'అలిపిరి’ ఘటన కేసులో ముగ్గురికి శిక్ష
నాలుగు సంవత్సరాలు జైలు, రూ.700 జరిమానా
2003 అక్టోబర్ 1న చంద్రబాబు కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి
సాక్షి, తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్ ఒకటిన జరిగిన బాంబుదాడి కేసులో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు తిరుపతికి చెందిన జి.రామ్మోహన్‌రెడ్డి అలియాస్ తేజ, వైఎస్సార్‌జిల్లా వెంకటరెడ్డిగారి పల్లెకు చెందిన సడిపిరాళ్ల నరసింహారెడ్డి అలియాస్ రాజశేఖర్, చిత్తూరు జిల్లా దిగువ అంకమవారి పల్లెకు చెందిన ఎం.చంద్ర అలియాస్ కేశవ్ అలియాస్ వెంకటరమణకు నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తిరుపతి అదనపు సహాయక సెషన్స్ కోర్టు జడ్జి ఒ.వెంకటనాగేశ్వరరావు తీర్పు చెప్పారు.
కుట్ర, హత్యాయత్నం, దాడి, పేలుడు పదార్థాల దుర్వినియోగం నేరారోపణలతో ఐపీసీ సెక్షన్ 307, 326, 324, 120(బి) మారణాయుధాల చట్టం 4, 6 సెక్షన్ల కింద 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీటీ నాయక్ నేతృత్వంలో డీఎస్పీ ఎస్ఎం వలీ ప్రత్యేక బృందంగా (సిట్) ఏర్పడి కేసును దర్యాప్తు చేశారు. తిరుపతి కోర్టులో 2004లో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 96 మంది సాక్షులను చూపగా 76 మందిని కోర్టు విచారించింది. 131 పత్రాలను, 146 వస్తువులను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో చంద్రబాబునూ 14వ సాక్షిగా కోర్టు విచారించింది.