న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోని ఈ డబ్బులు విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.