'ఇక నా ఆలోచనలు, ప్రార్థనలు నీకోసమే ఫ్రెండ్'
న్యూయార్క్: హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఉగ్రవాదుల దాడిలో తన మిత్రుడి మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తన టీంలో అతడితో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అలాంటి స్నేహితుడిని కోల్పోవడం చెప్పలేని లోటు అంటూ ట్వీట్ చేశాడు. ఫ్రాన్స్ లోని బెటక్లాన్ థియేటర్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరపగా వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చనిపోయినవారిలో బీబర్ స్నేహితుడు థామస్ అయ్యద్ కూడా ఉన్నాడు.
'ఎన్నో ప్రశంసలు అందుకున్నావు. కానీ దూరమయ్యావు. ఈ సందర్భంగా నేనొకటి భావిస్తున్నాను. కొంతమందిని మనం కలిగి ఉన్నప్పుడు వారిపట్ల ప్రశంసా దోరణితో ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు. 'ప్యారిస్ దాడి గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా మిత్రుడి విషాదం గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా నా టీంలో కలిసి ఉన్నాడు. అతడికి ఇప్పటికే ఎన్నో సార్లు ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. కానీ, అవకాశం లేకుండా పోయింది. అందుకే మనతో ఉన్నవారికి అప్పుడప్పుడు ధన్యవాదాలు చెప్పాలి. ప్రశంసించాలి. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పటికీ నీతోనే ఉంటాయి థామస్' అంటూ బీబర్ ట్వీట్ చేశాడు.