వినియోగదారుల ముంగిట్లోకి... సీజీఆర్ఎఫ్
సాక్షి, హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతీ డిస్కంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో వరంగల్ (హన్మకొండ), నిర్మల్ కేంద్రంగా రెండు ఏర్పాటయ్యాయి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(కన్జ్యూమర్ గ్రీవెన్స్స్ రిడ్రసల్ ఫోరం – సీజీఆర్ఎఫ్)కు విస్త్రృత ప్రచారం తీసుకురావడంలో సీజీఆర్ఎఫ్–1 చైర్మన్గా కందుల కృష్ణయ్య విశేష కృషి చేశారు.
విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక వేదిక ఉందని తెలియని పరిస్థితుల్లో దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్గా కార్యాలయంలోనే ఉంటూ కేసులను పరిష్కరించే అవకాశమున్నా వినియోగదారుల ముంగిట్లోకి లోకల్ కోర్టుల పేరుతో సీజీఆర్ఎఫ్ను తీసుకెళ్లారు. ఈ మేరకు మూడేళ్లుగా చైర్మన్గా పనిచేస్తున్న కృష్ణయ్య పదవీకాలం శనివారంతో ముగియనున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
మూడు పూర్వ జిల్లాలు
సీజీఆర్ఎఫ్–1 (వరంగల్) పరిధిలో పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రతీ సెక్షన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చైర్మన్ కృష్ణయ్య కృషి చేశారు. మూడేళ్ల పదవీ కాలంలో మొత్తం 1,014 కేసులు సీజీఆర్ఎఫ్ దృష్టికి రాగా వాటిని పరిష్కరించడం విశేషంగా చెబుతారు.
96 శాతం వినియోగదారులకే అనుకూలం
మొత్తం పరిష్కరించిన కేసుల్లో 808 కేసులను స్థానికంగా అప్పటికప్పుడు సెక్షన్ పరిధిలో నిర్వహించిన లోకల్ కోర్టుల్లో పరిష్కరించడం విశేషం. ఇక లోకల్ కోర్టులో పరిష్కారం కాని 146 కేసులను సీజీఆర్ఆఫ్ కోర్టులో పరిష్కరించారు. మూడేళ్లలో సగటున 96 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పు వచ్చాయి. రూ.2,67,500 వినియోగదారులకు పరిహారం, జరిమానా రూపేణ.. సంస్థ నుంచి అందేలా చేశారు.
2016–2017లో 304 కేసులు నమోదు కాగా 260 లోకల్ కోర్టుల్లో, 44 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయంలోని కోర్టులో పరిష్కరించారు. ఇందులో 93 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. 2017–2018లో 382 కేసులు రాగా 326 కేసులు స్థానికంగా, 56 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో పరిష్కరించగా 98 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలవడ్డాయి. ఇక 2018–2019లో 282 కేసులను స్థానికంగా, సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో 46 కేసులు పరిష్కరించారు. ఇందులో 97 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలువడ్డాయి.
ఫిర్యాదులు ఇలా...
విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుడి సర్వీసు నెంబర్, పూర్తి చిరునామతో పోస్టు ద్వారా కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుకు ఎలాంటి రుసుం కానీ న్యాయవాది కానీ అవసరం లేదు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, అధిక బిల్లులు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, అదనపు లోడ్ ఇచ్చుటలో జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, ఓవర్లోడ్, కాలిపోవడం తరలించడంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం, కేటగిరీ మార్పు వంటి ఇతర విద్యుత్ సంబంధ సమస్యలు సీజీఆర్ఎఫ్ ద్వారా వినియోగదారులు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది.

సీజీఆర్ఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంబంధ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి వేదిక. న్యాయవాదుల అవసరం లేకుండా వినియోగదారులే నేరుగా ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సీజీఆర్ఎఫ్పై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు సెక్షన్ల వారీగా లోకల్ కోర్టులు నిర్వహించాం. వినియోగదారుల ముంగిట్లోకి సీజీఆర్ఎఫ్ను తీసుకువెళ్లామనే సంతృప్తి కలిగింది.
– కందుల కృష్ణయ్య, సీజీఆర్ఎఫ్–1 చైర్మన్