నిర్లక్ష్య ‘తాండవం’
► రైతులను వేధిస్తున్న పూడిక సమస్య
► పరీవాహక ప్రాంతాలలో సాగు
► విచ్చలవిడిగా భూముల అమ్మకాలు
► తాండవ గర్భంలో ఇసుక తవ్వకాలు
► ప్రతి ఏటా నీరు లేక ఇబ్బందులు
గొలుగొండ (నర్సీపట్నం): అన్నదాతల వరప్రదాయినిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న తాండవ జలాశయం రోజురోజుకు వట్టిపోతోంది. జిల్లాలో పెద్ద రిజర్వాయర్‌గా పేరున్నా రైతులకు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో సాగునీరు అందలేదు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాలలో విస్తారంగా పంటలు వేయడం వలన పూడిక పెరిగి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతోంది.
అలాగే తాండవ భూములను అమ్మేస్తున్నా.. జలాశ యం గర్భంలో ఇసుక తవ్వేస్తున్నా తాండవ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాండవ జలాశయం సుమారు 4 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలైన సాలికమల్లవరం, జోగుంపేట, అమ్మపేట, గాదంపాలెం, తదితర ప్రాంతాలలో వ్యవసాయం జోరుగా సాగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ వేలాది టన్నుల టమాటాలు పండిస్తారు. వేరుసెనగ, కొమ్ముసెనగ, వంగ, టమాటాలు, జనుముతోపాటు వరి సాగును విస్తృతంగా చేస్తారు.
పూడికే అసలు సమస్య
వందలాది ఎకరాల్లో సాగు చేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు సాగులో ఉన్న మట్టి తాండవ గర్భంలోకి చేరి నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. పూడిక పెరిగి ఏమాత్రం వర్షం కురిసినా తాండవ జలాశయం ఇట్టే నిండిపోతుంది. జనవరి నెల వచ్చేసరికి తాండవ నీటిమట్టం చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ప్రతి ఏటా ఖరీఫ్ చివర్లో తాండవ భూములకు సాగునీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారు.
జోరుగా భూముల అమ్మకాలు
తాండవ భూముల అమ్మకాలు జరుగుతుంటే పట్టించుకునేవారు కరువయ్యారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన ఈ ప్రాంతవాసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాలికమల్లవరం, జోగుంపేట, గాదంపాలెం, విప్పలపాలెం తదితర ప్రాంతాల్లో ఈ భూములు అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నీటిసామర్ధ్యం తగ్గిపోవడం వలన జనవరి నెల నుంచి భూములు ఖాళీ అవుతున్నాయి. ఆ సమయంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
సారవంతమైన భూములు కావడంతో ఏ పంట వేసినా సిరులు పండుతున్నాయి. దీంతో ఆక్రమించిన వారు భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. జోగుంపేటకు ఒక వ్యక్తి రెండెకరాల భూమిని గత ఏడాది కొనుగోలు చేసి అందులో ఇటీవల 5 లక్షల వరకు టమాటాలు పండించాడు. మల్లవరానికి చెందిన ఒక రైతు ఏకంగా 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సరుగుడు తోటలు వేశాడు. తాండవ గర్భంగా వరి పండిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్ధం చేసుకోవాలి.
కోట్లాది రూపాయల ఇసుక తవ్వకాలు
నీటి సామర్ధ్యం లేక ఇబ్బందుల్లో ఉన్న తాండవ జ లాశయం గర్భంలో అతి దారుణంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గాదంపాలెం వద్ద సు మారు 8 కోట్ల విలువైన ఇసుక నిల్వ చేశారు. చో ద్యం, కేడిపేట, గాదంపాలెం, కొత్తమల్లంపేట, జో గుంపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ ఇసుక నిల్వలను తన్నుకుపోతున్నారు. పూడిక సమస్యతో ఉన్న తాండవ జలాశయంలో తవ్వ డం వల్ల భూగర్భ జలాలకు నష్టం జరుగుతోంది.
ఒక్కసారి కూడా పూడిక తీయలేదు
తాండవ జలాశయం 1976లో నిర్మించారు. ఇంతవరకు ఎప్పుడూ పూడిక తొలగించలేదు. దీని వలనే పూడిక పెరిగి నీటి సామర్ధ్యం తగ్గిపోతుంది.
వారం రోజుల్లో టీమ్‌లుగా వెళ్లి చర్యలు తీసుకుంటాం
తాండవ భూములు ఆక్రమించడం నేరం. అమ్మకాలు చేయకూడదు. పంటలు వేయకూడదు. ఇసుక తవ్వకాలు చేయడం నేరం. వీటన్నింటినీ జిల్లా అధికారుల దృష్టికి తీసువెళ్లి వారం రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఇసుక తవ్వకాలు జరగకుండా కేడీ పేట పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాం. – రాజేంద్ర కుమార్, తాండవ జలాశయం డీఈఈ