ఎడ్యుకేషన్ న్యూస్
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు 28 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి-2014లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 28 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చేనెల 11 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో అదేనెల 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం సబ్జెక్టులకు రూ.125; మూడు, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలని వివరించారు. ప్రైవేటు విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.650 హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు/దేశాలకు చెంది, మొదటిసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేవారు ఈ ఫీజులకు అదనంగా మరో రూ.650 ప్రత్యేక ఫీజు చెల్లించాలని, ప్రభుత్వ పరీక్షల విభాగం అనుమతి కూడా పొందాలని తెలిపారు. వివరాలను తమ వెబ్సైట్లో (www.bseap.org) పొందవచ్చని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.65 చెల్లించాలని సూచించారు.
వికలాంగులు ఫీజుతోపాటే వైకల్యం వివరాలు వెల్లడించాలి...
వికలాంగ విద్యార్థులు తమ వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లను పరీక్ష ఫీజు చెల్లింపునకు ముందే తెచ్చుకోవాలని, వైకల్యం వివరాలను కూడా ప్రధానోపాధ్యాయుని ద్వారా పంపించే వివరాలతో ముందుగానే తెలియజేయాలని మన్మథరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు కూడా పరీక్ష ఫీజు చెల్లించడానికి ముందుగానే గుర్తింపు పొంది ఉండాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలలకు చెందిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని పేర్కొన్నారు.
‘ప్రతిభ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు ‘ప్రతిభ’ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కోరింది. 2013-14లో ఆయా విద్యాలయాల్లో చేరిన రాష్ట్ర విద్యార్థులు అవార్డుకు అర్హులని పేర్కొంది. బీటెక్, బీఈ, బీఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీడీబీఎం, ఎంఎంఎస్ కోర్సుల్లో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు http://dteap.nic.inలో సంప్రదించాలని తెలిపింది.
24 నుంచి ఏజీ వర్సిటీలో రెండో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ, పశువైద్యం, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న గృహవిజ్ఞాన కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఠీఠీఠీ.్చజట్చఠ.్చఛి.జీలో సంప్రదించాలని సూచించారు.
26, 27 తేదీల్లో ‘ఆయూష్’ కౌన్సెలింగ్
విజయవాడ, న్యూస్‌లైన్: 2013-14 విద్యా సంవత్సరం బీఏఎంఎస్(ఆయుర్వేద), బీహెచ్ఎంఎస్ (హోమియో), బీఎన్‌వైఎస్ (నేచరోపతి) కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 26, 27 తేదీల్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. బాబూలాల్ తెలిపారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చు.
28 నుంచి డీఎడ్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: డీఎడ్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. 28న పేపర్-6, 29న పేపర్-7, 30న పేపర్-8, 31న పేపర్-9, నవంబర్ 1న పేపర్-10 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
11 నుంచి తెలుగు వర్సిటీ దూరవిద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం కోర్సుల వార్షిక పరీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతున్నట్టు రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం శుక్రవారం తెలిపారు. ఎం.ఎ. తెలుగు, సంస్కృతం, జ్యోతిషం, ఇ.ఎల్.టి, టూరిజం మేనేజ్మెంట్, ఎంసీజే, బి.ఎ. కర్ణాటక సంగీతం, స్పెషల్ తెలుగు, పి.జి. డిప్లొమా, టి.వి.జర్నలిజం, లలిత సంగీతం, సంగీత విశారద తదితర కోర్సులకు సంబంధించి.. హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి, వరంగల్ ప్రాంగణాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
నవంబర్ 24న ఏపీ సెట్?
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్)ను నవంబర్ 24న (ఆదివారం) నిర్వహించనున్నట్టు తెలిసింది. గత నెల 22నే జరగాల్సిన ఏపీ సెట్‌ను సీమాంధ్రలో సమైక్య ఉద్యమం కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం ఉద్యమం సద్దుమణగడంతో సెట్ నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 23న రీజినల్ సెంటర్ల కో-ఆర్డినేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ సెట్‌ను నిర్వహించే తేదీని అదే రోజు నిర్ణయించే అవకాశముంది.
‘ఐపీఈ’కి ఆల్ ఇండియా ఏడో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: కాంపిటీషన్ సక్సెస్ రివ్య్యూ, గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఉస్మానియా క్యాంపస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ ప్రైజెస్(ఐపీఈ) అఖిల భారత స్థాయిలో ఏడో ర్యాంకు వరించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని బిజినెస్ స్కూల్స్‌లో ఇది మొదటి స్థానంలో నిలిచిందని ఐపీఈ డెరైక్టర్ ఆర్ కే మిశ్రా తెలిపారు.
ఇంటర్ పరీక్ష ఫీజు కట్టించుకోకపోతే చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యాలు తమకు బోధన రుసుం చెల్లించలేదనే సాకుతో విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ హెచ్చరించారు. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 19తో ముగియనుందని తెలిపారు.
బీఈడీ వెబ్ ఆప్షన్ల విడుదల
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లను శుక్రవారం విడుదల చేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోటాలో ఉన్న 49,525 సీట్లకు 59,570మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 59,103మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారన్నారు. వీరిలో 34,474 మందికి సీట్లను కేటాయించామన్నారు. వివరాలకు www.edcet.apsche.ac.in వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
ఎన్ఐటీ విద్యార్థులపై ఫీజుల బండ
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీలు) విద్యార్థులపై మోయలేని భారం పడనుంది. వీటిలో చదివే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ విద్యార్థుల ట్యూషన్ ఫీజు రెట్టింపు చేయాలని ఎన్ఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఫీజు రూ.70 వేలకు చేరుకోనుంది. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం పెంపు నుంచి మినహాయింపునివ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది. శుక్రవారమిక్కడ ఉన్నత విద్య కార్యదర్శి అశోక్ ఠాకూర్ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకుంది. తమ నేతృత్వంలోని స్థాయీ సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా కౌన్సిల్ ఫీజు పెంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రధానికి రాజీనామా లేఖ ఇచ్చిన మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఎంఎం పల్లంరాజు.. తన శాఖ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఉన్నత విద్య కార్యదర్శి కౌన్సిల్ భేటీకి అధ్యక్షత వహించారు.