వలలో సొర చేప.. జాలర్లకు అరుదైన ఘనత
తీరువనంతపురం: కేరళకు చెందిన మత్స్యకారులు తమ వలకు చిక్కిన సొరచేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేగాక అంతరించిపోతున్న సొరచేప పట్ల బాధ్యయుతంగా వ్యవహరించిన వారందరూ అటవీ శాఖ నుంచి అరుదైన ఆవార్డును అందుకోనున్నారు. తిరువనంతపురంలోని షాంఘుముఖం బీచ్ సమీపంలో శుక్రవారం వేటకు వెళ్లిన మత్సకారులకు అంతరించిపోతున్న అరుదైన జాతి సొరచేప చిక్కింది. అయితే ఆ సోరచాప సజీవంగా ఉండటంతో మత్స్యకారులు దాన్ని తిరిగి సముద్రంలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే దానిని సముద్రంలో విడిచిపెట్టారు. అయితే ఇదంతా తన ఫోన్లో రికార్డు చేసిన అజీత్ అనే స్థానిక వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అంతరించిపోతున్న తిమింగలం జాతిని కాపాడేందుకు బాధ్యయుతంగా వ్యవహరించిన మత్స్యకారులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఆ ప్రిన్సిపల్ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు!)
అయితే దీనిపై మత్స్యకారులు మాట్లాడుతూ.. ‘వాతావరణ అధికారులు సలహా మేరకు మేమంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. దీంతో తీరం నుంచే చేపలు పట్టే పనిలో పడ్డాం. ఈ క్రమంలో షాంఘుముఖం తీరం ఒడ్డున మా వలలో ఓ పెద్ద సొరచేప చిక్కింది. ఇక అందరం వలను బయటకు లాగి చేపను బయటకు తీశాం. అయితే ఇలాంటి సొరచేపను మేము ఎప్పుడు చూడలేదు. ఇది అంతరించి పోతున్న అరుదైన జాతి సొరచేపగా గుర్తించాం. ఇక అది ప్రాణాలతో ఉండటంతో తిరిగి సముద్రంలోకి వదిలాం’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇవి సముద్రంలో మధ్యలో ఉంటాయని, ఇటీవల కురిసిన వర్షాలకు, వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా ఇది తీరానికి వచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో వన్యప్రాణి పట్ల బాధ్యయుతంగా వ్యవహరించిన సదరు మత్స్యకారుల తీరు ప్రశంసనీయమని, వారందరిని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆవార్డుతో సత్కరించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. (చదవండి: దినసరి కూలీకి భారీ షాక్.. చివరికి..)