ప్రభుత్వానికి ఇంధన శాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ) ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంధన శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈఆర్‌సీ విధివిధానాలను నిర్ణయించడంతో పాటు నియామక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని వీటిలో కోరినట్లు సమాచారం. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సభ్యులుగా ఉండే కమిటీ ఈఆర్‌సీ చైర్మన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. హైకోర్టు జడ్జి నేతృత్వం వహించే ఈ కమిటీకి ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో ఉండే జడ్జి పేరును ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని ఇంధన శాఖ కోరింది. ప్రభుత్వం ఈ కమిటీని నియమించిన వెంటనే ఈఆర్‌సీ చైర్మన్, ఇద్దరు సభ్యుల ఎంపికకు ఇంధన శాఖ ప్రకటన జారీ చేస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు మూడు వారాల గడువు ఇస్తుంది.
రాష్ట్ర విభజన జరిగాక ఆరు నెలల్లోపు తెలంగాణకు ప్రత్యేక ఈఆర్‌సీని ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 చెబుతున్న నేపథ్యంలో టీఈఆర్‌సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.