తామ్రపత్రం చూపుతున్న శ్రీకాంతం శ్యామమూర్తి
ఎందరో వీరుల త్యాగఫలం.. నేటి స్వేచ్ఛా భారతం. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తెల్లదొరలపై పోరాడి ప్రాణాలు అర్పించిన వారు ఎందరో. బందీలుగా మారి జైళ్లలో జీవితాలు గడిపిన వారు ఇంకెందరో.. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆనాటి స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారు. అలాంటి ఆఖరి తరం స్వాతంత్య్ర సమరయోధుడే శ్రీకాంతం శ్యామమూర్తి. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు శిష్యగణంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డితో పాటు శ్యామమూర్తి కూడా కీలక పాత్ర పోషించారు. వందేళ్ల వయస్సులోనూ స్వాతంత్య్రోదమాన్ని ప్రస్తావిస్తే ఆయనలో దేశభక్తి ఉప్పొంగుతుంది. పదేళ్ల వయస్సులోనే భరతమాత స్వేచ్ఛ కోసం బ్రిటీష్ వారిని ఎదిరించి కారాగార శిక్షను అనుభవించారు. ఆనాటి జ్ఞాపకాలను ‘సాక్షి’ పాఠకుల కోసం ఆనందంగా పంచుకున్నారు.
మాది కదిరి తాలూకా ముత్యాల చెరువు గ్రామం. అమ్మానాన్నలు ఆదిలక్ష్మమ్మ, నంజుండప్ప. ఊళ్లోని శివాలయంలో అర్చకులుగా పనిచేసే కుటుంబం మాది. మేము ఐదుగురు సంతానం. అందరూ వెళ్లిపోయారు. మా తల్లిదండ్రులు ఏనాడు మమ్మల్ని ఇప్పటిలా గోముగా పెంచలేదు. దేశం గురించి తరచూ చెప్పేవాళ్లు. త్యాగం, దేశభక్తి, నిస్వార్థం అప్పటి సమాజం నుంచే నేర్చుకున్నాం. కాబట్టే నాకు పదేళ్ల వయసు వచ్చేనాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిత్యం నినాదాలు చేస్తూ పాఠశాలలకు వెళ్లేవాళ్లం. కొన్ని సార్లు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది.
గాంధీజీ స్ఫూర్తితోనే..
మహాత్ముడు స్వాతంత్య్ర సమరానికి నేతృత్వం వహిస్తున్న రోజులవి. ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతూ, ప్రజలను చైతన్య పరుస్తూ ఓసారి మా ఊరికి సమీపంలోని కదిరికి వచ్చారు. ఆయన్ను నాకు చూపించడానికి మా నాన్న తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్లారు. తీరా దగ్గరకు రాగానే ‘భారత్ మాతాకీ జై.. గాంధీజీ జిందాబాద్’ అంటూ గట్టిగా నినదించాను. ఓ పోలీసాయన నన్ను తీసుకొని గాంధీజీ దగ్గరకు చేర్చారు. ఖాకీ నిక్కరు వేసుకొని ఉన్న నన్ను ఎత్తుకున్న మహాత్మాగాంధీ హిందీలో ఏదో చెప్పారు. అప్పుడు నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ పిల్లాడికి మంచి భవిష్యత్ ఉందని పెద్దలతో అన్నారంట. ఆయన ఆశీర్వాదమో, లేక ఆనాటి నిరంత స్ఫూర్తిదాయక పోరాటాల ఫలితమో తెలియదు కానీ, నాలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుంది. నేను ఇక చదువుకోవాల్సిన అవసరం కన్నా దేశమాత స్వేచ్ఛ కోసం పోరాడాలనిపించింది. ఇంట్లో వద్దని చెబుతున్నా థర్డ్ ఫారమ్(ఇప్పటి ఎనిమిదవ తరగతికి సమానం)తో చదువుకు స్వస్తి చెప్పి.. స్నేహితులతో రహస్య సమావేశాలకు వెళ్లేవాడిని.
బ్రిటీష్ బంగ్లా కాల్చేశాం...
గాంధీజీ ఇచ్చి స్ఫూర్తితో మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఆ రోజుల్లో బ్రిటీష్ వారు చాలా చోట్ల బంగ్లాలను నిర్మించుకుని అక్కడి నుంచే పాలన సాగించేవారు. అలా మా చుట్టపక్క ప్రాంతాల్లో ఎన్నో బంగ్లాలుండేవి. మా స్నేహితులు బసిరెడ్డి సుబ్బారెడ్డి నేతృత్వంలో కూర్మాల గంగిరెడ్డి, దొన్నికోట రామిరెడ్డి, పులగంపల్లి ఆదిమూర్తి ముదిగుబ్బ చెన్నప్ప తదితరులతో కలిసి నల్లమాడ సమీపంలో బ్రిటీషర్లు నిర్మించిన ఓ బంగ్లాను తగలబెట్టడమేకాకుండా జాతీయ జెండాపట్టుకొని గట్టిగా నినాదాలు చేశాం. ఈ వార్త గంటల్లో అధికారులకు చేరిపోయింది. మమ్మల్ని అరెస్టు చేసి పెనుగొండ సబ్‌జైలుకు తరలించారు. అక్కడ అప్పటికే శిక్షననుభవిస్తున్న దేశభక్తులు మా పోరాటాన్ని అభినందించారు. నేనలా 9 నెలల 11 రోజులు కారాగారశిక్ష అనుభవించి విడుదలయ్యాను. కానీ స్వాతంత్య్రం వచ్చే వరకు ఏదో రూపంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో మాకు స్ఫూర్తిగా నిలిచింది కల్లూరు సుబ్బారావు గారు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులు. వారంతా ఎంతో నిస్వార్థమైన నాయకులు.
ఎందరో అజ్ఞాత వీరులు శ్రమించారు
మా కాలంలో గణాంకాలు ఇంత కచ్చితంగా ఉండేవి కావు. కాబట్టే అధికారిక లెక్కల ప్రకారం నాకు వందేళ్లు రావడానికి ఇంకా కొన్ని నెలలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి నేనెప్పుడో వందేళ్లు దాటేశాను. పంచాంగం ప్రకారం వెయ్యి పౌర్ణిమలను చూసిన వారు వందేళ్ల వారని చెబుతారు. నేను అంతకంటే ఎక్కువే చూశాను. ఇక మాతో పాటు చియ్యేడు కరణం రామచంద్రారావు, ఆయన సతీమణి సావిత్రమ్మ లాంటి వారు ఎందరో అజ్ఞాతంగా ఉంటూ స్వాతంత్య్రం కోసం శ్రమించారు. త్యాగాలు చేశారు. రాత్రిళ్లు లాంతర్లు పట్టుకొని రహస్య సమావేశాలకు వచ్చేవారు. ఆ అభిమానంతోనే రామచంద్రరావు కూతురు ఉమామహేశ్వరిని నా కుమారుడు కోడలిగా తెచ్చుకున్నాడు. మా మనవరాలు కూడా కార్పోరేటర్ (వైఎస్సార్‌సీపీ తరఫున )గా ఉంది. ఇప్పటి రాజకీయాలకైతే మా తరం ఎంతో దూరంగా ఉంది.
ఢిల్లీకి వెళ్లలేకపోయా...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1972 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నన్ను స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తిస్తూ తామ్రపత్రం మంజూరు చేశారు. ఢిల్లీకి రావాలని ఆహ్వానం పంపారు. కానీ కొన్ని కారణాలతో వెళ్లలేకపోయాను. కానీ అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా. అప్పుడే కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేక పింఛను మంజూరు చేశారు. ఈ పింఛన్ ఇప్పటికీ అందుకుంటూనే ఉన్నా. వయసు మీద పడడం వల్ల ఎక్కడికి పోలేను. కానీ చాలా మంది నన్ను ఇంకా గుర్తిస్తూ ఆనాటి విషయాలను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక అప్పటి వారితో ఈనాటి పరిస్థితులకు పోలికే లేదు. శత్రువుల పట్ల కూడా ఎంతో నిబద్ధతతో, నిజాయతీగా వ్యవహరించేవాళ్లం. మేమంతా అప్పుడు జాతీయ కాంగ్రెస్‌లో ఉండేవాళ్లం. తరిమెల నాగిరెడ్డి లాంటి వాళ్లు కమ్యూనిస్టు పార్టీలోఉన్నా ఎంతో గౌరవించేవాళ్లం. పార్టీలకతీతంగా మా పట్ల ఆయనకూ అదే అభిమానం.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో 18–08–1947లో నిర్వహించిన అన్నదానం
ఆనంద ఘట్టం..అపురూప చిత్రం
రాయదుర్గం టౌన్: భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించగా దేశమంతా సంబరాలు మిన్నంటాయి. రాయదుర్గంలోనూ జనం వీధుల్లోకి వచ్చి ‘భారత్‌మాతాకీ జై’ అంటూ నినదించారు. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల తర్వాత 18 ఆగస్టు 1947న స్థానిక రాణిఛత్రం వద్ద తోట అంజినప్ప అండ్ సన్స్ వారు వేలాది మంది ప్రజలకు అన్నదానం చేశారు. ఆ అపురూప దృశ్యాలు నాటి స్వాతంత్య్ర ఆనంద ఘట్టాన్ని తెలియజేస్తోంది.
జెండాకు వందనం చేస్తేనే ఆనందం
మా పిల్లలందరూ వేర్వేరు చోట్ల స్థిరపడిపోయారు. నేను మా అబ్బాయి సుబ్బారావు వద్ద జిల్లా కేంద్రంలోనే ఉంటున్నా. ఏటా జాతీయ పండుగలొచ్చాయంటే త్రివర్ణ పతానికి వందనం చేసి వస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈసారి కరోనా వల్ల మా పిల్లల ఆందోళన, ప్రభుత్వ నిబంధనల వల్ల జాతీయ జెండాను ఎగురేసే అవకాశం లేకుండా పోతోంది. నియమబద్ధమైన జీవితం వల్ల ఎలాంటి రోగాలు లేవు. కానీ వయోభారం వల్ల మతిమరుపు వచ్చింది. ప్రస్తుతం నా పని నేను చేసుకోగలను. – శ్యామమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు
Comments
Please login to add a commentAdd a comment