'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ అంతా సీఎం చంద్రబాబు బినామీల చేతుల్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తన బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
టెన్త్ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. టెన్త్ పశ్నాపత్రాలు లీకయినట్టు 'సాక్షి'లోనే కాదు అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని తెలిపారు.
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షానికి శాసనసభలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే 2 నిమిషాల్లోనే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేకపోయినా అధికార పార్టీ సభ్యులకు పదేపదే మైక్ ఇస్తున్నారని వాపోయారు.