లారీ - స్కూల్ బస్సు ఢీ:15 మంది మృతి
పశ్చిమ థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో వెళ్తున్నడబుల్ డక్కర్ బస్సు ఎదురుగా వస్తున్న భారీ లారీని శుక్రవారం తెల్లవారుజామున ఢీ కొట్టింది. ఆ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందారు. మృతులలో 13 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మంది అక్కడికక్కడే మరణించారని చెప్పారు.
మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆ ప్రమాదంలో మరో 30 మందికిపైగా గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడం లేదా డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.