నేడు బ్యాంకుల బంద్
– 500 పైగా శాఖలు మూత
– సమ్మెలో 10 వేల మంది ఉద్యోగులు
– రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయే అవకాశం
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం బంద్ పాటిస్తున్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మినహా మిగతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. వీటిల్లో పనిచేసే క్లరికల్, ఆఫీసర్ కేడర్ ఉద్యోగులు 10 వేల మందికి పైగా సమ్మెలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా ఐదు బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం దీన్ని పట్టించుకోలేదు. దీంతో ఫోరం కింద ఉన్న 9 యూనియన్లు దేశవ్యాప్తంగా జులై 29న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపును అందుకున్న జిల్లాలోని ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకులతో పాటు అన్ని గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెకు సమాయత్తం అయ్యాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచి దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు నిర్ణయించారు. సుమారు 300 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ జరిగే సమ్మెలో పాల్గొననున్నారు. ఒకరోజు సమ్మె కారణంగా జిల్లాలో రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలని ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు జే ధన్వంత్‌కుమార్, ఆదినారాయణ, గిరి«కుమార్ తదితరులు కోరారు.