పాలు కావాలి
- 200 అంగన్వాడీలలో ఇబ్బందులు
- రవాణా చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టర్
- అమలు కాని టెట్రాప్యాక్ పథకం
- గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం
ఇందూరు: మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రారంభించిన ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకం అమలుకు కావాల్సిన అన్ని సరుకులు సక్రమంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నా, పాల విషయంలో మాత్రం సమస్య తలెత్తింది. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్న విజయ డెయిరీ కొన్ని ప్రాజెక్టులకు పాలు సరఫరా చేయలేకపోతోంది.
నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, తదితర ప్రాజెక్టుల పరిధిలోని సగం అంగన్వాడీలకు పాలు సరఫరా కావండలేదు. పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో సరఫరా చేయలేకపోతున్నామని డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారని సీడీపీఓలు, ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు. దూర ప్రాంతాల అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు రవాణా చార్జీల భారం ఎక్కువ కావడం కూడా ఇందుకు కారణమని తెలిసింది.
ఘనంగా ప్రారంభం
గత జనవరి పదిన ఈ పథకం ప్రారంభమైంది. మొదటగా అన్ని ప్రాజెక్టులకు సక్రమంగానే పాలను సరఫరా చేసిన డెయిరీ నిర్వాహకులు, కొన్ని రోజుల తరువాత నిలిపివేశారు. మూడు ప్రాజెక్టులలో దాదాపు 200 అంగన్వాడీలకు పాలు సరఫరా కావడం లేదు. సోమవారం ఏకంగా అర్బన్ ప్రాజెక్టులో ఉన్న 151 అంగన్వాడీలకు పాలు రాలేదు. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. వారు కేంద్రాలలో కేవలం భోజనం చేసి వెళుతున్నారు. పాలు ఎందుకివ్వడం లేదని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు.
కొన్ని కేంద్రలలో స్థానికంగా పాలు లభ్యమైతే కొనుక్కొచ్చి అందజేస్తున్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలంటే గర్భవతిగా ఉన్న సమ యంలో కడుపునిండా ఆహారం ఉండాలి. విటమిన్లు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు తాగితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వారికి కేంద్రాలలో రోజూ 200 మిల్లీలీటర్ల పాలు తప్పసరిగా అందజేస్తారు. తరువాత బాలింతలు కూడా పాలు తాగాల్సి ఉంటుంది. వారికి ఇవి బలాన్నివ్వడంతోపాటు పాలు ఎక్కువగా రావడానికి పాలు తోడ్పడుతాయి.
టెట్రాప్యాక్ పాలు ఎక్కడ?
మారుమూల ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు రోజూ పాలను సరఫరా చేయడం కష్టమవుతుందని భావించి, దూర ప్రాంత అంగన్వాడీలకు టెట్రాప్యాక్ల ద్వారా పాలను అందజేయాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు నిలువ ఉండే విధంగా టెట్రాప్యాక్ పాలు ఉంటాయి. అంటే, వారానికి ఒకసారి పాలను అందజేస్తారు. ఈ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.