tharman shanmugaratnam
-
మరో ఘనత.. సింగపూర్ అధ్యక్ష పీఠంపై భారతీయుడు
సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు. Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam [📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE — Bryan Toh (@bryan__toh) September 15, 2023 -
సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం
సింగపూర్: భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తద్వారా సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్‌గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి. -
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు
సింగపూర్: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 66 ఏళ్ల వయసున్న షణ్ముగరత్నం చైనా సంతతికి చెందిన కాక్ సాంగ్, తన్ కిన్ లియాన్‌తో పోటీ పడతారు. మొత్తం ఆరుగురు నుంచి దరఖాస్తులు రాగా వీరు ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అర్హత సాధించారని ఎన్నికల కమిటీ ప్రకటించింది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారు. సెప్టెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. -
భారత్‌కు అతిపెద్ద సవాలు అదే!
న్యూఢిల్లీ : ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి భారత్ తక్షణమే కార్మిక సంస్కరణలు చేపట్టాల్సి ఉందని సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి థర్మాన్ షణ్ముగరత్నం అన్నారు. దీంతో జనాభా సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ''భారత్ అతిపెద్ద సవాలు ఉద్యోగ సృష్టి. మున్ముందు కూడా ఇదే అసలైన ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పటికే భారత్ చాలా సమయాన్ని కోల్పోయింది'' అని ఆయన ఢిల్లీ ఎకనామిక్స్ కంక్లేవ్‌లో చెప్పారు. ఒకవేళ కార్మిక సంస్కరణలను వెంటనే చేపట్టకపోతే, వచ్చే కొన్నేళ్లలో దేశం అసలైన సమస్యను ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు. నైపుణ్యవంతులైన ఉద్యోగులు తగ్గిపోతుడటంతో, చట్టసభ్యులు వెంటనే మేల్కొని వీటిపై ఏదైనా చర్యలు తీసుకోవాలని లేదా రానున్న కాలంలో జనాభా డివిడెండ్, జనాభా సంక్షోభమవుతుందని షణ్ముగరత్నం తెలిపారు. మూలధన పెట్టుబడులను ప్రోత్సహించడం, వాటిని నైపుణ్యవంతులను తయారుచేయడంలో పెట్టుబడులుగా పెట్టడంతో బ్యాలెన్సింగ్‌ను రూపొందించవచ్చని పేర్కొన్నారు. మంచి ఆర్థిక వ్యవస్థకు రాజకీయ మద్దతు కల్పించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవాలని, భారత సంప్రదాయాల్లో చాలా మార్పులు వచ్చాయని అవి ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. అవినీతిని భారత్ నిర్మూలిస్తుందని, జీఎస్టీ కేవలం ఆర్థిక లేదా రాజకీయ దృక్పథమే కాదని, ఇది ఎంతో మెచ్చుకోదగినదని కొనియాడారు. ఇటీవల కాలంలో మంచి ఆర్థికవ్యవస్థకు భారత్ కల్పిస్తున్న రాజకీయ మద్దతు పాఠంలా ఉందని షణ్ముగరత్నం అభివర్ణించారు. -
'సంక్షోభంలో పాఠశాలలు'
న్యూఢిల్లీ: భారత్‌లో పాఠశాలలు సంక్షోభంలో చిక్కుకున్నాయని సింగపూర్ ఉప ప్రధాని తర్మన్ షణ్ముగరత్నం అన్నారు. శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమం ‘ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’లో ఆయన తొలి ప్రసంగం చేశారు. పిల్లలు తొందరగా స్కూలుకెళ్లడం ప్రారంభించడం ఉపయోగకరమని అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. ఐసీడీఎస్, అంగన్వాడీ రూపంలో భారత్‌లో రెండు మంచి పథకాలున్నాయని కొనియాడారు. గ్రామ స్థాయిలో తల్లి, పిల్లలకు తదుపరి స్కూలుకు చేరువయ్యేందుకు చేపట్టే సత్వర చర్యలు కీలకం అవుతాయని పేర్కొన్నారు. ‘ భారత్‌లో స్కూళ్లు సంక్షోభంలో ఉన్నాయి. ఈ సమస్య ఈనాటిది కాదు. భారత్, తూర్పు ఆసియా దేశాలకు మధ్యనున్న ప్రధాన అంతరం పాఠశాలల నిర్వహణే. ఈ లోపాలు ఎంతమాత్రం సమర్థనీయం కావు. అప్పర్ ప్రైమరీ విద్య పూర్తికాక ముందే 43 శాతం మంది స్కూలును వదిలేస్తున్నారు. 7 లక్షల ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కేవలం 53 శాతం పాఠశాలల్లోనే బాలికలకు మరుగుదొడ్లున్నాయి. 74 శాతం వాటికే తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంది’ అని తన వద్దనున్న దత్తాంశాన్ని చదివి వినిపించారు. 2009లో ఓఈసీడీ పీసా 74 దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్ 73వ స్థానంలో నిలిచిన సంగతిని గుర్తుచేశారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను నడుపుతున్న ప్రతిభావంతులున్న దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. భారత్‌లో నైపుణ్యాల్లో భారీ అంతరాలున్నాయని చెప్పారు. అగ్రభాగాన అధిక ప్రతిభావంతులు ఉన్నారని, సమాజంలోని మిగతా వర్గాల్లో అరకొర శక్తిసామర్థ్యాలున్నాయని అన్నారు. బడ్జెట్ పెంపుతో ఈ సమస్యలను పరిష్కరించలేమని, నిర్వహణ, పని సంస్కృతితోనే ఇది సాధ్యమవుతుందని సూచించారు. ప్రపంచంలో దేశాలన్నీ గ్రాడ్యుయేట్లను అవసరానికి మించి తయారుచేస్తున్నాయని, వారికి బాహ్య ప్రపంచ సంబంధ నైపుణ్యాలు, పరిజ్ఞానం కొరవడుతున్నాయని షణ్ముగరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత్ కు అపార శక్తిసామర్థ్యాలు..!
• సింగపూర్ డిప్యూటీ ప్రధాని షణ్ముగరత్నం • అయితే అవి మరింత పరిపుష్టి కావాలని వ్యాఖ్య • 8 నుంచి 10% వృద్ధి సాధించాలి • తలసరి ఆదాయ వ్యత్యాసాలు తొలగాలని సూచన న్యూఢిల్లీ: భారత్‌కు అపార శక్తిసామర్థ్యాలు ఉన్నట్లు సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి తార్మాన్ షణ్ముగరత్నం పేర్కొన్నారు. అయితే ఈ శక్తిసామర్థ్యాలను ఇంకా పూర్తిగా వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరగాలని సూచించారు. ఈ దిశలో 20 సంవత్సరాలపాటు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలని అన్నారు. తద్వారానే తలసరి ఆదాయానికి సంబంధించి చైనా వంటి దేశాలతో వ్యత్యాసాన్ని తగ్గించుకునే వీలుందని అన్నారు. ఇందుకు సంస్కరణల బాటలో మరింత ముందుకు సాగాల్సి ఉంటుందని సూచించారు. ‘ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై ఆయన నీతి ఆయోగ్ సదస్సు తొలి ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే... ⇔ భారత్ 8 నుంచి 10 శాతం వృద్ధి శాతం సాధించేయడం ఒక ‘విలాసవంతమైన’ అంశం ఏదీ కాదు. అలాంటి శ్రేణి వృద్ధి రేటును వరుసగా 20 ఏళ్లు సాధిస్తేనే కనీసం చైనా తలసరి ఆదాయంలో భారత్ తలసరి ఆదాయం 70 శాతానికి చేరుతుంది. చైనా తలసరి ఆదాయంకన్నా రెండున్నర రెట్లు తక్కువగా భారత్ తలసరి ఆదాయం ఉంది. అయితే తగిన ప్రణాళికల ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు ఇందులో కీలకమైనవి. ⇔ ’పూర్తిగా వెలికిరాని’ శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలైజేషన్ గుర్తింపు ఇన్ఫ్రా... ‘ఆధార్’ ఇందులో ఒకటి. ⇔ భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగడానికి తగిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ⇔ ఫోర్బ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ 100 కంపెనీల్లో హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, సన్ ఫార్మా వంటి సంస్థలు ఉన్నాయి. సన్‌ఫార్మా 70 శాతం ఆదాయం భారత్ యేతర దేశాల నుంచే వస్తోంది. ఇక్కడ చెప్పేదేమిటంటే... ప్రపంచదేశాలతో పోటీపడి పనిచేయగలిగే కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అయితే ఈ సంస్కృతి మరింత విస్తృతం కావాలి. ⇔ ఆసియాలో ఆర్థిక వ్యవస్థ సమన్వయ సహకారం మరింత మెరుగుపడాలి. దేశాల మధ్య అత్యున్నత స్థాయి ఆర్థిక సంబంధాలు వృద్ధి బాటలో కీలకం. భవిష్యత్ ప్రపంచ వృద్ధిలో ఆసియా పాత్ర కీలకం. దీనిని ఆసియా దేశాలు వృద్ధికి ఒక అవకాశంగా మలచుకోవాలి.