సినిమాలు చేయనా..? పెళ్లి చేసుకోనా..?
మోర్నింగ్ హైదరాబాద్... ఆఫ్టర్నూన్ చెన్నై... ఈవినింగ్ ముంబై... శ్రుతీహాసన్ షెడ్యూలు ఇంత బిజీగా... టైట్‌గా ఉంటుంది. ఈ గజీబిజీని కూడా శ్రుతి ఆస్వాదిస్తున్నారు.
‘‘పనిలో పడితే నాకు ప్రపంచమే తెలీదు. సేమ్ టూ సేమ్ మా నాన్నలాగే. తిండీ నిద్రా ఇవన్నీ మర్చిపోతాను’’ అని చెబుతారామె. నిజమే... ఇంత బిజీలో కూడా శ్రుతి ఒత్తిడి ఫీలవ్వడంలేదు. హాయిగా నవ్వుతూ నవ్విస్తూ మూడు షూటింగులు... ఆరు ట్రావెలింగులూ అన్నట్టుగా అటు హిందీ, ఇటు తెలుగు, మరోపక్క తమిళ చిత్రసీమల్లో స్టార్డమ్ చవిచూస్తున్నారు. హిందీ ‘తేవర్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన శ్రుతి ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
హిందీ చిత్రం ‘తేవర్’లో రెండు పాటలు పాడి, వాటిలో ఓ పాటకే డాన్స్ చేశారు... కారణం ?
ముందు ఈ చిత్రం కోసం నాతో ‘జోగానియాన్..’ పాటను మాత్రమే పాడించాలనుకున్నారు. పాడాను. దానికి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఒక రోజు ఈ చిత్ర కథానాయకుడు అర్జున్‌కపూర్ ఫోన్ చేసి, ‘ఇందులో మరో పాట ఉంది. అది కూడా మీరు పాడితే బాగుంటుంది. దానికి మీరే డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది’ అన్నారు. దాంతో ‘మాడ్మియా’ పాటకు మాత్రమే డాన్స్ చేశాను.
అర్జున్ కపూర్ అడిగారనే చేశారా..?
అది ఒక కారణం మాత్రమే. ‘మాడ్మియా..’ ట్యూన్ నాకు బాగా నచ్చింది. బాగా డాన్స్ చేయాలనే ఆసక్తి ఉన్నవారిని సంతృప్తిపరిచే పాట ఇది. ఇప్పటివరకు నేను హిందీలో చేసిన చిత్రాలు, చేస్తున్న ‘వెల్కమ్ బ్యాక్’, ‘యారా’, ‘గబ్బర్’లో కూడా ఇలా జోష్‌గా ఉన్న పాట లేదు. పైగా ఇది ఐటమ్ సాంగ్ కాదు. ప్రత్యేక పాట. అందుకే చేశాను.
హిందీ రంగంలో ఒక కథానాయికకు మరో కథానాయిక పాట పాడిన సందర్భాలు లేవట. ఆ ఘనత మీకే దక్కినట్టుంది..!
అవునా? నాకీ విషయం తెలియదు. అయినా ఇలా వేరే హీరోయిన్‌కి పాట పాడటం నాకు కొత్తేమీ కాదు. సమీరారెడ్డి, హన్సిక.. ఇంకా చాలామందికి పాటలు పాడాను. చిన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైందే ప్లేబ్యాక్ సింగర్‌గా. నా పాత్రకు మాత్రమే కాదు, ఇతరులకు పాడుతున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
మహేశ్‌బాబు తాజా చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది కాబట్టే, ‘ఆగడు’లో ఆయనతో ఐటమ్ సాంగ్ చేశారనుకోవచ్చా?
అవును.. నిజమే! అయితే ఆ పాట కూడా నచ్చింది కాబట్టి, వెంటనే ఒప్పుకున్నా. ‘జంక్షన్’.. పాటను నేను చాలా ఎంజాయ్ చేశాను. మహేశ్‌తో చేస్తున్న తాజా సినిమాలో ఇలాంటి పాట లేదు.
మహేశ్ సరసన నటించడం ఎలా ఉంది?
మహేశ్ చాలా డౌన్ టు ఎర్త్. ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ ఆ స్టార్‌డమ్‌ని అస్సలు ప్రదర్శించరు. పని విషయంలో చాలా సిన్సియర్.
ఆ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నాది స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్ర. బాగా చదువుకున్న అమ్మాయిని. నార్మల్ గాళ్‌గా కనిపిస్తాను. ఈ పాత్ర అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
ఈ పాత్ర మీ నిజజీవితానికి దగ్గరగా ఉంటుందేమో?
అవును. స్వేచ్ఛని ఇష్టపడే అమ్మాయిని నేను. మా అమ్మా, నాన్న మాకు బాగా స్వేచ్ఛ ఇస్తారు. దాన్ని దుర్వినియోగం చేయకుండా నేను, నా చెల్లెలు అక్షర జాగ్రత్తపడతాం.
స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువైతే ప్రమాదం. ముఖ్యంగా స్వేచ్ఛ అంటూ మీరు ముంబయ్‌లో ఒక్కరే ఉంటున్నారు. అది తెలుసుకుని ఆ మధ్య ఓ ఆకతాయి మీ ఇంట్లోకి చొరబడ్డాడు కదా?
అది మన దురదృష్టమో ఏమో కానీ.. భారతదేశంలో ఉద్యోగం చేసే ఆడవాళ్లకీ, ఇంటిపట్టున ఉన్నవాళ్లకీ... ఎవరికీ రక్షణ లేదు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెళ్లే మాట అటుంచితే, కొన్ని చోట్ల పట్టపగలే తిరగలేని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే, పిరికిగా ఉండకూడదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ఈ దేశంలో రక్షణ లేదంటున్నారు.. విదేశాల్లో స్థిరపడాలని ఎప్పుడైనా అనిపించిందా?
లేదు. వాస్తవానికి నాకు అమెరికా ఇష్టం. నేనక్కడే చదువుకున్నాను. అమెరికా ఎంత నచ్చినా నాకు మన భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలంటే చాలా ఇష్టం.
ఇద్దరు నాయికలున్న చిత్రాల్లో కూడా నటిస్తున్నారు... ఇంకో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కొంతమంది హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు కదా!
నాకలాంటి సమస్య లేదండి. రెండున్నర గంటల సినిమాని ఒక్కదాన్నే ఏలాలనే అత్యాశ అంతకన్నా లేదు. ఎంతమంది కథానాయికలున్నా నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి... అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ మధ్య నేను చేసిన హిందీ చిత్రం ‘డి-డే’ని తీసుకుందాం. అందులో నా పాత్ర నిడివి తక్కువ. కానీ, ప్రేక్షకులను ఆ పాత్ర చాలా ప్రభావితం చేసింది. మీ కెరీర్లో ‘ది బెస్ట్’ అనదగ్గ పాత్రల్లో ఇదొకటి అని నాతో చాలామంది అన్నారు. సోలో హీరోయిన్గా సాదాసీదా పాత్రలో రెండున్నర గంటలు కనిపించడం కన్నా.. మల్టీస్టారర్‌లో రెండే నిమిషాలు నిడివి ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తాను.
ఈ ఏడాది తెలుగులో మూడు సినిమాల్లో కనిపించారు.. కానీ, వచ్చే ఏడాది ఇక్కడ తక్కువ కనిపిస్తారేమో?
ఈ ఏడాది ఎక్కువగా కనిపించాను కదండీ.. ఇతర భాషల్లోనూ కనిపించాలి కదా. ఈ ఏడాది తెలుగులో నేను చేసినవన్నీ మంచి పాత్రలే. ఇప్పుడు హిందీ, తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టి, అంగీకరించాను.
హిందీ చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’లో నానా పటేకర్, నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియా వంటి సీనియర్ తారలున్నారు.. వాళ్లతో సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది?
ఎప్పుడైనా సరే సీనియర్ తారలతో సినిమా చేసినప్పుడు షూటింగ్ జరిగినన్ని రోజులూ మంచి మంచి పాఠాలు నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. వాళ్ల అనుభవాలను పంచుకుంటారు. అలాగే, లొకేషన్లో వాళ్లు యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూస్తాం కాబట్టి, నటనలో కొన్ని టిప్స్ తెలుస్తుంటాయి. డింపుల్ మేడమ్‌తో నాకు మంచి అనుబంధం కుదిరింది. ఆమె చాలా సరదాగా ఉంటారు.
తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్) హిందీ రీమేక్ ‘గబ్బర్’లో నటిస్తున్నారు కదా... ఆ చిత్రం గురించి?
తెలుగు దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీకి అనుగుణంగా ఈ కథను చాలా అద్భుతంగా మలిచారు. ఇందులో అక్షయ్‌కుమార్ సరసన నటిస్తున్నాను. అక్షయ్ చాలా మంచి వ్యక్తి. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కాబట్టి, హిందీలో కూడా ఈ చిత్రం ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది.
తమిళ చిత్రం ‘విజయ్ 58’ గురించి?
అది భారీ చిత్రం. ఆ చిత్రవిశేషాలేవీ చెప్పలేను. కాకపోతే, ఆ చిత్రంలో నటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నాది అద్భుతమైన పాత్ర.
ఒకేసారి ఆరేడు సినిమాలు చేస్తున్నారు... ఎలా మేనేజ్ చేస్తున్నారు?
చేతినిండా పని లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇంత బిజీగా ఉండటం నాకిష్టం. ఈ మధ్య హైదరాబాద్‌లో పది రోజులు, చెన్నయ్‌లో పది రోజులు, ముంబయ్‌లో కొన్ని రోజులు.. విదేశాల్లో కొన్ని రోజులు... ఇలా ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తున్నాను. కొన్ని రోజులు తెలుగు షూటింగ్, ఆ తర్వాత హిందీ, తమిళ్.. ఇలా మూడు రకాల భాషలు మాట్లాడుతుంటే నా జీవితం భలే మజాగా ఉంది. కాకపోతే.. ప్రయాణాల కారణంగా సూట్‌కేస్ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే, వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడింత చల్లగా ఉంది కదా.. చెన్నయ్‌లో వేరే రకంగా ఉంది. ఈ మార్పుల వల్ల జలుబు, దగ్గు పట్టుకున్నాయి.
మరి.. ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అంతకుముందు మాంసాహారం తినేదాన్ని. గత ఆరు నెలలుగా శాకాహారమే తీసుకుంటున్నాను. అలాగని నాన్‌వెజ్ చేటు అని కాదు... శాకాహారమే బెటర్ అనిపించింది.
అంటే.. పూర్తిగా నాన్‌వెజ్ మానేసినట్టేనా?
లేదు లేదు.. మళ్లీ ఎప్పుడో మొదలుపెడతా.
ఓకే.. ఇలా బిజీ బిజీగా సినిమాలు చేయడమేనా.. పెళ్లి గురించేమైనా ఆలోచిస్తున్నారా?
ఆలోచించడంలేదు. ఇంకా చాలా రోజుల వరకూ అది జరగదు.
ఎందుకలా?
సినిమాలు చేయమంటారా? పెళ్లి చేసుకోమంటారా? నా డైరీ తీసి సినిమాలకు నేను కేటాయించిన డేట్స్ చూస్తే, ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశమే లేదన్న విషయం మీకు తెలుస్తుంది.
ప్రస్తుతం మా కుటుంబంలో నలుగురు నటీనటులం ఉన్నాం. అమ్మ, నాన్న, నేను, చెల్లి (అక్షర). నన్ను అమ్మా, నాన్నలతో పోల్చడం సరికాదు. అలాగే, అక్షరకన్నా ముందు నేను నటినయ్యాను కాబట్టి, నాతో తనను పోల్చడం సరికాదు. ఎవరి శైలి వారికుంటుంది. అక్షర తొలి హిందీ చిత్రం ‘షమితాబ్’ విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.