అంతా ‘కోతే’!
నల్లగొండ టుటౌన్ : కరెంట్ కోతలు నేతన్నల కడుపు మాడుస్తున్నాయి. పొద్దస్తమానం కష్టపడితేనే జీవనం గడిచే కార్మికుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే నేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాకపోగా, విద్యుత్ కోతలతో పవర్‌లూమ్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చం దంగా కరెంట్ కోతకు ఇటు కార్మికులు, అటు పరిశ్రమల యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూలి గిట్టుబాటుకాక నేతన్నలు అర్ధాకలితో అల మటించాల్సిన దుస్థితి నెలకొంది.
కోతలతో మూతలు..
జిల్లాలో 9వేల పవర్‌లూమ్‌లు ఉన్నాయి. చర్లపల్లి, నకిరేకల్, వల్లాల, మర్రూర్, తొండ్లాయి, నెమ్మాని, నేరడ, బ్రాహ్మణవెల్లెంల, కొయ్యలగూడెం, సిరిపురం, రామన్నపేట, అయిటిపాముల, మునుగోడు, పుట్టపాక, పోచంపల్లి, బుద్దారం, నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో పవర్‌లూమ్స్ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటిద్వారా సుమారు 65వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 5వేల మంది యజమానులు, 60వేల మందిరోజువారీ కార్మికులు. గ్రామాల్లో 12 గంటలు, మండల కేంద్రాలు 8 గంటలు, మున్సిపాలిటీలలో 6 గంటలపాటు అధికారికంగా కరెంటు కోతలు విధిస్తున్నారు.
కార్మికుల కన్నీటి గాథ...
కార్మికులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మర మగ్గాలపై పనిచేస్తారు. 12 గంటలపాటు కరెంటు సరఫరా అయితే ఒక్కో కార్మికుడు సుమారు 20 నుంచి 22 వస్త్రాలు తయారు చేస్తాడు. ఒక్కో వస్త్రానికి రూ.11 చొప్పున యాజమాన్యాలు చెల్లిస్తాయి. ఇలా సుమారుగా ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.230 గిట్టుతుంది. నెలకు చూసుకుంటే రూ.6900 కష్టార్జితం వస్తుంది. జిల్లాలో ఉన్న కార్మికుల సంఖ్య 60 వేలు. ఇందులో మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కలిపి 45 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే మండల కేంద్రాల్లో రోజుకు 8 గంటల చొప్పున కరెంటు కోత విధిస్తున్నారు. ఈ లెక్కన 45 వేల మంది కార్మికుల కూలి సగానికి పడిపోయింది. అంటే ఒక్కో కార్మికుడు రోజుకు కనీసం 100 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి.
గ్రామాల్లో ఘోరం..
పల్లెల్లో రోజుకు 12 గంటలపాటు విద్యుత్ కోత పెడుతున్నారు. దీంతో దాదాపు 1000 పవర్‌లూమ్స్ పనినిలిచిపోయింది. వీటిపై ఉపాధి పొందుతున్న 15వేల మంది కార్మికులకు పని కరువైంది. కుటుంబం గడవక వీధినపడే పరి స్థితి దాపురించింది. 12 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తే రోజుకు వీళ్లూ రూ.230 సంపాదిం చేవారు. కరెంటు సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో రోజు గడవడం ఇబ్బందిగా మారింది.
యజమానులదీ దిక్కుతోచని స్థితి...
జిల్లాలో 9వేల పవర్‌లూమ్స్‌లు ఉండగా వీటిని 5వేల మంది యజమానులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం, మున్సిపాలీటీలు, మండల కేంద్రాల్లో 8వేల పవర్‌లూమ్స్ ఉన్నాయి. రోజుకు 12 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తే ఒక్కో పవర్‌లూమ్ ద్వారా రోజుకు 30 మీటర్ల వస్త్రం తయారవుతుంది. మొత్తం పవర్‌లూమ్‌ల ద్వారా రోజుకు 2.40 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తవుతుంది. కానీ ఈ ప్రాంతాల్లో ఆరు గ ంటలపాటు కోత విధిస్తుండడంతో ఉత్పత్తి సగానికి తగ్గింది. గ్రామాల్లో 12 గంటలపాటు కోతపెడుతుండడంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కరెంట్ కోతలు ఎత్తి వేసేది ఎప్పుడో.. తమకు కడుపు నిండేది ఎప్పుడో.. అని కార్మికులు ఎదురుచూస్తున్నారు.
పవర్‌లూమ్స్‌లకు కరెంట్ కోతలు మినహాయించాలి
కరెంట్ కోతలతో పవర్‌లూమ్స్ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొం టోంది. మేము అతి తక్కువ పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతుంటే కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కోతల నుంచి పవర్‌లూమ్ పరిశ్రమను మినహాయించాలి.
- గుర్రం వెంకన్న, పవర్‌లూమ్ యజమాని, నల్లగొండ