మోదీకి ప్రాణహాని?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు హెచ్చరికలు జారీ చేశాయి. వచ్చే నెల స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చచ్చనే బలమైన సమాచారంతో ఈ విషయాన్ని భద్రతా అధికారులు దోవల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడే సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం.
ప్రమాద సూచికలు బలంగా ఉండటం వల్ల ప్రధాని కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించాలని భద్రతా అధికారులు కోరారు. ప్రధానిమంత్రిగా పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. కేవలం కశ్మీర్ కల్లోలం, బోర్డర్లలో చొరబాటుదారులు పెరుగుతుండటమే కాకుండా ప్రధానిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ మేరకు ఎస్పీజీ, యాంటీ టెర్రర్ యూనిట్లను కొద్దివారల క్రితం అలర్ట్ చేసినట్లు చెప్పారు. ఆగష్టు 15న వరుసదాడులు లేదా ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఆల్-ఖైదా, ఐసిస్ లు ఆర్మీ, పోలీసుల చెక్ పోస్టులపై దృష్టిపెట్టాయని, ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారని ఆయన చెప్పారు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ద్వారా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆనవాయితీగా మారింది. 2014లో ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసిన మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా ప్రసంగం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సెక్యూరిటీ ఏజెన్సీలు ప్లాన్-బీని అమలు చేశాయి.
ఎర్రకోటలోని నలువైపుల నుంచి స్పాటర్స్ ను అంచెలంచెలుగా ఉంచి ప్రధానికి భద్రతను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు డ్రిల్స్ నిర్వహించిన భద్రతా దళాలు ప్రధానిని ఏ షార్ట్, లాంగ్ రేంజ్ వెపన్ లకు చేరువ కాకుండా ఉండేలా నిర్దిష్ట ప్రదేశాల్లో స్పాటర్స్, కమాండోలను ఉంచనున్నారు. ప్రధానికి దగ్గరలో ఉంటూ భద్రత కల్పించే కార్డన్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఐసిస్, ఆల్-ఖైదా, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మొహమ్మద్ లే కాకుండా హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్-ఉల్-జిహాదీ-ఇస్లామీలు మోదీని టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా స్పీచ్ ఇవ్వడం, ఎలైట్ ఎస్పీజీ, ఇంటిలిజెన్స్ బ్యూరో, సెక్యూరిటీ ఏజెన్సీలను ఒకింత కలవరపాటుకు గురిచేసింది. దీని తర్వాత కోటకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నభవనాల్లో కమాండోలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. గత ఏడాది దాదాపు 5000 మంది ఎస్పీజీ, ఐబీ, పారామిలటరీ, ఢిల్లీ పోలీసులు, డ్రోన్లు ఎర్రకోటకు రక్షక కవచంగా ఉన్నాయని సమాచారం.