నల్లగొండటుటౌన్/మిర్యాలగూడ, న్యూస్‌లైన్: వేసవికాలం సమీపించకముందే జిల్లాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులలో పుష్కలంగా నీళ్లున్నా.. థర్మల్ యూనిట్లలో అంతరాయం ఏర్పడడంతో గృహ విద్యుత్‌కు కోతలు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే అనధికారికంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దీనికి తోడు లోడ్ రిలీఫ్ పేరుతో మరికొంత సమయం కట్ చేస్తున్నారు. తాజాగా కోతలను ట్రాన్స్‌కో అధికారికంగా ప్రకటించి షెడ్యూల్ విడుదల చేసింది.
నల్లగొండ సర్కిల్ పరిధిలో 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతుండగా, వినియోగం మాత్రం 13మిలియన్ యూనిట్ల నుంచి 14 మిలియన్ యూనిట్ల వరకే ఉంది. అయినా గ్రామస్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ కోతను అమలు చేయాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే, ట్రాన్స్‌కో అధికారులు మాత్రం అధికారిక సమయంతో పాటు అనధికారికంగా మరో రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది.
అన్నదాతకూ కరెంట్ షాక్
రబీసాగుకు వరినార్లు పోసుకునే సమయంలో వ్యవసాయానికి విద్యుత్ కోత విధించడంతో అన్నదాతలకు షాక్ తగిలింది. గృహ వినియోగంతో పాటు వ్యవసాయానికి కూడా రోజుకు రెండుగంటల పాటు కోత విధించేందుకు ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంది. ఖరీఫ్ పంటలు కోతకు రావడంతో నీటి వాడకం తగ్గింది. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. అయినా, వ్యవసాయానికి విద్యుత్ కోత విధించాలని నిర్ణయించడంతో రైతులకు ఇబ్బందిగా మారిం ది. చలికాలంలోనే ఇలా ఉంటే.. వేసవిలో పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రోజుకు రెండుగంటల కోత :
పీబీ. కరుణాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
థర్మల్ యూనిట్లలో ఏర్పడిన అంతరాయం వల్ల రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నాం. కోత విధించాలని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు అందాయి. వాటిని అమలు చేస్తున్నాం. అయితే, వ్యవసాయానికి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
అప్పుడే.. ఇక్కట్‌లు
Published Fri, Dec 20 2013 4:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement