tharimela nagireddy
-
తరిమెల నాగిరెడ్డి జీవితం ఎందరికో స్ఫూర్తి
అనంతపురం కల్చరల్: తరిమెల నాగిరెడ్డిది విలక్షణమైన పాత్ర అని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని వివిధ పార్టీల, సంస్థల నాయకులు అన్నారు. తరిమెల నాగిరెడ్డి వర్ధంతి శుక్రవారం నగరంలో ఘనంగా జరిగింది. ఉదయం స్థానిక టవర్‌క్లాక్ వద్ద ఉన్న తరిమెల నాగిరెడ్డి విగ్రహానికి సీపీఐ నేతలు రామకృష్ణ, జగదీష్, సీపీఎం నాయకులు రాంభూపాల్, వైఎస్సార్సీపీ నేతలు ఎర్రిస్వామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రెడ్డి పరివార్ సంఘం నాయకులు సుధాకర్‌రెడ్డి, కదలిక ఇమామ్, డాక్టర్ తరిమెల అమరనాథరెడ్డి తదితరులు తరిమెల నాగిరెడ్డికి నివాళులర్పించారు. అక్కడి నుంచి వందలాది మంది నాగిరెడ్డి స్ఫూర్తిని చాటుతూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే విప్లవోద్యమ సారధులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ స్థానిక ఉపాధ్యాయ భవన్లో జరిగింది. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (ఎంఎల్) కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాహితీ విమర్శకులు జైట్టీ జైరామ్, భారత చైనా మిత్ర మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్‌రెడ్డి, యుసీసీఆర్‌ఐ ఎంఎల్ సీనియర్ నాయకులు బాలు తదితరులు తరిమెల నాగిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు. -
అరుణతార టీఎన్
సందర్భం : రేపు తరిమెల నాగిరెడ్డి వర్ధంతి అనంతపురం న్యూటౌన్: ‘అనంత’ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆదర్శవంతమైన జీవితాన్ని సొంతం చేసుకున్న తరిమెల నాగిరెడ్డి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అణగారిన బడుగుబలహీన వర్గాల ఆప్తబంధువుగా, విలువల కోసం జీవిత గమనాన్ని మార్చుకుని కమ్యూనిçష్టు దిక్సూచిగా నిలచిన నేతగా ఎదిగిన నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. తెలుగు చరిత్రనే కాదు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాగిరెడ్డి పోరాటం అనంత చరిత్రలో అజరామరం.. అనితర సాధ్యం. సహచరులతో ముద్దుగా కామ్రేడ్ టీఎన్ అని పిలిపించుకునే ఆయన వర్ధంతిని శుక్రవారం నిర్వహించేందుకు జిల్లాలో సన్నాహాలు చేస్తున్నారు. పోరాటాల జీవితం నిత్యమూ నిజమైన కమ్యూనిస్టు వాదిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి ఏనాడు అధికార దర్పానికి బానిస కాకుండా ప్రజల వెంటే నడిచారు. ఈ విషయమే ఆయనను రాజకీయ దిగ్గజంగా ఎదిగిన తన బావ నీలం సంజీవరెడ్డిని సైతం ఎన్నికల సంగ్రామంలో ఓడించగలిగింది. 1917 ఫిబ్రవరి 11న తరిమెల గ్రామంలో సుబ్బారెడ్డి, ఆదిలక్షుమమ్మ దంపతులకు జన్మించిన నాగిరెడ్డి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రుషివాలీ విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా అనేక పుస్తకాలను రచించారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ‘యుద్ధం– ఆర్థిక ప్రభావం’ అన్న రచనతో అందరినీ ఆలోచింపజేశారు. 1941లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకించిన బ్రిటీష్ ప్రభుత్వం... తరిమెల నాగిరెడ్డిని తిరుచురాపల్లి కారాగారంలో బంధించింది. మద్రాసు లెజిస్టేటివ్ అసెంబ్లీ మెంబరుగా, లోకసభ సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీ తరుఫున ఎన్నికై నిరుపమాన సేవలందించిన తరిమెల నాగిరెడ్డి 1976లో రహస్య జీవితం గడుపుతూ మరణించారు. రేపు తరిమెల నాగిరెడ్డి సంస్మరణ సభ స్ఫూర్తిదాయక పోరాటాలతో జిల్లా వాసుల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన తరిమెల నాగిరెడ్డి 41వ వర్ధంతితో పాటు కమ్యూనిస్టు అగ్రనేత దేవులపల్లి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శుక్రవారం జరుగనుంది. జిల్లా కేంద్రం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో సాయంత్రం ఆరు గంటలకు భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (ఎంఎల్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
మన తొలితరం ఎమ్మెల్యేలు
హాయ్ పిల్లలూ.. మన తొలి తరం ఎమ్మెల్యేలు ఎవరనేది మీకు తెలుసా? బ్రిటీష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదే్‌శ్‌కు నిర్వహించిన ఎన్నికల్లో మన జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలే ఉండేవి. 1952లో నిర్వహించిన ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణరెడ్డి (ఇండిపెండెంట్), హిందూపురం నియోజకవర్గం నుంచి శివశంకరరెడ్డి (కాంగ్రెస్), మడకశిర నుంచి సిద్దనగౌడ (ఇండిపెండెంట్), కదిరి నుంచి కె.వి.వేమారెడ్డి (కాంగ్రెస్), ధర్మవరం నుంచి కె. శ్రీనివాసులు (ప్రజాపార్టీ), తాడిపత్రి నుంచి సి. సుబ్బారాయుడు (ప్రజాపార్టీ), అనంతపురం నుంచి తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు), కళ్యాణదుర్గం నుంచి సందా నారాయణప్ప (కాంగ్రెస్) ఎన్నికకాగా, తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతప్ప (ఎస్టీ) ఎన్నికయ్యారు.