నిబంధనలకు పాతర!
సాక్షి, కర్నూలు: అభివృద్ధి పనుల ముసుగులో కర్నూలు నగర పాలక సంస్థ(కేఎంసీ) ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘బాక్స్ టెండర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. తమ అనుయాయులకు పనులు కట్టబెట్టేస్తున్నారు. తక్కువ ధరకు టెండరు కోట్ చేసి పనులు చేపట్టేందుకు కొందరు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా.. తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు అప్పగిస్తుండటం చర్చనీయాంశమైంది. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 51 డివిజన్లు ఉండగా సుమారు 5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదే.
ఇందులో పారిశుద్ధ్యం, రోడ్లు, నీరు ముఖ్యమైనవి. ఆయా విభాగాల్లో మరమ్మతులకు, కొత్త వాటి ఏర్పాటుకు టెండరు ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. బహిరంగ టెండరు ద్వారా తక్కువకు కోట్ చేసిన వారికి పనులను అప్పగించాలి. కానీ ఇక్కడా పద్ధతిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం లేదు. గతంలో నామినేషన్ పద్ధతిన పనులను కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లను అప్పగించేవారు. పీవీవీఎస్ మూర్తి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక నామినేషన్ పనులకు బ్రేక్ పడింది. దీంతో ఇంజినీర్లు నామినేషన్ ముసుగులో ‘బాక్స్ టెండర్ల’కు తెరలేపారు. ఎంత పెద్ద పనైనా ముక్కలు ముక్కలుగా విభజిస్తున్నారు. ఉదాహరణకు రూ. 5 లక్షలు విలుజేసే పనిని రూ. లక్ష లోపు ఆరు పనులుగా విభజించి ‘బాక్స్ టెండర్’ పేరిట తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ అవినీతికి తెరతీస్తున్నారు. బాక్స్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవి పూర్తయ్యాకే షెడ్యూలు దాఖలు చేస్తారు.
ఇవీ అప్పగించిన పనులు..
►పాతబస్తీలోని నాల్గో వార్డులో గుంతల పూడిక, బీటీ ప్యాచ్ వర్క్‌లకు సంబంధించి రూ. 1.58 లక్షల పనిని అంచనాలు తగ్గించి రెండుగా విభజించారు. ఒక దాన్ని రూ. 98 వేలు, మరొక దాన్ని రూ. 60 వేలు చొప్పున రెండు పనులుగా అప్పగించారు.
►కల్లూరు మండల పరిధిలోని శ్రీరామ్ నగర్లో(25వ వార్డు) బీటీ ప్యాచ్ వర్క్‌కు సంబంధించిన రూ. 94 వేలు విలువైన పనిని నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అదే కాలనీలో రూ. 99 వేల విలువైన బీటీ ప్యాచ్ వర్క్ పనిని బాక్స్ టెండర్ ద్వారా కేటాయించారు.
►కర్నూలులోని ఐదురోడ్ల కూడలి నుంచి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రహారీ గోడపై చిత్రాల పెయింటింగ్ పనులను కూడా రెండుగా విభజించి బాక్స్ టెండర్ కింద ఒక పనిని రూ. 95 వేలు, మరొక పనిని రూ. 65 వేలు చొప్పున కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు.
►నగర పాలక సంస్థ పరిధిలోని పార్కుల్లో ఆర్ సీసీ బెంచ్‌లను ఏర్పాటు చేసేందుకు గానూ రూ. 99 వేల చొప్పున రెండు పనులను విభజించి అప్పగించారు.
.. ఇలా సుమారు రూ. 2 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించిన వైనంపై పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు తప్పుపడుతున్నారు. అంచనా కన్నా తక్కువ ధరను కోట్ చేసి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు విలువైన పనులను విభజించి(రూ. లక్ష లోపు) బాక్స్ టెండర్ల పేరిట అప్పగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కేఎంసీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘బాక్స్ టెండర్ అనే ప్రక్రియ రహస్యమేమి కాదు... నామినేషన్ పద్ధతి అంతకంటే కాదు. పనులను దక్కించుకోవాలనుకున్న వారు టెండర్ ద్వారా పోటీ పడవచ్చు’ అని తెలిపారు.
అక్కడ ఆ ఇంజినీరుదే హవా..!
నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో టెండర్ల ప్రక్రియ పర్యవేక్షిస్తున్న ఓ అధికారి హవా నడుపుతున్నారు. రాష్ట్ర స్థాయి ‘ముఖ్య’ ఇంజినీరు ఈయన స్నేహితుడు. దీంతో ఆయన దాదాపు ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. కల్లూరు పరిధిలో ఇంజినీరుగా పనిచేస్తే ఈయన తన రెగ్యులర్పోస్టుతోపాటు డ్రా యింగ్ బ్రాంచ్, నీటి సరఫరా విభాగానికి ఇన్చార్జిగా ఉన్నారు. నగర పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సం బంధించి కాంట్రాక్టర్లతో భారీగా కమీషన్లు వసూలు చేసి ఉన్నత స్థాయి అధికారులకు ముడుపులు అందజేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
కేఎంసీలో దాదాపు నాలుగేళ్ల పాటు ప్రత్యేకాధికారి పాలన నడిచింది. ఈ కాలంలో దాదాపు రూ.40 కోట్ల పైబడి పనులు జరిగాయి. గత రెండేళ్లుగా ఏకంగా రూ. 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ‘బాక్స్ టెండర్’ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించకుండా బీటీ, ఇతరత్రా రోడ్ల ప్యాచ్‌వర్క్ వంటి పనులను ముక్కలుగా చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి.