టెర్రర్ అలర్ట్స్ కు సరికొత్త యాప్
పారిస్ : టెర్రర్ అటాక్ ల నుంచి యూజర్లను రక్షించడానికి, ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ యాప్ రూపొందింది. ఫ్రెంచ్ ప్రభుత్వం నేడు ఆ యాప్ ను ఆవిష్కరించనుంది. యూరో 2016 ఫుట్ బాల్ టోర్నమెంట్ పై పెరుగుతున్న భద్రత ఆందోళనల నేపథ్యంలో 'టెర్రర్ అలర్ట్' అనే యాప్ ను ఫ్రెంచ్ ప్రభుత్వం రూపొందించింది. యూజర్లకు టెర్రర్ అటాక్ ల అలర్ట్ లను పంపుతూ వారిని సంఘటన బారినుంచి కాపాడటానికి ఈ యాప్ ఎంతో సహకరించనుంది.
ఫ్రెంచ్, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. అనుమానిత దాడి జరుగుతుందని భావించినప్పుడు యూజర్లకు వెంటనే వార్నింగ్ మెసేజ్ వెళ్లేలా ఈ యాప్ ను ఆవిష్కరించామని వెల్లడించింది. అనుమానిత సంఘటన గురించి అథారిటీలకు సమాచారం అందిన వెంటనే, 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో యూజర్లకు ఈ యాప్ ద్వారా అలర్ట్ పంపుతామని చెప్పింది. ఎనిమిది వివిధ భౌగోళిక జోనుల్లో అలర్ట్ లను యాప్ యూజుర్లు మానిటర్ చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు, స్నేహితుల వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది.
అనుమానిత దాడి జరిగినప్పుడు ఎలా తనకు తాను రక్షించుకోవాలో, ఎలా సేఫ్ గాఉండాలో కూడా ఈ యాప్ సమాచారం అందిస్తుందని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 2015లో జరిగిన పారిస్ టెర్రర్ అటాక్స్ తో ఈ యాప్ ను రూపొందించడానికి సంకల్పించామని, యూరో 2016 టోర్నమెంట్ నేపథ్యంలో టెర్రర్ అలర్ట్ యాప్ ను తీసుకురావాలని ఆ దేశ ప్రధాని మాన్యుల్ వాల్స్ భావించినట్టు చెప్పింది. ఈ యాప్ టెర్రర్ అటాక్స్ నుంచి యూజర్లను రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.