ఆ డ్రాపవుట్ రచనలతో ఐదు పీహెచ్ డీలు
న్యూ ఢిల్లీః అతడు కేవలం పాఠశాల చదువుకూడ పూర్తి చేయలేదు. అయితేనేం రచయితగా అత్యంత ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఒడిషాకు చెందిన ఆయన రచనలు ఐదుగురు పరిశోధనా విద్యార్థులకు ఆధారంగా మారాయి. కోస్లీ భాషా పండితుడు, కవి, 66 ఏళ్ళ హల్దార్ నాగ్ ఎన్నో పురాణాలకు గుర్తుగా పద్యాలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రచనలు ప్రస్తుతం సంబల్పూర్ విశ్వవిద్యాలయ సిలబస్ లో భాగమయ్యాయి. హల్దార్ గ్రంథబాలి-2 పేరున విశ్వవిద్యాలయం వాటిని సంగ్రహించింది.
హల్దార్ తన రచనలను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటాడు. తాను వల్లించిన పద్యాలను వల్లెవేస్తుంటాడు. కనీసం రోజుకు మూడు నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరౌతుంటాడు అంటూ అతడి సన్నిహితుడు, కవి నాగ్ చెప్తున్నారు. హల్దార్ రచించిన కోస్టీ భాషలోని పద్యాలు యువకులను అమితంగా ఆకట్టుకుంటాయని, ప్రతివారు కవులు అయినప్పటికీ.. కొందరు మాత్రమే వాటికి ఓ ప్రత్యేక రూపును ఇవ్వగల్గుతారని అదే వారిలోని కళను ప్రస్ఫుటింప జేస్తుందని హల్దార్ సన్నిహితుడు నాగ్ చెప్తున్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడ ధరించని హల్దార్... ఎప్పుడూ తెల్లని పంచె, చొక్కా వేసుకుంటాడని, పైగా అలా వేసుకోవడం తనకిష్టమని చెప్తాడు.
ఒరిస్సాలోని బర్ఘర్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1950 లో పుట్టిన హర్దార్... కేవలం మూడో క్లాసు వరకే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతడు బడికి హాజరు కాలేదు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంభ భారాన్ని నెత్తికెత్తుకున్న అతడు... తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి దుకాణంలో పనికి (డిష్ వాషర్) చేరాడు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామపెద్ద అక్కడో హైస్కూలు స్థాపించాడు. అదే గ్రామంలో హల్దార్ పదహారేళ్ళపాటు వంటవాడిగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ అనేక పాఠశాలలు వెలిశాయి. దీంతో హల్దార్ ఓ బ్యాంకును సంప్రదించి వెయ్యి రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న స్టేషనరీ షాప్ తో పాటు పాఠశాల విద్యార్థులకోసం తినుబండారాల అమ్మకం ప్రారంభించాడు. ఇదే సమయంలో హల్దార్ 'దోడో బర్గాచ్' (పురాతన మర్రిచెట్టు) అంటూ తన మొదటి పద్యాన్ని రాశాడు. 1990 ప్రాంతంలో అతడు రాసిన ఆ పద్యం స్థానిక పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పద్యాలు రాసి పంపితే అవి కూడ అచ్చయ్యాయి. అనంతరం అతడి పద్యాలకు సమీప గ్రామాల్లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడే అతడి ప్రస్థానం మొదలైంది. ఆ ప్రోత్సాహం నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేర్చింది.
హల్దార్ నాగ్ ను ఒడిస్పాలో లోక్ కబీ రత్నగా పిలుస్తారు. ఎక్కువగా ప్రకృతి, సమాజం, పురాణాలు, మతం వంటివే అతడి పద్యాలకు ప్రధానాంశాలు. అయితే ఎన్నోసార్లు అతడి రచనలకు సమాజం నుంచి వ్యతిరేకత కూడ ఎదురైంది. నా దృష్టిలో కవిత్వం వాస్తవ జీవితానికి అద్దం పడుతుందని, ప్రజలకు సందేశాన్ని అందించేదిగా ఉండాలని హల్దార్ నాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.