Texas Couple
-
తండ్రి కోసం హాస్పిటల్లో పెళ్లి.. నెటిజన్ల ఫిదా !
న్యూయార్క్ : పెళ్లి చేసుకోబోయే ఓ జంట, పెళ్లి కొడుకు తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని, అక్కడే తండ్రి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఆలియా, మైకేల్ థామ్సన్ అనే జంట మార్చిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వివాహ తేదీ సమీపించే కొద్దీ ఇద్దరు వరుడి తరపు సమీప బంధువులు చనిపోవడంతో వివాహం వాయిదా వేశారు. అనంతరం చనిపోయిన బంధువులను తలుచుకుంటూ మంచం పట్టిన తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా వేయకుండా, పెళ్లికి తండ్రి మిస్ అవకుండా ఉండాలని ఆలోచించిన మైకేల్ తనకొచ్చిన ఆలోచనను పాస్టర్‌తో పంచుకున్నాడు. దీనికి చర్చి పాస్టర్ కూడా ఒప్పుకోవడంతో తండ్రి సమక్షంలో గురువారం ఆసుపత్రిలో ఈ వివాహం జరిపించారు. ఆసుపత్రి వాతావరణానికి తగ్గట్టు వధూవరులిద్దరూ నర్సులు ధరించే దుస్తులనే ధరించారు. ఉంగరాలు మార్చుకునేటప్పుడు చేతికున్న గ్లౌజు మీదుగానే ధరించారు. ఈ పెళ్లికి అక్కడి సిబ్బంది మనస్పూర్తిగా సహకరించగా, ఆసుపత్రిలోని డాక్టర్ కేక్ తెప్పించారు. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఫేస్బుక్లో వైరల్‌గా మారాయి. కాగా, ఆసుపత్రిలో పెళ్లి చేసుకొని కొత్త సాంప్రదాయానికి తెరతీశారంటూ పలువురు నెటిజన్లు ఈ జంటను అభినందిస్తున్నారు. -
తుఫానులో పెళ్లి.. ముద్దు సీన్ అదుర్స్
టెక్సాస్: పెళ్లి అంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఓ పెద్ద వర్షం వచ్చి వెళ్లినట్లుంటుంది హడావుడి. సాధారణంగా పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లకయితే ఇరు కుటుంబ పెద్దలు మాత్రమే కష్టపడుతూ హైరానాపడుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మాత్రం కొంత ఉత్సాహంతో మిత్రులతో ఆ విషయాన్ని పంచుకుంటూ సందడిగా కనిపిస్తారు. అదే పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అయితే మాత్రం పెద్దలకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ జంట పరుగులు పెడుతుంటారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షెల్లీ, క్రిస్ హాలాండ్ అనే జంటది కూడా ఈ కోవకు చెందిన వివాహమే. సెప్టెంబర్ 2న జరగాల్సిన వారి వివాహం కోసం దాదాపు ఆరునెలలు ప్లాన్ చేసుకున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా సమకూర్చుకొని రెడీ అయిపోయారు. కానీ, వారి ఆశలు అడియాశాలయ్యాయి. అంగరంగ వైభవంగా, అతిధుల మధ్య జరుపుకోవాల్సిన వివాహం ఓ నలుగురికే పరిమితమైంది. ఓ విందు భోజనం లేదు.. ఓ ఆటపాట లేదు. కానీ, వారు పెళ్లి చేసుకున్న విధానం మాత్రం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. అరకొరగా జరిగిన ఆ వివాహానికి సంబంధించిన ఓ ఫొటోను ఆ జంట ఫేస్బుక్లో పంచుకోగా దాదాపు 20వేల షేర్లు, నాలుగు లక్షలమంది ప్రతిస్పందనలు వచ్చాయి. ఇంతకీ వారి పెళ్లికి ఏ అడ్డంకి ఎదురైందనుకుంటున్నారా.. హార్వీ. మొన్నటికి మొన్న వచ్చిన పెను తుఫాను అమెరికాలో పలు నగరాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. దీని ప్రభావం షెల్లీ దంపతుల వివాహం పై పడింది. 'నేను, నా భర్త ఆరు నెలలుగా చేసుకున్న ప్రణాళిక మొత్తం తుఫాను హార్వీ వల్ల నాశనమై పోయింది. మా వివాహ కేకు, వివాహ చోటు, క్యాటరింగ్, బంధువులు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా నష్టం జరిగింది' అంటూ హాలాండ్ తన ఫేస్బుక్లో పేర్కొంటూ ఓ పెళ్లి ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో దాదాపు మొకాళ్ల వరకు నీళ్లు రాగా పెళ్లి కొడుకు షెల్లీ నవ వధువు అయిన క్రిస్ హాలండ్‌ను పైకి ఎత్తుకోగా ఇద్దరు గాఢ చుంబనంలో మునిగిపోయారు. ఎంత ఉధృతంగా ఎన్ని హార్వీలు వచ్చినా మిమ్మల్ని మాత్రం విడదీయలేవని చెబుతున్నామంటూ ఈ ఫొటో చూసిన వారంతా స్పందించారు. -
ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..
వాషింగ్టన్: ప్రజల నేతగా గుర్తింపు పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రావడంతో ఓ యువ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన తల్లి రాసిన లేఖతో పాటు ఒబామా పంపిన ప్రత్యుత్తరాన్ని నవ వధువు ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 45వేల మంది రీట్వీట్ చేయగా, రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. గత మార్చి నెలలో టెక్సాస్‌కు చెందిన లిజ్ వైట్‌లో అనే మహిళ కూతురు బ్రూక్ అల్లెన్ జరిగింది. అయితే తన కూతురి వివాహానికి హజరు కావాల్సిందిగా ఒబామా దంపతులకు లిజ్ ఆహ్వానం పంపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత (జూలై 31న) ఒబామా నుంచి వారికి సమాధానం వచ్చింది. 'వివాహం చేసుకున్న జంటకు మా తరఫున శుభాకాంక్షలు. మీ పెళ్లి ఎంతో ఆనందంగా, సన్నిహితుల ప్రేమానుబంధంతో జరిగి ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ మీ ప్రేమ రెట్టింపు కావాలి. మీ బంధం జీవితాంతం కొనసాగాలిని ఆకాంక్షిస్తున్నాను. వివాహం తర్వాత మీ లైఫ్ ఎన్నో విశేషాలతో నిండిపోతూ బంధం బలపడాలని' కొత్త జంటను ఆశీర్వదిస్తూ ఒబామా దంపతులు ఈ లేఖ రాశారు. ఈ సంతోషాన్ని వధువు బ్రూక్ అల్లెన్ తన ట్విట్టర్లో షేర్ చేసుకుంది. MY MOM DEADASS SENT THE OBAMAS A WEDDING INVITATION BACK IN MARCH AND JUST RECEIVED THIS IN THE MAIL. IM HOLLERING -
తుదిఘడియల్లోనూ చేతిలో చెయ్యేసి..!
58 ఏళ్ల వైవాహిక బంధం వారిది. చివరిక్షణంలో మృత్యువు కూడా వారిని వేరు చేయలేకపోయింది. ముగ్గురు పిల్లలతో నిండు సంసార జీవితాన్ని ఆస్వాదించిన ఆ జంట చివరిఘడియల్లోనూ పక్కపక్కనే పడుకొని.. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తుదిశ్వాస విడిచింది. టెక్సాస్‌లోని సాన్ అంటోనియోలో ఈ ఘటన జరిగింది. సాన్ అంటోనియోకు చెందిన జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్ తొలిసారి ఓ మీట్ మార్కెట్లో కలుసుకున్నారు. ఆ తర్వాత పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అప్పడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. జార్జ్ మిలిటరీలో పనిచేసి వచ్చిన తర్వాత ఒరా లీని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగారు. గడిచినవారమే 58వ పెళ్లిరోజున ఘనంగా జరుపుకున్న ఈ దంపతులు వయస్సు మీద పడటంతో అనారోగ్యానికి గురయ్యారు. జార్జ్ కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరు పక్కపక్కనే చేతులు పట్టుకొని పడుకొన్నారని, నిద్రలో తన తండ్రి జార్జ్ ప్రాణాలు విడవగా, ఆ తర్వాత మూడు గంటలకు తన తల్లి ఒరా కూడా కన్నుమూసిందని వారి కూతురు కొరినా మార్టినెజ్ స్థానిక ఫాక్స్ 29 చానెల్‌కు తెలిపింది. అచ్చం ‘నోట్‌బుక్’ హాలీవుడ్ సినిమాలో జరిగినట్టే తమ తల్లిదండ్రులు ఒకేసారి ప్రాణాలు విడిచారని, తుదిఘడియల్లోనూ వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఉన్నారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారి అనుబంధం ఇందుకు కారణమని ఆమె వివరించింది.