పూల్.. థ్రిల్
సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ఎంచక్కా టెర్రస్‌పై స్విమ్మింగ్ చేయొచ్చు. మీకు నచ్చిన రీతిలో అత్యాధునిక స్విమ్మింగ్‌పూల్‌ను పైఅంతస్తులో నిర్మించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు భూమిపై టాట్‌లాట్ ఏరియాను మినహాయించి మిగతా ప్రాంతంలో పూల్ నిర్మాణానికి అనుమతి ఉంది. కొత్త నిబంధనల మేరకు యజమానులు తమ ఇంటి పైఅంతస్తులో స్విమ్మింగ్‌పూల్ నిర్మించుకోవచ్చు. అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు మాత్రం పక్కాగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్–2016కు అనుగుణంగా భవన నిర్మాణ నిబంధనలు రూపొందించాలన్న బిల్డర్స్, డెవలపర్స్ అసోసియేషన్ల కోరిక మేరకు ప్రభుత్వం ఈ సవరణలు చేసింది. తద్వారాఎక్కువ ఎత్తు, అంతస్తులు నిర్మించే వారికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు భవనం ఎత్తు 50–55 మీటర్ల వరకుంటే మూడు వైపులా 16మీటర్ల సెట్‌బ్యాక్ వదలాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తే ప్రతి 5మీటర్ల ఎత్తుకు అదనంగా 0.5 మీటర్ (అర మీటర్) సెట్‌బ్యాక్ వదలాలి.
అంటే 55–60 మీటర్ల వరకు 16.5 మీటర్లు, 65–70 మీటర్ల ఎత్తులో నిర్మించాలంటే 17.5 మీటర్ల మేర సెట్‌బ్యాక్ విడిచిపెట్టాలి. కానీ నూతన నిబంధనల మేరకు వీరు 17మీటర్లు వదిలితే సరిపోతుంది. అంటే భవనం మూడు వైపులా సెట్‌బ్యాక్‌లో అరమీటరు మేర కలిసొస్తుంది. కొత్త నిబంధనల మేరకు 70–120 మీటర్ల ఎత్తులో భవనం నిర్మిస్తే 18మీటర్లు సెట్‌బ్యాక్ వదిలితే సరిపోతుంది. అలాగే 120 మీటర్లకు మించి నిర్మిస్తే 20 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలాల్సి ఉంటుంది. దీంతో నగరంలో హైరైజ్ బిల్డింగ్ (ఎత్తైన భవనాలు)ల నిర్మాణం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నగరంలో ప్రస్తుతం వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. కొత్త నిబంధనలతో బిల్డర్లు ఎక్కువ ఎత్తులో అధిక అంతస్తులతో భవనాలు నిర్మించే అవకాశం ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ 17,838 వ్యక్తిగత నివాస భవనాలకు అనుమతులివ్వగా, 2,328 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌కు అనుమతులిచ్చింది. కొత్త నిబంధనలతో ఎత్తయిన అపార్ట్‌మెంట్స్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే భవనాల భద్రత దృష్ట్యా సెల్లార్లు ఎక్కువ లోతుకు వెళ్లే కొద్దీ సెట్‌బ్యాక్స్ ఎక్కువగా వదలాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
బిల్డర్లకు మేలు...
అదే విధంగా రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోయే వారికి తొలుత ఎంత బిల్టప్ ఏరియాకు అవకాశం ఉంటుందో? రోడ్ల విస్తరణకు స్థలం ఇచ్చిన తర్వాత మిగతా స్థలంలోనూ అంత బిల్టప్ ఏరియా మేరకు భవనాన్ని తమకు నచ్చిన విధంగా కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ మేరకు వెంటిలేషన్ తదితర సదుపాయాలు కల్పించడంతో కొత్త ని బంధనల వల్ల బిల్డర్లకు ప్రయోజనకరమని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం అపార్ట్‌మెంట్స్‌కు అప్రోచ్ రోడ్డు ఎలా ఉ న్నా అనుమతులిచ్చేవారు. కొత్త నిబంధనల మేర కు బీటీ లేదా సీసీతో అప్రోచ్ రోడ్ ఉండాలి. లేని పక్షంలో సొంత ఖర్చుతో డెవలపర్‌నే నిర్మించాలి. లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వరు. ప్రస్తుత నిబంధనల మేరకు శాశ్వత విద్యుత్, వాటర్‌లైన్ కనెక్షన్ కావాలంటే భవనానికి ఓసీ జారీ అయ్యాకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కొత్త నిబంధనల మేరకు ఓసీకి దరఖాస్తు చేసినప్పుడే ఈ కనెక్షన్లకు సైతం చేసుకోవచ్చు. ఈలోగా దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు. ఓసీ జారీ అయ్యాక ఎక్కువ జాప్యం లేకుండా కనెక్షన్లు ఇస్తారు.