ఘోరం..
ట్రాక్టర్ బోల్తా.. టెన్త్ విద్యార్థిని మృతి
పది మందికి తీవ్రగాయాలు..
క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు
యల్లనూరు: కూలీలు, విద్యార్థులతో బయల్దేరిన ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్పెషల్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ మృతి చెందిన విద్యార్థిని తనూజ తల్లిదండ్రులు రాములు, గురక్కలు బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నీర్జాంపల్లి సమీపంలో గ్రామానికి చెందిన పెద్దిరాజు, ఆయన భార్య రామలక్ష్మమ్మ, పెద్దిరాజు తమ్ముడు చంద్రయ్య, ఆయన భార్య జయమ్మలు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాక్టర్లో ఇసుకను తీసుక తేవడానికి బయల్దేరారు.
అదే సమయంలో నీర్జాంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థులు తనూజ(15), భాస్కర్, గంగామహేష్, కామాక్షి, మణికంఠ, భారతి, పృధ్విలు తాము చదువుకుంటున్న పార్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు ట్రాక్టర్లో ఎక్కారు. గ్రామం దాటి కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. అందరూ తీవ్రంగా గాయపడటంతో హుటిహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తనూజ మృతి చెందింది. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థిని భారతిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆస్పత్రికి తరలించారు. కామాక్షి, మణికంఠలను అనంతపురం, పెద్దిరాజును కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులు గంగామహేష్, భాస్కర్‌తో పాటు చంద్రయ్య, జయమ్మ, రామలక్ష్మమ్మలు పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్షతగాత్రులను పరామర్శ:
రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పులివెందుల ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు.