thandava
-
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
తాండవకు ఏలేరు నీరు..
ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రూ.500 కోట్లతో జరిగే ఈ బృహత్కార్యక్రమానికి త్వరలో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామలమవుతుంది. ఏలేరు, తాండవ జలాశయం కలయిక రెండు జిల్లాల రైతులకు వరం. సాక్షి, నర్సీపట్నం: తూర్పు కనుమల నుంచి వస్తున్న నీటికి 1959లో తాండవ వద్ద అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రిజర్వాయరుకు శంకుస్థాపన చేయగా పదేళ్ల కాలంలో ఇది పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని విశాఖ, తూర్పుగోదావరి జిల్లా లోని 52 వేల ఎకరాలకు సాగునీరందించే దిశగా రూపుదిద్దుకుంది. తరువాత వచ్చిన పాలకులు దీన్ని పట్టించుకోకపోవటంతో రిజర్వాయరుతో పాటు కాలువల్లో పూడిక పేరుకు పోయి ఏటా ఆయకట్టు తగ్గుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఆయకట్టు భూములకు నీరు అందే పరిస్థితి ఉన్నా వరుణ దేవుడు కరుణిస్తే తప్ప రైతులు నాట్లు వేసే అవకాశం లేదు. ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో గట్టెక్కించేందుకు నాడు తండ్రి మాదిరిగానే నేడు తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఈ రెండు జిల్లాల్లో ఆయకట్టు రైతులు ప్రతికూల వాతావరణంలో సైతం సుభిక్షంగా ఉండేందుకు ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి మరింత ఆయకట్టు పెంచి స్థిరీకరణ చేసేందుకు నిర్ణయించారు. తాండవతో అనుసంధానించే ఏలేరు కాలువ వాస్తవ పరిస్థితి విశాఖ జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. ఈ జలాశయం కింద విశాఖ జిల్లాల్లోని నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 32,689 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా చెందిన కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు చెందిన 18,776 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వా యరు నిర్మాణం ప్రారంభంలో చివరి ఆయకట్టు వరకు నీరందేది. క్రమేణా కాలువల్లో పూడిక పేరుకుపోయి కుదించుకుపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వచ్చింది. చివరి భూములకు నీరు అందడం గగనంగా మారింది. వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ లైనింగ్‌తో పాటు రిజర్వాయరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో రిజర్వాయరు నిండితే చివరి ఆయట్టు వరకు సాగు నీరందిందేందుకు వీలు కలిగింది. కాలువలు బాగున్నా, వాతావరణం అనుకూలంగా లేక రిజర్వాయరులో నీరు లేని సమయాల్లో ఆయకట్టు రైతులు నాట్లు వేసే పరిస్థితి ఉండేది కాదు. జగన్ ప్రభుత్వంలో.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, పత్తిపాడు ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేష్, దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, పూర్ణచంద్రప్రసాద్, సినీ నటుడు, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడికి చెందిన ఆర్.నారాయణమూర్తి వివరించారు. ఏలేరు నీటిని అనుసంధానం చేస్తే అధిక శాతం మెట్ట రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దీంతో ఏలేరు కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం పెంచడంతో పాటు ఈ నీటిని తాండవకు అనుసంధానం చేసేందుకు అవ సరమైన రూ.500 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. పనులు జరిగేది ఇలా.. గతంలో 1,200 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం చేసిన ఏలేరు కాలువ ప్రస్తుతం 200 టీఎంసీల స్థాయికి చేరింది. దీనిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించింది. పనులు పూర్తయిన తరువాత దీనిగుండా ప్రవహించే నీటిని తాండవ రిజర్వాయరుతో పాటు కాలువల్లో పలు చోట్ల లిఫ్ట్ ద్వారా వేసి వాటిని పూర్తిస్థాయిలో రైతాంగానికి అందించేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఈ పనులకు మరో రూ.250 కోట్లు కేటాయించారు. లిఫ్ట్ పనులు ఇలా.. నాతవరం మండలం, శరభవరం ఏలేరు కాలువ నుంచి పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి, గాంధీ నగరం వద్ద ఉన్న తాండవ ఎడమ కాల్వకు అందించేందుకు నిర్ణయించారు. దీనివల్ల బలిఘట్టం మేజరు భీమవరపు కోట మేజర్ల నుంచి కోటవురట్ల మండలాలకు పూర్తిస్థాయిలో సాగు నీరందుతుంది. చిన గొలుగొండపేట వద్ద పైన తాండవ కింద ఏలేరు ప్రవహించే అక్విడెక్టు ప్రాంతంలో లిఫ్ట్ ద్వారా రిజర్వాయరు కుడి కాల్వలో నీరు వేసేందుకు నిర్ణయించారు. తద్వారా కోటనందూరు మండలంలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. ఇదే ప్రాంతం నుంచి ఏలేరు నీటిని తీసు కొని లిఫ్ట్ ద్వారా నాతవరం మండలం వెదురుపల్లి వద్ద తాండవ కుడికాలువకు అందించేందుకు నిర్ణయించారు. దీంతో కోటనందూరు మేజరుకు చెందిన పీకే గూడెం, రౌతులపూడి మండలాల్లో చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక్కడి నుంచి ఏలేరు నీటిని లిఫ్ట్ ద్వారా ఎగువన ఉన్న తాండవ రిజర్వాయరుకు తరలిస్తారు. ఈ విధంగా సమకూరిన నీటితో మధ్యస్థలంలో మిగిలి ఉన్న ఎడమ, కుడి కాల్వల మిగులు భూములకు నీరందించేందు కు అవకాశం ఏర్పడుతుంది. తాండవకు ఏలేరుతో అనుసంధానం చేసి ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా ఏటా సమృద్ధిగా నీరందితే మరికొంత అదనంగా ఆయకట్టు విస్తీర్ణం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా..నాడు వైఎస్సార్, నేడు జగన్మోహన్రెడ్డి తాండవ ఆయకట్టు రైతాంగంపై కరుణ చూపటం పట్ల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన మెట్ట రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆమోదం తెలిపారు ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేయడంతో నర్సీపట్నం నియోజకవర్గంతో పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల పొలాలకు పుష్కలంగా నీరు వస్తుంది. ఈ అనుసంధానానికి సీఎం జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. రూ. 500 కోట్లు ఈ పనులకు కేటాయిస్తామని సీఎం మాట ఇచ్చారు. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామం అవుతుంది. – పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే, నర్సీపట్నం ఆయకట్టు సస్యశ్యామలం ఏలేరు కాలువ, తాండవ జలాశయం అనుసంధానంతో జలాశయం కింద ఉన్న ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. మేజర్ ప్రాజెక్టు అయినప్పటికీ శివారు ఆయకట్టుకు నీరందడంలేదు. అనుసంధానంతో శివారు ఆయకట్టుకు నీరు అందడంతో పాటు రెండు పంటలు పండించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. – తాతాజీ, రైతు, మెట్టపాలెం -
నిర్లక్ష్య ‘తాండవం’
► రైతులను వేధిస్తున్న పూడిక సమస్య ► పరీవాహక ప్రాంతాలలో సాగు ► విచ్చలవిడిగా భూముల అమ్మకాలు ► తాండవ గర్భంలో ఇసుక తవ్వకాలు ► ప్రతి ఏటా నీరు లేక ఇబ్బందులు గొలుగొండ (నర్సీపట్నం): అన్నదాతల వరప్రదాయినిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న తాండవ జలాశయం రోజురోజుకు వట్టిపోతోంది. జిల్లాలో పెద్ద రిజర్వాయర్‌గా పేరున్నా రైతులకు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో సాగునీరు అందలేదు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాలలో విస్తారంగా పంటలు వేయడం వలన పూడిక పెరిగి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతోంది. అలాగే తాండవ భూములను అమ్మేస్తున్నా.. జలాశ యం గర్భంలో ఇసుక తవ్వేస్తున్నా తాండవ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాండవ జలాశయం సుమారు 4 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలైన సాలికమల్లవరం, జోగుంపేట, అమ్మపేట, గాదంపాలెం, తదితర ప్రాంతాలలో వ్యవసాయం జోరుగా సాగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ వేలాది టన్నుల టమాటాలు పండిస్తారు. వేరుసెనగ, కొమ్ముసెనగ, వంగ, టమాటాలు, జనుముతోపాటు వరి సాగును విస్తృతంగా చేస్తారు. పూడికే అసలు సమస్య వందలాది ఎకరాల్లో సాగు చేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు సాగులో ఉన్న మట్టి తాండవ గర్భంలోకి చేరి నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. పూడిక పెరిగి ఏమాత్రం వర్షం కురిసినా తాండవ జలాశయం ఇట్టే నిండిపోతుంది. జనవరి నెల వచ్చేసరికి తాండవ నీటిమట్టం చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ప్రతి ఏటా ఖరీఫ్ చివర్లో తాండవ భూములకు సాగునీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారు. జోరుగా భూముల అమ్మకాలు తాండవ భూముల అమ్మకాలు జరుగుతుంటే పట్టించుకునేవారు కరువయ్యారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన ఈ ప్రాంతవాసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాలికమల్లవరం, జోగుంపేట, గాదంపాలెం, విప్పలపాలెం తదితర ప్రాంతాల్లో ఈ భూములు అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నీటిసామర్ధ్యం తగ్గిపోవడం వలన జనవరి నెల నుంచి భూములు ఖాళీ అవుతున్నాయి. ఆ సమయంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన భూములు కావడంతో ఏ పంట వేసినా సిరులు పండుతున్నాయి. దీంతో ఆక్రమించిన వారు భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. జోగుంపేటకు ఒక వ్యక్తి రెండెకరాల భూమిని గత ఏడాది కొనుగోలు చేసి అందులో ఇటీవల 5 లక్షల వరకు టమాటాలు పండించాడు. మల్లవరానికి చెందిన ఒక రైతు ఏకంగా 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సరుగుడు తోటలు వేశాడు. తాండవ గర్భంగా వరి పండిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్ధం చేసుకోవాలి. కోట్లాది రూపాయల ఇసుక తవ్వకాలు నీటి సామర్ధ్యం లేక ఇబ్బందుల్లో ఉన్న తాండవ జ లాశయం గర్భంలో అతి దారుణంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గాదంపాలెం వద్ద సు మారు 8 కోట్ల విలువైన ఇసుక నిల్వ చేశారు. చో ద్యం, కేడిపేట, గాదంపాలెం, కొత్తమల్లంపేట, జో గుంపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ ఇసుక నిల్వలను తన్నుకుపోతున్నారు. పూడిక సమస్యతో ఉన్న తాండవ జలాశయంలో తవ్వ డం వల్ల భూగర్భ జలాలకు నష్టం జరుగుతోంది. ఒక్కసారి కూడా పూడిక తీయలేదు తాండవ జలాశయం 1976లో నిర్మించారు. ఇంతవరకు ఎప్పుడూ పూడిక తొలగించలేదు. దీని వలనే పూడిక పెరిగి నీటి సామర్ధ్యం తగ్గిపోతుంది. వారం రోజుల్లో టీమ్‌లుగా వెళ్లి చర్యలు తీసుకుంటాం తాండవ భూములు ఆక్రమించడం నేరం. అమ్మకాలు చేయకూడదు. పంటలు వేయకూడదు. ఇసుక తవ్వకాలు చేయడం నేరం. వీటన్నింటినీ జిల్లా అధికారుల దృష్టికి తీసువెళ్లి వారం రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఇసుక తవ్వకాలు జరగకుండా కేడీ పేట పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాం. – రాజేంద్ర కుమార్, తాండవ జలాశయం డీఈఈ