నవరత్నాలతో నవోదయం | Shankar Narayana Independence Day Speech In Anantapur | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో నవోదయం

Published Fri, Aug 16 2019 8:45 AM | Last Updated on Fri, Aug 16 2019 9:03 AM

Shankar Narayana Independence Day Speech In Anantapur - Sakshi

స్వాతంత్య్ర దినోత్సవంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ

సాక్షి, అనంతపురం : ‘‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందించాలనే నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మనమంతా తోడుగా నిలుద్దాం.’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జిల్లా మంత్రి హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ శిరస్సు వంచి ప్రణామం చేద్దామన్నారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు అన్నివిధాల అండగా ఉంటుందని, ఆత్మహత్య చేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు, ఏఎస్పీ చౌడేశ్వరిదేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నదీం అహ్మద్, మహాలక్ష్మి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అక్టోబర్‌ 15 నుంచి  వైఎస్సార్‌ రైతు భరోసా 
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అక్టోబర్‌ 15వ తేదీ నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ.3,750 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 అందిస్తామన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి పెట్టబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ.. ఈ రబీ సీజన్‌ నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ జిల్లాలో ప్రారంభమైందన్నారు. 

బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది 
ఫసల్, వాతావరణ బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి శంకరనారాయణ వెల్లడించారు. జిల్లాలోని 5,61,219 మంది రైతులకు సంబంధించి 10.25 శాతం బీమా ప్రీమియంలో 6.25 శాతం బీమా ప్రీమియం మొత్తం రూ.222 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన 4 శాతం ప్రీమియం రూ.149 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా కింద రూ.7 లక్షలు పరిహారం చెల్లించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు.

వైఎస్సార్‌ వడ్డీలేని రుణాలతో  రైతులకు లబ్ధి 
ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి పంట రుణాల లక్ష్యం రూ.7,070 కోట్లు కాగా... జిల్లాలో ఇప్పటివరకు రూ.5,372 కోట్ల రుణాలు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. రాయితీ వడ్డీ కింద కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రూ.161 కోట్లు, మిగిలిన 4 శాతం వడ్డీలేని రుణాల కింద రూ.215 కోట్లను ప్రభుత్వమే రైతుల తరఫున బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మొత్తం 16 రిగ్‌లోను అందుబాటులో ఉంచి నీటి లభ్యత ఆధారంగా అవసరమైన రైతులకు ఉచితంగా బోర్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.937 కోట్లు, రబీకి సంబంధించి రూ.46 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ధర లేక పప్పుశనగను గోదాముల్లో నిల్వ ఉంచిన 3,622 మంది జిల్లా రైతులకు రూ,43 కోట్లను మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధి కింద ప్రభుతమే చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో అధికంగా సాగ య్యే వేరుశనగ పంటకు క్వింటాలుకు రూ.5,090, కందికి రూ.5,800, పత్తికి రూ.5,255 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఉద్యాన పంటల అభివృద్ధే లక్ష్యం 
జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నూతన పండ్ల తోటల విస్తరణ, గ్రీన్‌హౌస్‌లు, షెడ్‌నెట్‌లు, ఉద్యాన యాంత్రీకరణ, తదితర ప్రోత్సాహకాలకు ఈ ఏడాది రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈ ఏడాది రూ.241 కోట్లతో 32 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.35 కోట్ల ఖర్చుతో 5,243 హెక్టార్లలో డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎన్‌సీడీసీ రుణాల ద్వారా 557 గొర్రెల యూనిట్లు మంజూరు చేశామనీ, రూ.32 కోట్లతో 2,048 గొర్రెలు, మేకల షెడ్లు, రూ.24.49 కోట్లతో 1,465 మినీ పశు వసతి గృహాలు, రూ.8 కోట్లతో 38 సామాజిక పశు వసతి గృహాలు నిర్మిస్తామన్నారు. పాడిపరిశ్రమ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జనవరి 26 నుంచి ‘జగనన్న అమ్మఒడి’ 
‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5,80,494 మంది విద్యార్థులు చదువుతున్నారనీ, వీరిలో 5,43,064 మంది తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్నారన్నారు. అలాగే జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని అమలు చేస్తామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభిస్తామన్నారు. అలాగే పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మౌలిక వసతుల కల్పన, బోధనా ప్రమాణాలు పెంచడం, ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడం, తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం తదితర చర్యల ద్వారా విద్యాభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. ఈ ఏడాది జూన్‌నెలలో రాజన్న బడిబాట కార్యక్రమం కింద 18,781 మంది బడీడు పిల్లలను బడిలో చేర్పించామన్నారు.

గాంధీ జయంతి నుంచి గ్రామస్వరాజ్యం 
మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమమైందని మంత్రి శంకరనారాయణ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ నుంచి పట్టణాలు, గ్రామాల్లో వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాందీ పలకుతున్నామన్నారు.

అర్హులందరికీ ఇళ్లు 
పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి వెల్లడించారు. ఉగాది పండుగ రోజున పేదలకు ఇళ్ల స్థలాలను చూపిస్తామన్నారు. మహిళల పేరు మీద పట్టాలు పంపిణీ చేసేందుకు తగిన భూమిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. గతంలో అసంపూర్తిగా ఉన్న 76,600 ఇళ్ల  నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.2,011.67 కోట్లు కేటాయించామన్నారు.

రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ 
ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం కల్పిస్తూ మరింత విస్తరిస్తామని మంత్రి శంకరనారాయణ తెలిపారు. వైద్యం అందక ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మండలంలో 104, 108 వాహనాలు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రజా పంపిణీలో వినూత్న మార్పులు 
ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన మేలురకపు బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోల ప్యాకెట్ల రూపంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల 12,23,978 మంది కార్డుదారులకు లబ్ధి కలుగుతుందన్నారు.

ఉద్యోగుల వేతనం పెంపు 
గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రీసోర్స్‌ పర్సన్, యానిమేటర్లకు నెలకు రూ.10 వేలు, అంగన్‌వాడీ  కార్యకర్తల వేతనాన్ని రూ.11,500, ఆయా జీతం రూ.7 వేలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచామన్నారు. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతం రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. హోంగార్డుల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300లకు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చామన్నారు.

సంక్షేమ వసతిగృహాలో మౌలిక వసతులు 
జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. మొదటి విడతగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, గురుకుల వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.6.32 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 206 ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు ఒక అడాప్షన్‌ అధికారి నియమించి వాటిలోని 28,938 మంది విద్యార్థులకు మంచి వసతులు, విద్యాబోధన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నామన్నారు. జిల్లాలో 90 వేలు మంది బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థులు, 43 వేల మంది ఎస్సీ విద్యార్థులు, 4,592 మంది ఎస్టీ విద్యార్థులు, 14,436 మంది మైనార్టీ విద్యార్థులకు ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేస్తామన్నారు.

‘స్పందన’కు అధిక ప్రాధాన్యం 
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి శంకరనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 37,230 అర్జీలు రాగా, అందులో 34,991 అర్జీలకు(93.98శాతం) పరిష్కారం చూపించామన్నారు. నాణ్యమైన పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. స్పందనతో పాటు రెవెన్యూ సమస్యలపై ప్రతి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ జేసీ’, ప్రతి శనివారం ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కలెక్టర్‌ను అభినందిస్తున్నామన్నారు.  

కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం 
కరువు సీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో ‘హంద్రీ–నీవా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. జిల్లాలో 3,45,800 ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకూ ఆయకట్టుకు నీరివ్వలేదన్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ పనులను చేపట్టి లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నీరిందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.458.42 కోట్లతో తుంగభద్ర కాలువ వెడల్పు పనులు, రూ.1,389 కోట్లతో యాడికి కాలువ, గుంతకల్లు బ్రాంచ్‌ కాలువ, మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువ, ధర్మవరం బ్రాంచ్‌ కాలువ, చాగల్లు బ్యారేజి కాలువ, జాజికొండ వాడు కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ, హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం విడుదలవుతున్న నీటితో జిల్లాలోని జలాశయాలు, చెరువులు నింపేందుకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేస్తోందన్నారు.

పింఛన్‌ కానుక పెంచుకుంటూ పోతాం 
జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్‌ పెంపు హామీ ఇచ్చిన తర్వాతే పింఛన్‌ రూ.2 వేలు పెరిగిందనీ,  దాన్ని కూడా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.2,250కు పెంచిందని మంత్రి వివరించారు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3 వేల పింఛన్‌ అందిస్తామన్నారు. 40 శాతంపైన వికలత్వం ఉన్న దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తున్నామన్నారు. కిడ్నీ బాధితులకు పింఛను మొత్తాన్ని నెలకు రూ.10 వేలకు పెంచామన్నారు. జూలై 2019 నుంచి ప్రతి నెలా 4,90,692 మందికి రూ.119.60 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు.

డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు 
డ్వాక్రా మహిళళకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు విరివిరిగా రుణాలు ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. అలాగే అక్కచెల్లమ్మల తరఫున బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 62,317 సంఘాలకు రూ.1,368.51 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 7,586 సంఘాలకు రూ.193 కోట్లు రుణాలు అందించామన్నారు. జిల్లాలో ఆగస్టు 2016 నుంచి జూన్‌ 2019 వరకు వడ్డీలేని రుణాల కింద రూ.265.80 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడ్డీలేని రుణాల కింద డ్వాక్రా మహిళలకు రూ.1,140 కోట్లు, పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.648 కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించామన్నారు. అలాగే  అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఆసరా అమలు చేస్తామన్నారు. ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికి అందిస్తామని మేనిఫేస్టోలో చెప్పామని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2019, ఏప్రిల్‌ 11 నాటికి 67,790 సంఘాలకు రూ.1,884.51 కోట్లు అప్పు ఉంది. ఇప్పటివరకు 61,376 సంఘాలకు రూ.1,793.38 కోట్ల రుణాలకు సంబంధించి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement