తరిమెల నాగిరెడ్డి జీవితం ఎందరికో స్ఫూర్తి
అనంతపురం కల్చరల్: తరిమెల నాగిరెడ్డిది విలక్షణమైన పాత్ర అని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని వివిధ పార్టీల, సంస్థల నాయకులు అన్నారు. తరిమెల నాగిరెడ్డి వర్ధంతి శుక్రవారం నగరంలో ఘనంగా జరిగింది. ఉదయం స్థానిక టవర్‌క్లాక్ వద్ద ఉన్న తరిమెల నాగిరెడ్డి విగ్రహానికి సీపీఐ నేతలు రామకృష్ణ, జగదీష్, సీపీఎం నాయకులు రాంభూపాల్, వైఎస్సార్‌సీపీ నేతలు ఎర్రిస్వామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రెడ్డి పరివార్ సంఘం నాయకులు సుధాకర్‌రెడ్డి, కదలిక ఇమామ్, డాక్టర్ తరిమెల అమరనాథరెడ్డి తదితరులు తరిమెల నాగిరెడ్డికి నివాళులర్పించారు.
అక్కడి నుంచి వందలాది మంది నాగిరెడ్డి స్ఫూర్తిని చాటుతూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే విప్లవోద్యమ సారధులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జరిగింది. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (ఎంఎల్) కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాహితీ విమర్శకులు జైట్టీ జైరామ్, భారత చైనా మిత్ర మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్‌రెడ్డి, యుసీసీఆర్‌ఐ ఎంఎల్ సీనియర్ నాయకులు బాలు తదితరులు తరిమెల నాగిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు.