నీలగిరి : తెలంగాణ రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ కోతలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర పున ర్విభజన బిల్లు ప్రకారం అన్ని అంశాలను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు విభజిస్తే..కరెంట్ మాత్రం జనాభా ప్రాతిపదికన విభజన చేశారని గుర్తుచేశారు. ఈ లెక్కన విద్యుత్‌లో తెలంగాణకు 54శాతం, ఏపీకి 46 శాతం కేటాయింపులు చేశారన్నారు. మిగులు విద్యుత్‌ను ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సి ఉందని తెలిపారు. కానీ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా మొండికేస్తున్నారన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే బస్సుయాత్ర మానుకుని విద్యుత్ వాటాపై అధినేతతో పోరాటం చేయాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రోజుకు 2 వేల నుంచి 2500 మెగావాట్ల విద్యుత్ వాడకం జరుగుతోందని...దీంట్లో సగం వాటా ఏపీ ప్రభుత్వ భరించాల్సి ఉందన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఈ మేరకు విద్యుత్ కోటాలో సగం ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించాల్సిందనేని తెలిపారు. ఈ విషయాలపై తెలంగాణ మంత్రులకు అవగాహనలేక కాంగ్రెస్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆహార భద్రత కార్డులు, ఫించన్లు ఇచ్చేందుకు కొత్త దరఖాస్తులు అవసరం లేదని..సమగ్ర సర్వే డేటా ప్రకారం కొత్తవాటిని మంజూరు చేయవచ్చనని గుత్తా తెలిపారు. సమావేశంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ కోతలకు కారణం చంద్రబాబే
Published Wed, Oct 15 2014 2:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement