నల్లగొండ అగ్రికల్చర్ : తీవ్ర వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా పంటల ఎండి పెట్టుబడులు చేతికి వస్తాయో రావో అన్న బెంగతో ఇటీవల జిల్లాలో పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాంటి రైతు కుటుంబాలకు చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో వాస్తవంగా అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారి జాబితాను తయారు చేసి పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి డివిజన్ల వారీగా త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ నుంచి ఆర్డీఓ, వ్యవసాయ శాఖ నుంచి ఏడీఏ, పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా మండలాల వారీగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల జాబితాలను తెప్పించుకుని వాస్తవ పరిస్థితులను తెలుకుంటున్నారు.
పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్‌ఐఆర్, స్థానిక పంచనామాలతోపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేసి జాబితాను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2010 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పడే నాటికి 29 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇప్పటివరకు సుమారు 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు లెక్కలు తీస్తే ఆత్మహత్యలకు పాల్పడిన జాబితాలో సుమారు 20మంది కూడా ఉండే అవకాశం లేదు. అయితే కరువుకాటకాల వల్ల రైతులు పంటలు చేతికి రాక ఆవేదనగురై మరణాలు సంభవిస్తున్నాయని, అందుకు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టంతో సంబంధం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలందరికీ ఆర్థికసాయం అందించాలని పలురైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న రైతుల గుర్తింపునకు కసరత్తు
Published Sun, Nov 2 2014 4:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement