Tiangong-2
-
‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాన్ని డ్రాగన్ దేశం చైనా చేస్తోంది. గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా? అసలు అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్’ పేరిట స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్‌లోని వెంటియన్ మాడ్యుల్‌లోకి కోతులను పంపించనున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్ మాడ్యుల్లో ప్రస్తుతం ఆల్గే, చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ, అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్‌ను డిజైన్ చేశారు. స్పేస్ స్టేషన్లోకి కోతులను పంపించగానే సరిపోదు, వాటికి ఆహారం అందజేయడం, ఆరోగ్యాన్ని కాపాడడం, వాటి వ్యర్థాలను నిర్వీర్యం చేయడం పెద్ద సవాలేనని చెప్పొచ్చు. -
చైనా అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు
బీజింగ్: చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగస్వాములను చేసేందుకు మరో ముగ్గురు వ్యోమగాములను ఆదివారం నింగిలోకి పంపనుంది. తియాంగాంగ్ స్పేష్ స్టేషన్‌కు వ్యోమగాములు చెన్ డాంగ్, లీయాంగ్, కాయ్ క్సుజీలను షెంజూ–14 వ్యోమనౌక ద్వారా నింగిలోకి పంపుతున్నట్లు చైనా మానవసహిత స్పేస్ ఏజెన్సీ(సీఎంఎస్ఏ) శనివారం పేర్కొంది. గన్సులోని జిక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా రెండు ల్యాబ్ మాడ్యుల్స్ వెంటియాన్, మెంగ్టియాన్లను నింగిలోకి పంపుతారు. అక్కడికి వీటిని తీసుకెళ్లాక వాటిలో డజనుకుపైగా శాస్త్రీయ ప్రయోగ క్యాబినెట్లను అమర్చుతారు. వచ్చే ఆరు నెలలపాటు వారు చైనా స్పేస్‌స్టేషన్(సీఎస్ఎస్)లోనే గడుపుతారు. ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లగా ఏప్రిల్‌లో ఒక మహిళా వ్యోమగామి తిరిగి భూమిని చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా వెళ్లిన ఆ ముగ్గురు అక్కడ కీలక స్పేస్ టెక్నాలజీల పనితీరును పునఃపరీక్షించారు. రష్యా సాయంతో నిర్మితమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) భవిష్యత్‌లో నిర్వీర్యమైతే చైనా స్పేస్ స్టేషన్(సీఎస్ఎస్) ఒక్కటే మానవనిర్మిత కేంద్రంగా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది మొత్తంగా సీఎస్ఎస్కు 140 ఉపకరణాలు పంపేందుకు 50 అంతరిక్ష ప్రయోగాలు చైనా చేపట్టనుంది. -
అంతరిక్షంలో చైనా పాగా: చరిత్రాత్మక ప్రయోగం
-
అంతరిక్షంలో చైనా పాగా: చరిత్రాత్మక ప్రయోగం
బీజింగ్: సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. గోబీ ఎడారిలోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం మానవ సహిత షెంజో-1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షనౌకను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా జింగ్ హైపింగ్(50), చెండ్ డాంగ్(37) అనే ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ వాహక రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశించే ఈ ఇద్దరు వ్యోమగాములు..24 గంటల తర్వాత చైనా సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-2కు చేరుకుంటారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రంలో 30 రోజులు ఉండనున్న జింగ్, డాంగ్ లు రకరకాల ప్రయోగాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ద్వారా చైనా.. మానవసహిత అంతరిక్ష పరిశోధన చేపట్టిన మూడో దేశంగా నిలిచింది. ఇంతకు ముందు ఆ జాబితాలో అమెరికా, రష్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మనుగడ ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మరో ఏడేళ్లలో.. అంటే 2024 నాటికి రిటైర్ కానుంది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్, 11 దేశాల యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్మించిన ఐఎస్ఎస్ కు దీటుగా కొత్త కేంద్రాన్ని నిర్మించాలనుకున్న చైనా.. 2011లో తియాంగాగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత నెలలో(సెప్టెంబర్ 15న) తియాంగాగ్- 2 కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది. సోమవారం నాటి ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తియాంగ్-2కు చేరుకుంటారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించే ఈ ప్రయోగశాలలో సాగు,ప్రాథమిక చికిత్స, ఇతర ప్రయోగాలు చేపట్టనున్నారు. 2022 నాటికి (కనీసం 10 ఏళ్లు పనిచేయగల) పూర్తిస్థాయిలో పనిచేసే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి మార్స్, మూన్ లకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం భారత్ కు వచ్చిన చైనై అధ్యక్షుడు జిన్ పింగ్ స్పేస్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. తమ దేశం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దీనికొక మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎం సీ) ముఖ్య అధికారి చాంగ్ లాంగ్ అధ్యక్షుడి సందేశాన్ని చదివి వినిపించారు. ఇద్దరు వ్యోమగాముల్లో జింగ్ హైపింగ్ కు ఇప్పటికే పలుమార్లు అంతరిక్షయానం చేసిన అనుభవం ఉండగా, చెండ్ గాండ్ కు మాత్రం ఇదే మొదటి ప్రయాణం. ప్రమాదకరమే అయినా అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారాయన. ఇక ఐఎస్ఎస్ స్థానంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యురోపియన్ దేశాలు నిర్మించతలపెట్టిన ఐఎస్ఎస్2.0పై ఇంకా స్పష్టతరావాల్సిఉంది.