ప్రథమ భారతీయ ప్రధాని పీవీ
నెహ్రూ విధానాన్ని కాదని కొత్త విదేశీ వ్యవహారాలను రంగం మీదకు తేవడం కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పీవీ చేసిన గొప్ప సాహసం. నెహ్రూ కుటుంబానికి చెందని బయటి వ్యక్తికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు.
తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు(జూన్ 28, 1921-డిసెంబర్ 23, 2004)గారి 93వ జయంతిని అధికారికంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ఆత్మ గౌరవ నినాదానికి న్యాయం చేసింది. ఒక సంక్షుభిత దశలో పీవీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఒక సామాజిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని అంబేద్కర్ రక్షించినట్టే, పెను రాజకీయ సంక్షోభం నుంచి పీవీ ఈ దేశాన్ని గట్టెక్కించారు. అంబేద్కర్ దూరదృష్టికి ఆలస్యంగా గుర్తింపు వచ్చింది. పీవీ విషయం కూడా అంతే. దక్షిణ భారతదేశం నుంచి ఆ అత్యున్నత పదవికి ఎన్నిక కావడమే కాకుండా, ఐదేళ్లు నిరాఘాటంగా పాలించి పీవీ సత్తా చాటారు.
పీవీ మన ప్రథమ భారతీయ ప్రధానమంత్రి. ఆయన పండిత ప్రధాని. భారతీయత, భారతీయమైన స్పర్శతో కూడిన రాజనీతిజ్ఞతల లోతుపాతులను క్షుణ్ణంగా గ్రహించినవారాయన. భీష్మ పితామహుడు పాండుపుత్రులకు బోధించిన నీతి సూత్రాలు, అర్థశాస్త్రంలో కౌటిల్యుడు పొందుపరిచిన పాలనా పద్ధతులు, విజయనగర పాలకులు, ఛత్రపతి శివాజీ, రాజా రంజిత్‌సింగ్ వంటివారు అనుసరించిన పాలనా రీతుల ఔన్నత్యం తెలిసినవారు పీవీ. ఇక్కడి సనాతన ధర్మం గురించే కాదు, 18 వ శతాబ్దం వరకు భారతదేశ సౌభాగ్యం గురించి, ఆర్థిక పరిపుష్టిని గురించి కూడా విశేషమైన పరిజ్ఞానం ఉన్న నాయకుడు. అలనాటి భారత పరిశ్రమలు సాగించిన ఉత్పత్తులు, జరిపిన విదేశీ వాణిజ్యం, ఈ పరిణామాలను గురించి విదేశీ యాత్రికులు నమోదు చేసిన చారిత్రక వాస్తవాలను అధ్యయనం చేసినవారాయన. ఆర్థికరంగం ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సవాళ్ల మధ్య సతమతమవుతున్న సమయంలో పీవీ ప్రధానిగా పదవీ బాధ్యతలు (1991-1996) స్వీకరించారు. విదేశీ మారక నిల్వలు ఊడ్చిపెట్టుకుపోయాయి. చమురు వంటి కీలక దిగుమతుల కోసం మన బంగారు నిల్వలను లండన్ బ్యాంకులలో తాకట్టు పెట్టి విదేశీ మారకాన్ని సమకూర్చుకోవలసిన దుస్థితి. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో బలం లేదు. అప్పుడే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఈ స్థితిలో పీవీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు, ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. పీవీ పర్మిట్ లెసైన్స్ కోటారాజ్కు స్వస్తి పలికారు. ఇది నెహ్రూ వియన్ సోషలిజానికి వ్యతిరేకమని విమర్శలు వచ్చాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో సరళీకరించారు. ఆయన సరళీకరణ విజయవంతమైందని చెప్పడానికి టెలికమ్యూనికేషన్స్, ఐటీ సాధించిన పురోగతే సాక్ష్యం. దీనినే రెండవ భారతీయ ప్రధాని వాజ్‌పేయి కొనసాగించి, హాత్హాత్ మే టెలిఫోన్ నినాదం ఇచ్చారు. అట్టడుగు వర్గాలకు కూడా ఐటీ సేవలు చేరువయ్యాయి.
విదేశీ వ్యవహారాలకు కూడా పీవీ కొత్త దృష్టిని ఇచ్చారు. ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని రంగం మీదకు తీసుకువచ్చారు. నెహ్రూ, ఇందిర విధానాల మేరకు 1991 వరకు అరబ్బు దేశా లు, ఇతర ముస్లిం దేశాల ప్రాపకమే కేంద్ర బిందువుగా భారత విదేశాంగ విధానం నడిచేది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉండే అరబ్బు దేశాల వైఖరి కూడా మన విదేశీ వ్యవహారాలను శాసిం చే ది. ముస్లిం దేశాల పట్ల ఇంత సానుకూల వైఖరితో ఉన్నప్పటి కీ, ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ) కాశ్మీర్లో ముస్లింల మానవహక్కుల రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు గుప్పించేది. కాగా, భారత్‌కు తూర్పు దిక్కున అన్ని దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగుపర చడానికి గత చరి త్ర ఆధారంగా పీవీ తన హయాంలో విదేశాంగ విధానాలకు రూపురేఖలు ఇచ్చారు. మూడో భారతీయ ప్రధాని మోడీ ఈ అడుగు జాడలలోనే లుక్ ఈస్ట్ విధానానికి ఊతమిస్తూ సార్క్ దేశాధినేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
నెహ్రూ విధానాన్ని కాదని కొత్త విదేశీ వ్యవహారాలను రంగం మీదకు తేవడం కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పీవీ చేసిన గొప్ప సాహసం. నెహ్రూ కుటుంబానికి చెందని బయటి వ్యక్తికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. అందుకే విదేశీ నాయకత్వంలో ఉన్న పార్టీ పీవీ పార్థివ దేహానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు. అంత్య క్రియలు ఢిల్లీలో జరిపించడానికి కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయం. పీవీ నరసింహారావుగారు తెలంగాణకు చెందినవారు మాత్రమే కాదు, తెలుగువారందరికీ భారతీయులందరికీ కూడా వందనీయుడు.
(వ్యాసకర్త ఐటీ నిపుణులు) - టీహెచ్ చౌదరి