Three D printing
-
కణజాలాల ముద్రణకు మార్గం సుగమం...
వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుందిగానీ.. యుటా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు శరీర కణజాలాన్ని త్రీడీ పద్ధతిలో ముద్రించేందుకు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ప్రమాదవశాత్తూ లేదా జబ్బుల కారణంగా దెబ్బతినే కణజాలం, లిగమెంట్, టెండాన్ల స్థానంలో త్రీడీ పద్ధతిలో ముద్రించిన భాగాలను వాడుకోవచ్చునని అంచనా. రోగి శరీరం నుంచి మూలకణాలను సేకరించడం.. వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన త్రీడీప్రింటర్ ద్వారా హైడ్రోజెల్పై టెండాన్ లేదా లిగమెంట్ ఆకారంలో పలుచటి పొరగా ఏర్పాటు చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. ఆ తరువాత కణాలు ఎదిగేందుకు తగిన పోషకాలను అందిస్తే చాలని.. సహజసిద్ధమైన శరీరభాగాలు రెడీ అవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ ఏడ్. వినేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా.. ఈ ప్రక్రియ సంక్లిష్టమైందని.. వేర్వేరు కణాలను సంక్లిష్టమైన ప్యాటర్న్లలో ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని అంటున్నారు డేవిడ్. నియాన్ బల్బుల మాదిరిగా వెలుగులు చిమ్మే జన్యుమార్పిడి కణాలను వాడటం ద్వారా తాము ఈ పద్ధతిని పరీక్షించి చూశామని తెలిపారు. ప్రస్తుతం ఎవరి కణజాలాన్ని అయినా మార్చాలంటే శరీరంలోని ఇతర భాగాల నుంచి సేకరించడం లేదంటే మత శరీరాల నుంచి సేకరించడం మాత్రమే మార్గం. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పద్ధతి ప్రాధాన్యం సంతరించుకుంది. -
అమెరికా ఇళ్లు... కేవలం 2.6 లక్షలు
అమెరికా : అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా మందికి సొంత గృహాలు ఉండవు. అలాంటి వారికోసం అతి తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా కేవలం 24 గంటల్లోనే అందమైన ఇంటిని నిర్మించడానికి టెక్సాస్ రాజధాని ఆస్టిన్ నగరంలో గల ఐకాన్ అనే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. న్యూస్టోరీ అనే మరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేయనుంది. ఈ ఇళ్లను అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం త్రీడి ప్రింటింగ్‌తో నిర్మించనున్నారు. ఐకాన్-న్యూస్టోరీ భాగస్వామ్యంలో ఒక సర్వే నిర్వహించింది. అందులో 1.2 బిలియన్ మంది జనాభాకు గృహ సదుపాయం లేదన్న విషయం తేలింది. దాంతో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని ఐకాన్ సంస్థ నిర్ణయించుకుంది. టెక్సాస్ నగరంలో జరుగుతున్న ఎస్ఎక్స్ ఎస్‌డబ్య్లూ ఫెస్టివల్లో వీరు నిర్మించిన ఇంటి నమునాను ప్రదర్శించారు. కేవలం రూ.2.6 లక్షలతోనే ఈ 3డీ ప్రింటెడ్ ఇళ్లు నిర్మిస్తామని, వాటికి సంబంధించి అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఐకాన్ సంస్థ తెలిపింది. తక్కువ నీరు, పవర్‌ను వాడి ఇళ్లు నిర్మిస్తామని సంస్థ తెలిపింది. ఇతర కాలనీ వాసులతో కూడా సంప్రదించి ఇందులో ఉండాల్సిన సౌకర్యాల గురించి సలహాలు స్వీకరిస్తున్నట్టు, భద్రత, పటిష్టత, పునర్ధురణ వంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కూడా సంస్థ పేర్కొంది. అయితే 2014లో కూడా ఇలాంటి త్రీడి టెక్నాలజీతో 24 గంటల్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. కాకపోతే దాని నిర్మాణ వ్యయం ఎక్కువ. -
అట్టును అచ్చొత్తేస్తుంది...
అట్టును అచ్చొత్తడమేంటనుకుంటున్నారా..? నిజంగా ఇది నిజం. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చిత్ర విచిత్ర విలక్షణ వంటింటి పరికరం అట్టునే కాదు, రొట్టెను కూడా అచ్చంగా అచ్చొత్తేస్తుంది. మనం కోరుకునే అట్టుకైనా, రొట్టెకైనా పిండిని మాత్రం మనమే మకూర్చుకోవాలనుకోండి. ఎంతైనా ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత ఉండనే ఉంది కదా! ఈ పరికరం పైభాగాన ఉన్న గొట్టంలో సమపాళ్లలో కలుపుకున్న పిండిని దట్టించాలి. ఆ తర్వాత దీనికి పని చెప్పాలి. అదెలాగంటారా? ఇది కంప్యూటర్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. మనం కోరుకున్న చిత్రాన్ని కంప్యూటర్లో ఎంచుకుని, ఆ సమాచారాన్ని దీనికి చేరవేస్తే చాలు. నిమిషాల్లోనే మనం కోరుకున్న చిత్రం ఆకారంతో అట్టును అచ్చొత్తేస్తుంది. ఈఫిల్ టవర్ ఆకారంలో అచ్చొత్తుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఎంపిక చేసుకున్న ఫొటోలే కాదు, మనం గీసిన బొమ్మలను స్కాన్‌చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, వాటి ఆకారాలతో కూడా ఈ పరికరం సాయంతో రొట్టె, అట్టాదులను అచ్చొత్తేసుకుని ఇంచక్కా ఆరగించవచ్చు. దీనిపేరు ‘పాన్కేక్బో’. త్రీడీ ప్రింటింగ్ రోబోటిక్స్ పరిజ్ఞానంతో పనిచేస్తుంది ఇది. కోరుకున్న పాన్కేక్లకు రంగులు అద్దాలనుకునే వారు ఇందులో పిండితో పాటు ఫుడ్ కలర్స్‌ను కూడా చేర్చుకుంటే సరిపోతుంది. -
ముంగిట్లో త్రీడీ ప్రింటింగ్ విప్లవం!
టెక్నాలజీ రంగంలో కొత్తకొత్త ఆవిష్కరణలకు కొదవ లేదు. కానీ ఈ అనేకానేక టెక్నాలజీల్లో కొన్ని చరిత్రగతిని మార్చేస్తూంటాయి. 150 ఏళ్ల క్రితంనాటి డీజిల్ ఇంజిన్... 1970లలోని తొలి పర్సనల్ కంప్యూటర్.. ఇటీవలి కాలంలో అరచేతిలో ఇమిడిపోతున్న ‘స్మార్ట్‌ఫోన్’... టెక్నాలజీ అద్భుతాలకు తార్కాణాలు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇప్పుడు మనం మరో అత్యద్భుతమైన టెక్నాలజీ విప్లవం ముంగిట్లో ఉన్నాం. వైద్యం మొదలుకొని తయారీ రంగం వరకూ అనేక రంగాలను ప్రభావితం చేస్తున్న ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం పేరు... త్రీడీ ప్రింటింగ్! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ గురంచి 20 ఏళ్లుగా అప్పుడప్పుడూ వింటూనే ఉన్నా ఈ టెక్నాలజీ సృష్టించగల అద్భుతాల గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచం గమనిస్తోంది. అందుకేనేమో దీన్ని మరో పారిశ్రామిక విప్లవంగా కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇదేమిటో.. దీనితో తయారు చేస్తున్న అద్భుతాలేమిటో చూసేద్దామా...? త్రీడీ ప్రింటింగ్ అంటే... మామూలు ప్రింటర్లు కాగితాలపై అక్షరాలను ముద్రిస్తే... త్రీడీ ప్రింటర్లు ప్లాస్టిక్ వంటి పదార్థాలతో పొరలు పొరలుగా పేరుస్తూ వస్తువులను తయారు చేస్తాయి. ఉదాహరణకు... ప్రత్యేకమైన స్కానర్ ద్వారా మీరో కాఫీకప్పును స్కాన్ చేశారనుకుందాం. ఆ వివరాలను కంప్యూటర్ క్యాడ్ ఫైల్‌గా మార్చి త్రీడీ ప్రింటర్‌కు అందిస్తుంది. ఆ వెంటనే ప్రింటర్ ద్వారా అదేరకమైన కాఫీ కప్పును మీరు తయారు చేసుకోవచ్చు. ఏమేం కావాలి? త్రీడీ ప్రింటింగ్‌కు ప్రధానంగా కావాల్సినవి త్రీడీ ప్రింటర్, ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్, స్కానర్, ప్లాస్టిక్ లాంటి పదార్థాలతో తయారు చేసిన ఫిలమెంట్ లేదా ఇతర పదార్థాలు అవసరమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఖరీదు చేసే రకరకాల త్రీడీ ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. గుండీల నుంచి గుండెల దాకా...! త్రీడీ ప్రింటింగ్ కొన్ని అపురూపమైన వస్తువులను తయారు చేసుకునేందుకు మాత్రమే పనికొస్తుందని ఒకప్పుడు అనుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాక్లెట్లు, క్యాండీల వంటి ఆహార పదార్థాలను రకరకాల ఆకారాల్లో తయారు చేసుకోవడం మొదలుకొని... సుదూర గ్రహాలపై మానవ ఆవాసాలను నిర్మించేందుకు ఉన్న అవకాశాల వరకూ అన్నింటిలోనూ త్రీడీ ప్రింటింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో త్రీడీ సిస్టమ్స్ కంపెనీ ప్రసిద్ధ చాక్లెట్ తయారీ సంస్థ హెర్ష్లీతో జట్టుకట్టి త్రీడీ చాక్లెట్లను తయారు చేయడం మొదలుపెట్టింది. మరోవైపు హాలెండ్లోని ఓ డాక్టర్ల బృందం మనిషి పుర్రెలో కొంత భాగానికి ప్రత్యామ్నాయాన్ని ఈ పద్ధతిలో ప్రింట్ చేసి వాడింది. అంతేకాదు... శరీరంలోని ఎముకలు, కీళ్లను కూడా కృత్రిమంగా తయారు చేసేందుకు త్రీడీ ప్రింటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. త్రీడీ ప్రింటింగ్ విసృ్తత వాడకంలోకి వస్తోంది అనేందుకు మరికొన్ని ఉదాహరణలు.. - అమెండా బాక్స్టెల్ అనే స్కీయింగ్ క్రీడాకారిణి 1992లో ఓ ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె శరీరంలోని దిగువభాగం మొత్తం చచ్చుబడిపోయింది. త్రీడీ ప్రింటింగ్ పుణ్యమా అని ప్రస్తుతం బాక్స్టెల్ మళ్లీ నడవగలుగుతోంది. త్రీడీ సిస్టమ్స్, ఎక్సో బయోనిక్స్ హోల్డింగ్ కంపెనీలు సంయుక్తంగా బాక్స్టెల్ కోసం ఓ ప్రత్యేకమైన ఎక్సోస్కెలిటన్‌ను తయారు చేయడంతో ఇది సాధ్యమైంది. - స్వీడన్ కంపెనీ ఆర్ఏయూజీ ఉపగ్రహాల్లో ఉపయోగించే పరికరాలను త్రీడీ ప్రింటర్ల సాయంతో ముద్రిస్తోంది. - సుదూర గ్రహాలకు ప్రయాణించే వ్యోమగాముల కోసం పిజ్జా ప్రింటర్ తయారీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలే సిస్టమ్స్ అండ్ మెటీరియల్ సెన్సైస్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. - పాతకాలపు యంత్రాల్లోని విడిభాగాలు మార్కెట్లో దొరకడం లేదా? ఏం ఫర్వాలేదు. త్రీడీ ప్రింటర్ల సాయంతో వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. - కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ తన తాజా మోడల్ ముస్టాంగ్‌లో అనేక విడిభాగాలను త్రీడీ ప్రింటింగ్ సాయంతో సమకూర్చుకుంది. అంతేకాదు.. విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ కూడా ఇదే బాట పట్టింది. భవిష్యత్తు ఏమిటి? 2018 నాటికి త్రీడీ ప్రింటింగ్ మార్కెట్ విలువ దాదాపు 18 బిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందని నిపుణుల అంచనా. అదే సమయంలో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది బయో ప్రింటింగ్గా రూపాంతరం చెందుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అప్పుడు శరీర అవయవాలను కూడా పరిశోధనశాలల్లో ప్రింట్ చేసుకుని వాడవచ్చునని అంచనా. ప్లాస్టిక్ లాంటి పదార్థాలకు బదులుగా జీవకణాలను కృత్రిమ పద్ధతుల్లో పెంచి ప్రత్యేకమైన ప్రింటర్లు ఉపయోగించడం ద్వారా అవయవాలను ఉత్పత్తి చేయడం సాధ్యమేనని వీరు అంటున్నారు. ఇప్పటికే కణజాలంతోపాటు కొంతమేరకు రక్తనాళాలను కూడా త్రీడీ ప్రింటింగ్ సాయంతో తయారు చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో గుండెపోటు ద్వారా దెబ్బతినే కణజాలానికి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయవచ్చునని అంచనా.