మహానేత వైఎస్సార్‌తో అనంత వెంకటరెడ్డి (ఫైల్)
దశాబ్దాల కరువు ‘అనంత’ను ఛిద్రం చేసింది. సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్న జిల్లాను సస్యశ్యామలం చేయాలంటే ప్రాజెక్ట్‌ల అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించింది స్వాతంత్ర సమరయోధుడు అనంత వెంకటరెడ్డి. తొలితరం సాగునీటి ఉద్యమకారుడిగా జిల్లా చరిత్ర పుటల్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అన్యాయాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి పరితపించిన అనంత వెంకటరెడ్డి సేవలను గుర్తుకు చేసుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సందర్భం: నేడు అనంత వెంకటరెడ్డి 21వ వర్ధంతి
సాక్షి, అనంతపురం సెంట్రల్: అనంత వెంకటరెడ్డి 1921, జూలై 1న జన్మించారు. గుంటూరులోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కర్ణాటకలోని బెల్గాంలో బీఎల్ (బ్యాచులర్ ఆఫ్ లా) చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరిస్తూ వచ్చారు. మహాత్ముడి పిలుపు మేరకు ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. న్యాయవాది పట్టా పొందిన తర్వాత అనంతపురంలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. సుమారు 35 సంవత్సరాల పాటు ఈ వృత్తిలో కొనసాగారు. 1967–68లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.
రాజకీయరంగ ప్రవేశం..
స్వాతంత్య్రం అనంతరం భారత జాతీయ కాంగ్రెస్‌లో అనంత వెంకటరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 1964–67, 1969–72 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీకి ప్రధానకార్యదర్శిగా, 1978–79లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1969లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అనంతపురం లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలుసొంది ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విధాన సభ, పార్లమెంటులోను వివిధ కమిటీలలో సభ్యుడిగా ఆయన విలువైన సేవలను అందించారు.
జలసాధన ఉద్యమాలు..
అనంత వెంకటరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జిల్లా కరువు పరిస్థితులు ఆయనను కదిలించాయి. కరువు రక్కసిని జిల్లా నుంచి శాశ్వతంగా పారదోలాలంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల సాధనే శరణ్యమని భావించారు. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు సంక్షేమం కోసమే పరితపించారు. తొలిసారిగా పార్లమెంట్‌లో జిల్లా కరువు పరిస్థితులపై గళం విప్పి, అనంత ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకెళ్లారు. ఆయన పోరాటాల ఫలితంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాలను డీపీఏపీ (దుర్భిక్ష ప్రాంత అభివృద్ధి పథకం), డీడీపీ (ఎడారి అభివృద్ధి పథకం) కిందకు తీసుకొచ్చింది. ఆ తర్వాత కరువును శాశ్వతంగా పారదోలేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు చెందిన పాత్రికేయ బృందంతో కలిసి రాజస్తాన్‌లోని జైసల్మేర్ ప్రాంతాన్ని సందర్శించారు.
ప్రాజెక్ట్‌కు ‘అనంత’ పేరు..
జిల్లాలో కరువు శాశ్వత నివారణ చర్యలు చేపట్టేలా సాగునీటి ప్రాజెక్ట్‌ల సాధనకు అనంత వెంకటరెడ్డి సాగించిన పోరాటాలను 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించారు. దీంతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఈ విషయం టీడీపీ పెద్దలకు నచ్చలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లా సాగునీటి చరిత్ర పుటల్లో నుంచి అనంత వెంకటరెడ్డి పేరును తుడిచి వేసే చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగానే హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు అనంత వెంకటరెడ్డి పేరును తొలగించేశాడు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా మార్చేసింది.
నేడు వర్ధంతి
జిల్లాకు ప్రాజెక్ట్‌ల సాధన కోసం పోరాటాలు సాగించిన అనంత వెంకటరెడ్డి 21వ వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నారు. నగరంలోని సర్వజనాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి ఉదయం 9.30 గంటలకు ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి, నివాళులర్పించనున్నారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఈ మేరకు అనంత వెంకటరెడ్డి తనయుడు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment