తాండవ జలాశయం
ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రూ.500 కోట్లతో జరిగే ఈ బృహత్కార్యక్రమానికి త్వరలో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామలమవుతుంది. ఏలేరు, తాండవ జలాశయం కలయిక రెండు జిల్లాల రైతులకు వరం.
సాక్షి, నర్సీపట్నం: తూర్పు కనుమల నుంచి వస్తున్న నీటికి 1959లో తాండవ వద్ద అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రిజర్వాయరుకు శంకుస్థాపన చేయగా పదేళ్ల కాలంలో ఇది పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని విశాఖ, తూర్పుగోదావరి జిల్లా లోని 52 వేల ఎకరాలకు సాగునీరందించే దిశగా రూపుదిద్దుకుంది. తరువాత వచ్చిన పాలకులు దీన్ని పట్టించుకోకపోవటంతో రిజర్వాయరుతో పాటు కాలువల్లో పూడిక పేరుకు పోయి ఏటా ఆయకట్టు తగ్గుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు.
ఆయకట్టు భూములకు నీరు అందే పరిస్థితి ఉన్నా వరుణ దేవుడు కరుణిస్తే తప్ప రైతులు నాట్లు వేసే అవకాశం లేదు. ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో గట్టెక్కించేందుకు నాడు తండ్రి మాదిరిగానే నేడు తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈ రెండు జిల్లాల్లో ఆయకట్టు రైతులు ప్రతికూల వాతావరణంలో సైతం సుభిక్షంగా ఉండేందుకు ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి మరింత ఆయకట్టు పెంచి స్థిరీకరణ చేసేందుకు నిర్ణయించారు.
తాండవతో అనుసంధానించే ఏలేరు కాలువ
వాస్తవ పరిస్థితి
విశాఖ జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. ఈ జలాశయం కింద విశాఖ జిల్లాల్లోని నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 32,689 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా చెందిన కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు చెందిన 18,776 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వా యరు నిర్మాణం ప్రారంభంలో చివరి ఆయకట్టు వరకు నీరందేది. క్రమేణా కాలువల్లో పూడిక పేరుకుపోయి కుదించుకుపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వచ్చింది.
చివరి భూములకు నీరు అందడం గగనంగా మారింది. వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ లైనింగ్‌తో పాటు రిజర్వాయరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో రిజర్వాయరు నిండితే చివరి ఆయట్టు వరకు సాగు నీరందిందేందుకు వీలు కలిగింది. కాలువలు బాగున్నా, వాతావరణం అనుకూలంగా లేక రిజర్వాయరులో నీరు లేని సమయాల్లో ఆయకట్టు రైతులు నాట్లు వేసే పరిస్థితి ఉండేది కాదు.
జగన్ ప్రభుత్వంలో..
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, పత్తిపాడు ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేష్, దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, పూర్ణచంద్రప్రసాద్, సినీ నటుడు, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడికి చెందిన ఆర్.నారాయణమూర్తి వివరించారు. ఏలేరు నీటిని అనుసంధానం చేస్తే అధిక శాతం మెట్ట రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దీంతో ఏలేరు కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం పెంచడంతో పాటు ఈ నీటిని తాండవకు అనుసంధానం చేసేందుకు అవ సరమైన రూ.500 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
పనులు జరిగేది ఇలా..
గతంలో 1,200 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం చేసిన ఏలేరు కాలువ ప్రస్తుతం 200 టీఎంసీల స్థాయికి చేరింది. దీనిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించింది. పనులు పూర్తయిన తరువాత దీనిగుండా ప్రవహించే నీటిని తాండవ రిజర్వాయరుతో పాటు కాలువల్లో పలు చోట్ల లిఫ్ట్ ద్వారా వేసి వాటిని పూర్తిస్థాయిలో రైతాంగానికి అందించేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఈ పనులకు మరో రూ.250 కోట్లు కేటాయించారు.
లిఫ్ట్ పనులు ఇలా..
నాతవరం మండలం, శరభవరం ఏలేరు కాలువ నుంచి పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి, గాంధీ నగరం వద్ద ఉన్న తాండవ ఎడమ కాల్వకు అందించేందుకు నిర్ణయించారు. దీనివల్ల బలిఘట్టం మేజరు భీమవరపు కోట మేజర్ల నుంచి కోటవురట్ల మండలాలకు పూర్తిస్థాయిలో సాగు నీరందుతుంది. చిన గొలుగొండపేట వద్ద పైన తాండవ కింద ఏలేరు ప్రవహించే అక్విడెక్టు ప్రాంతంలో లిఫ్ట్ ద్వారా రిజర్వాయరు కుడి కాల్వలో నీరు వేసేందుకు నిర్ణయించారు. తద్వారా కోటనందూరు మండలంలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. ఇదే ప్రాంతం నుంచి ఏలేరు నీటిని తీసు కొని లిఫ్ట్ ద్వారా నాతవరం మండలం వెదురుపల్లి వద్ద తాండవ కుడికాలువకు అందించేందుకు నిర్ణయించారు.
దీంతో కోటనందూరు మేజరుకు చెందిన పీకే గూడెం, రౌతులపూడి మండలాల్లో చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక్కడి నుంచి ఏలేరు నీటిని లిఫ్ట్ ద్వారా ఎగువన ఉన్న తాండవ రిజర్వాయరుకు తరలిస్తారు. ఈ విధంగా సమకూరిన నీటితో మధ్యస్థలంలో మిగిలి ఉన్న ఎడమ, కుడి కాల్వల మిగులు భూములకు నీరందించేందు కు అవకాశం ఏర్పడుతుంది. తాండవకు ఏలేరుతో అనుసంధానం చేసి ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా ఏటా సమృద్ధిగా నీరందితే మరికొంత అదనంగా ఆయకట్టు విస్తీర్ణం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా..నాడు వైఎస్సార్, నేడు జగన్‌మోహన్‌రెడ్డి తాండవ ఆయకట్టు రైతాంగంపై కరుణ చూపటం పట్ల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన మెట్ట రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ఆమోదం తెలిపారు
ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేయడంతో నర్సీపట్నం నియోజకవర్గంతో పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల పొలాలకు పుష్కలంగా నీరు వస్తుంది. ఈ అనుసంధానానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. రూ. 500 కోట్లు ఈ పనులకు కేటాయిస్తామని సీఎం మాట ఇచ్చారు. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామం అవుతుంది.
– పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే, నర్సీపట్నం
ఆయకట్టు సస్యశ్యామలం
ఏలేరు కాలువ, తాండవ జలాశయం అనుసంధానంతో జలాశయం కింద ఉన్న ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. మేజర్ ప్రాజెక్టు అయినప్పటికీ శివారు ఆయకట్టుకు నీరందడంలేదు. అనుసంధానంతో శివారు ఆయకట్టుకు నీరు అందడంతో పాటు రెండు పంటలు పండించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. – తాతాజీ, రైతు, మెట్టపాలెం
Comments
Please login to add a commentAdd a comment