భారత్ కు అపార శక్తిసామర్థ్యాలు..!
• సింగపూర్ డిప్యూటీ ప్రధాని షణ్ముగరత్నం
• అయితే అవి మరింత పరిపుష్టి కావాలని వ్యాఖ్య
• 8 నుంచి 10% వృద్ధి సాధించాలి
• తలసరి ఆదాయ వ్యత్యాసాలు తొలగాలని సూచన
న్యూఢిల్లీ: భారత్‌కు అపార శక్తిసామర్థ్యాలు ఉన్నట్లు సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి తార్మాన్ షణ్ముగరత్నం పేర్కొన్నారు. అయితే ఈ శక్తిసామర్థ్యాలను ఇంకా పూర్తిగా వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరగాలని సూచించారు. ఈ దిశలో 20 సంవత్సరాలపాటు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలని అన్నారు. తద్వారానే తలసరి ఆదాయానికి సంబంధించి చైనా వంటి దేశాలతో వ్యత్యాసాన్ని తగ్గించుకునే వీలుందని అన్నారు. ఇందుకు సంస్కరణల బాటలో మరింత ముందుకు సాగాల్సి ఉంటుందని సూచించారు. ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై ఆయన నీతి ఆయోగ్ సదస్సు తొలి ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే...
⇔ భారత్ 8 నుంచి 10 శాతం వృద్ధి శాతం సాధించేయడం ఒక ‘విలాసవంతమైన’ అంశం ఏదీ కాదు. అలాంటి శ్రేణి వృద్ధి రేటును వరుసగా 20 ఏళ్లు సాధిస్తేనే కనీసం చైనా తలసరి ఆదాయంలో భారత్ తలసరి ఆదాయం 70 శాతానికి చేరుతుంది. చైనా తలసరి ఆదాయంకన్నా రెండున్నర రెట్లు తక్కువగా భారత్ తలసరి ఆదాయం ఉంది. అయితే తగిన ప్రణాళికల ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు ఇందులో కీలకమైనవి.
⇔ ’పూర్తిగా వెలికిరాని’ శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలైజేషన్ గుర్తింపు ఇన్‌ఫ్రా... ‘ఆధార్’ ఇందులో ఒకటి.
⇔ భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగడానికి తగిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి.
⇔ ఫోర్బ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ 100 కంపెనీల్లో హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, సన్ ఫార్మా వంటి సంస్థలు ఉన్నాయి. సన్‌ఫార్మా 70 శాతం ఆదాయం భారత్ యేతర దేశాల నుంచే వస్తోంది. ఇక్కడ చెప్పేదేమిటంటే... ప్రపంచదేశాలతో పోటీపడి పనిచేయగలిగే కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అయితే ఈ సంస్కృతి మరింత విస్తృతం కావాలి.
⇔ ఆసియాలో ఆర్థిక వ్యవస్థ సమన్వయ సహకారం మరింత మెరుగుపడాలి. దేశాల మధ్య అత్యున్నత స్థాయి ఆర్థిక సంబంధాలు వృద్ధి బాటలో కీలకం. భవిష్యత్ ప్రపంచ వృద్ధిలో ఆసియా పాత్ర కీలకం. దీనిని ఆసియా దేశాలు వృద్ధికి ఒక అవకాశంగా మలచుకోవాలి.