మూడో విడత పోలింగ్ రేపు
సాక్షి, అమరావతి: మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో 579 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క చోట సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 2,640 సర్పంచి పదవులకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోట మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది. ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 11,732 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 177 వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 19,607 వార్డుల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డులకు 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బుధవారమే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
చివరి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు
చివరి విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్న 3,229 గ్రామ పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3,229 గ్రామ సర్పంచి పదవులకు 18,016 మంది, 33,429 వార్డులకు 86,064 మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గతేడాది మార్చి 9న నోటిఫికేషన్.. 15న నిలిపివేత
రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో, 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా 75 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిశాక కరోనా పేరుతో అదే నెల 15న ఆ ఎన్నికలను అర్ధంతరంగా నిమ్మగడ్డ నిలిపివేశారు. కాగా ఆగిపోయిన చోట నుంచే ఆ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, వచ్చే నెల 2 నుంచి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.