ఇరిగేషన్లో టెండర్ నిబంధనల సవరణ
తెలంగాణ కాంట్రాక్టర్లకు ప్రోత్సాహం
హైదరాబాద్: నీటి పారుదల శాఖ టెండరు నింబంధనల్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేపట్టింది. తెలంగాణ కాంట్రాక్టర్లను ప్రోత్సహించేలా ఈ సవరణలున్నాయి. గత అనుభవానికి సంబంధించి పనుల మొత్తం విలువను కుదించింది. సివిల్ పనుల్లో గడిచిన ఐదేళ్లలో ఏ ఏడాదైనా చేసిన పవి విలువను సగానికి తగ్గిస్తూ నిర్ణయించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులను మాత్రం మూడింతలు చేసింది. ఈ మేరకు సోమవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ పనుల్లో గ్రూప్ వర్క్ చేసేందుకు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ రూ.5 కోట్ల వరకు, క్లాస్-1 కాంట్రాక్టర్ రూ.కోటి, క్లాస్-2 రూ.40 లక్షలు, క్లాస్-3 రూ.20 లక్షలు, క్లాస్-4 రూ.8 లక్షలు విలువైన పనులు చే సి ఉండాలని నిబంధన ఉండగా ఇప్పుడు దాన్ని సవరిస్తూ అన్ని కేటగిరీల్లోనూ సగానికి తగ్గించారు.
ఇదే సివిల్ పనుల్లో సింగిల్‌గా చేసే పనులకు మాత్రం గతంలో ఉన్న మాదిరే స్పెషల్ క్లాస్ రూ.2.50 కోట్లు, క్లాస్-1 రూ.50 లక్షలు, క్లాస్-2 20 లక్షలు, క్లాస్-3 రూ.10 లక్షలు, క్లాస్-4 రూ.4 లక్షలు ఉండగా దాన్ని యథావిధిగా కొనసాగించారు. పనుల గరిష్ట విలువలోనూ మార్పులు చేసిన ప్రభుత్వం క్లాస్-5 రూ.50 లక్షలు, క్లాస్-4 రూ.కోటి, క్లాస్-3 రూ.4 కోట్లు, క్లాస్-2 రూ.10 కోట్లు, క్లాస్-1 రూ.30 కోట్ల వరకు పరిమితి పెట్టగా స్పెషల్ క్లాస్‌కు మాత్రం రూ.30 కోట్లకుపైనా ఎంతవరకైనా ఉండొచ్చని వెల్లడించారు. కాంట్రాక్టర్ల ఫీజు రిజిస్ట్రేషన్ విలువను స్పెషల్ క్లాస్‌కు రూ.10 వేల నుంచి రూ.30 వేలకు, క్లాస్-1కు రూ.6 వేల నుంచి రూ. 20 వేలకు, క్లాస్-2కు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, క్లాస్-3కి రూ.2 వేల నుంచి రూ.6 వేలకు, క్లాస్-4,5లకు రూ.వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.