వీఆర్వోను తరిమిన గ్రామస్తులు
తమ్మేపల్లి (డీ.హీరేహాళ్) : రస్తా వివాదంలో వీఆర్వో కలుగజేసుకోవడంతో గ్రామస్తులు తరుముకుని వెళ్లారు. మండలంలోని తమ్మేపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం తమ్మేపల్లి నుండి గ్రామదట్లకు వెళ్లే రహదారికి కంపచెట్లు పెరగడంతో స్వచ్చందంగా గ్రామస్థులే తొలగించాలని వెళ్లారు. అక్కడ వీఆర్వో అడ్డుచెప్పడంతో వివాదం నెలకొంది. వివరాలు.. సర్వేనెంబర్ 96లో 23.16 సెంట్ల మధ్యలో 1923 నుంచి గ్రామదట్లకు రహదారి వున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచారు.
అయితే ఈ భూమిని గత 20 ఏళ్ల క్రితమే రైతులు రాజశేఖర్రెడ్డి, సంజీవరెడ్డి, సత్యరెడ్డి, కేశవరెడ్డి కొనుగోలు చేశారని, అప్పటి నుండి మధ్యలో దారి వదలమని కోర్టుకు వెళతామని వారు గ్రామస్తులను భయపెట్టారు. అయితే రహదారి గుండా కంపచెట్లు పెరిగి పంట ఇళ్లకు తరలించేటప్పుడు వాటికి తగులుకుంటుండడంతో ఆదివారం గ్రామస్తులే ఇంటికి ఇద్దరు చొప్పున కంపను తొలగించేందుకు వెళ్లారు. అయితే వీఆర్వో అసభ్యంగా మాట్లాడుతూ గ్రామస్తులను రెచ్చగొట్టాడు. దీంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు వీఆర్వోపై తిరుగబడ్డారు. కొంత మంది గ్రామస్థులు జోక్యం చేసుకుని వీఆర్వోకు దెబ్బలు తగలకుండా గ్రామం చివరి వరకు సాగనంపారు.