thermal units
-
అప్పుడే.. ఇక్కట్లు
నల్లగొండటుటౌన్/మిర్యాలగూడ, న్యూస్‌లైన్: వేసవికాలం సమీపించకముందే జిల్లాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులలో పుష్కలంగా నీళ్లున్నా.. థర్మల్ యూనిట్లలో అంతరాయం ఏర్పడడంతో గృహ విద్యుత్‌కు కోతలు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే అనధికారికంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దీనికి తోడు లోడ్ రిలీఫ్ పేరుతో మరికొంత సమయం కట్ చేస్తున్నారు. తాజాగా కోతలను ట్రాన్స్‌కో అధికారికంగా ప్రకటించి షెడ్యూల్ విడుదల చేసింది. నల్లగొండ సర్కిల్ పరిధిలో 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతుండగా, వినియోగం మాత్రం 13మిలియన్ యూనిట్ల నుంచి 14 మిలియన్ యూనిట్ల వరకే ఉంది. అయినా గ్రామస్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ కోతను అమలు చేయాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే, ట్రాన్స్‌కో అధికారులు మాత్రం అధికారిక సమయంతో పాటు అనధికారికంగా మరో రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. అన్నదాతకూ కరెంట్ షాక్ రబీసాగుకు వరినార్లు పోసుకునే సమయంలో వ్యవసాయానికి విద్యుత్ కోత విధించడంతో అన్నదాతలకు షాక్ తగిలింది. గృహ వినియోగంతో పాటు వ్యవసాయానికి కూడా రోజుకు రెండుగంటల పాటు కోత విధించేందుకు ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంది. ఖరీఫ్ పంటలు కోతకు రావడంతో నీటి వాడకం తగ్గింది. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. అయినా, వ్యవసాయానికి విద్యుత్ కోత విధించాలని నిర్ణయించడంతో రైతులకు ఇబ్బందిగా మారిం ది. చలికాలంలోనే ఇలా ఉంటే.. వేసవిలో పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రోజుకు రెండుగంటల కోత : పీబీ. కరుణాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ థర్మల్ యూనిట్లలో ఏర్పడిన అంతరాయం వల్ల రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నాం. కోత విధించాలని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు అందాయి. వాటిని అమలు చేస్తున్నాం. అయితే, వ్యవసాయానికి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -
మళ్లీ కరెంట్ కోతలు
=నేటినుంచి అమలు =విజయవాడలో 2, బందరులో 3 గంటలు =మున్సిపాలిటీల్లో 4, మండల కేంద్రాల్లో 6 గంటలు విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైడల్ పవర్ జనరేషన్‌కు కావాల్సిన నీటి కొరత కారణంగా రాష్ట్రంలో అనేక థర్మల్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతల వేళల షెడ్యూల్‌ను రివైజ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ విద్యుత్ కోతల సమయాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 8 వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు, ఇతర మున్సిపాలిటీలలో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, తిరిగి 12 గంటల నుంచి 2 వరకు కరెంట్ ఉండదని వివరించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.