నల్లగొండ అర్బన్ : గత పాలకులు ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు చేసిన ద్రోహం ఫలితంగానే నేడు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యుత్ ఇంజినీర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివాజీ విమర్శించారు. స్థానిక లయన్స్‌క్లబ్ భవన్‌లో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విద్యుత్ సంక్షోభం - కారణాలు - పరిష్కారాలు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణను పట్టించుకోకుండా మొత్తం సీమాంధ్రలోనే విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేశారన్నారు. నెల్లూరులోని కృష్ణపట్నం, సీలేరు, వీటీపీఎస్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వడం లేదన్నారు. సీమాంధ్రలో 3 వేల గ్యాస్ ప్లాంట్లు ఉన్నా ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల విద్యుత్ ప్లాంట్లను వారు స్వాధీనం చేసుకుని ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం ఇరురాష్ట్రాలకు కావాల్సిన విద్యుత్‌ను పంపిణీ చేయాలన్నారు. జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు హయాం నుంచే తెలంగాణలో విద్యుత్ కొరత మొదలై రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రలోని పవర్‌ప్లాంట్లన్నీ తెలంగాణ నిధులతో నిర్మించినవేనన్నారు. న్యాయబద్ధంగా 20 సంవత్సరాలు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వాల్సిందేనన్నారు. టీవీవీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంబటి నాగయ్య, డి.కిషన్‌ప్రసాద్, పందుల సైదులు, విజయ్‌కుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో వెంకులు, నాగయ్య, హరికృష్ణ, జవహర్‌లాల్, సోమయ్య, సుభాని, భీమార్జున్‌రెడ్డి, శ్రీనివాస్, డి.కిరణ్, పి.గిరి, రవి పాల్గొన్నారు.
గత పాలకుల ద్రోహం వల్లే విద్యుత్ సంక్షోభం
Published Mon, Oct 20 2014 1:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement